Astrology: దేవుళ్ళు అందరిలో ఆది దేవుడిగా.. విఘ్నాలను తొలగించే దైవంగా పేర్కొనే వినాయకుడికి ప్రతిరోజు పూజ చేస్తుంటారు. ఏదైనా శుభకార్యం ప్రారంభించినా.. పని మొదలుపెట్టినా.. విఘ్నేశ్వరుడి పూజ లేకుండా ముందుకు వెళ్ళదు. అయితే ప్రతి ఏడాది వినాయక చవితి ఉత్సవాలలో మాత్రమే కాకుండా ప్రతిరోజు పార్వతీపుత్రుడిని స్మరించుకోవడం వల్ల ఎన్నో శుభాలు జరిగే అవకాశం ఉంది. కష్టాలు, దుఃఖాలు, సమస్యలు ఎదుర్కొనే వారు గణేశుడును స్మరించుకుంటే అన్ని విధాలుగా సహాయంగా ఉంటారని చెబుతారు. అయితే వినాయకుడికి సాధారణంగా కాకుండా ప్రత్యేక మంత్రం ద్వారా స్మరించడం వల్ల ఆ స్వామి అనుగ్రహం తొందరగా పొందవచ్చని చెబుతున్నారు. ఇంతకీ ఆ మంత్రం ఏంటి? దానిని ఎలా పఠించాలి?
ఓం గం గణపతయే నమః.. ఈ మంత్రమును ప్రతిరోజు 108 సార్లు ఉచ్చరిస్తే ప్రతి వ్యక్తిలోని అసమతుల్యతలు తొలగి మనసుకు స్థిరత్వం లభిస్తుంది. అప్పటివరకు ఉన్న దోషాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక చింతలపై శ్రద్ధ పడుతుంది. ఈ మంత్రమును గణపతి మూల మంత్రం లేదా బీజాక్షర మంత్రం అని అంటారు. ఈ మంత్రంలో ఓం అనగా సృష్టికి మూలమైన పరబ్రహ్మ స్వరూపానికి సర్వశక్తి అని అర్థం. గమ్ అనగా ఆటంకాలను తొలగించే శక్తి అని అర్థం. గణపతి అనగా గణాలు అనగా దేవతలు, భూతములు, మనుషులు.. అన్నిటికీ గణపతి అధిపతి అని అర్థం. నమః అంటే నమస్కరించడం అని అర్థం.
ఈ విశ్వమంతానికి మూల పురుషుడైన.. ఓంకార స్వరూపుడైన గణపతి నాలోని సమస్యలన్నింటిని తొలగించి నాపై అనుగ్రహం ఉంచండి అని ఈ మంత్రం ద్వారా వేడుకుంటారు. ప్రతిరోజు 108 సార్లు ఈ మంత్రం జపించడం వల్ల ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటారు అయితే ఈ మంత్రం ప్రత్యేక సందర్భంలో చదవాలన్న నియమం ఏమీ లేదు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు దీనిని చదవవచ్చు. అలాగే విద్యార్థులు విద్యను మొదలుపెట్టేముందు కూడా జపించవచ్చు. ముఖ్యమైన పరీక్ష ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు, శుభకార్యం నిర్వహించేటప్పుడు కూడా దీనిని చదవచ్చు. అయితే ప్రతిరోజు ఉదయం స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత ఈ మంత్రాన్ని జపించడం వల్ల గణనాథుడు సంతోషిస్తాడని అంటున్నారు. అలాగే సంకష్టహర చతుర్థి రోజు, ప్రతి మంగళవారం కూడా ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఎంతో ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు తెలుపుతున్నారు.
అయితే 108 సార్లు ఈ మంత్రాన్ని చదవలేని వారు 11 లేదా 21సార్లు కూడా జపించవచ్చు. 108 సార్లు చదవాలని అనుకునేవారు జపమాల ద్వారా పఠించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. దీంతో మనసులో సానుకూల శక్తి ఏర్పడి ధైర్యాన్ని నింపుతుంది. తద్వారా ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా నిత్యం సంతోషంగా ఉండగలుగుతారు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించాలని అంటున్నారు.