India Vs Pakistan: పాకిస్తాన్ తో యుద్ధం నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఢిల్లీలోని ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ ను అందుబాటులోకి తెచ్చింది. సహాయం కోసం ప్రత్యేక నంబర్లను అందుబాటులో ఉంచింది. మరోవైపు దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన ఏపీ సైనికుడు మురళి నాయక్ కు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. రాష్ట్రంలో భద్రతా చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. అందులో భాగంగానే తెలుగు ప్రజల అవసరాల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్, లాడ్డాఖ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో తెలుగువారు, ఆయా ప్రాంతాలకు వెళ్లే వారి సహాయం కోసం ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి సమాచారం, సహాయం కావాలన్నా ఏపీ భవన్ లో ఈ కంట్రోల్ రూమ్ సేవలు అందిస్తుంది.
Also Read: పాక్ కు మరో బ్లాక్ డే.. వణికిపోతున్న ప్రజలు
* అందుబాటులో ఉన్న నెంబర్లు ఇవే..
ఢిల్లీలో ఏపీ భవన్ లో ఈ కంట్రోల్ రూమ్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. ఎటువంటి సహాయం కావాల్సినవారైనా.. 9871999430, 011- 25387 089, 98719 99053 కంట్రోల్ రూమ్ నంబర్లకు ఆశ్రయించవచ్చు. అదనపు సమాచారం కోసం డిప్యూటీ కమిషనర్ 9871990081, లేదా లైసెన్ ఆఫీసర్ నెంబర్ 9818395 787 నంబర్కు సంప్రదించాలని అధికారులు సూచించారు. మరోవైపు ఇండియా పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.
* సీఎం చంద్రబాబు నివాళులు..
వీరమరణం పొందిన తెలుగు సైనికుడు మురళి నాయక్ కు సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందాడు. మురళి నాయక్ మరణం విషాదకరమని.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు అర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు. మురళి నాయక్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. మరోవైపు ఆపరేషన్ సింధూర తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో అత్యున్నత సమీక్ష నిర్వహించారు. భద్రతా చర్యల గురించి డిజిపిని అడిగి తెలుసుకున్నారు. సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.