Idols House: హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుళ్లను విగ్రహా రూపంలో పూజిస్తూ ఉంటారు. ఆలయాల్లో ఉన్న విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకుంటారు. అయితే కొంతమంది ఇంట్లో కూడా విగ్రహాలను పెట్టి పూజించి.. ఇంటికి శుభప్రదం కలగాలని కోరుకుంటూ ఉంటారు.. ఆలయాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. విగ్రహాల ఏర్పాటు సమయంలో ప్రాణ ప్రతిష్ట పూజలు నిర్వహించి.. నిత్య పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇంట్లో విగ్రహాలు ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయాలి? విగ్రహాలు ఉండడం మంచిదేనా?
ఇంట్లో శుభప్రదం.. ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడడానికి విగ్రహాలను తీసుకురావడం మంచిదే. కానీ ఇంట్లో విగ్రహాలు ఏర్పాటు చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా 12 అంగుళాల లోపు విగ్రహాలు ఉండడంవల్ల ఎలాంటి పూజలు నిర్వహించాల్సిన అవసరం లేదు. కానీ అంతకుమించి ఎత్తు ఉన్న విగ్రహాలకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో శివలింగం విగ్రహం ఉంటే నిత్యాభిషేకం చేయడం మంచిది. అలా చేయకుండా ఉండడంవల్ల దోషం ఏర్పడే అవకాశం ఉంది. విగ్రహాలను శుచి, శుభ్రత ఉన్న ప్రదేశాల్లో ఉంచాలి. ప్రత్యేకంగా పూజ గదిలో ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇంటికి తీసుకొచ్చిన విగ్రహాలు ఒకవేళ అనుకోకుండా పగిలితే… వాటిని సమీప చెరువులో లేదా పారే నీటిలో వేయాలి. పగిలిన విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచుకోరాదు.
బెడ్ రూముల్లో.. అశుభ్రత ప్రదేశంలో విగ్రహాలను ఉంచరాదు. అయితే అలంకరణ కోసం విగ్రహాలు కొనుగోలు చేస్తే వాటిని తక్కువ సైజులో ఉన్న వాటిని కొనుగోలు చేయడం మంచిది. అలంకరణ కోసం ఇంట్లో విగ్రహాలను ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఈ విగ్రహాలు పూజకు దూరంగా ఉంచాలి. పూజ కోసం అయితే వెంకటేశ్వరుడు, లక్ష్మీదేవి విగ్రహాలు కొనుగోలు చేయాలి. వినాయకుడు విగ్రహాన్ని అలంకరణ కోసం కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ విగ్రహం కూడా మంచి ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. అవసరమైతే ప్రతిరోజు ఒక పుష్పం ఉంచాలి.
ఇంట్లో విగ్రహాలను ఏర్పాటు చేయగలిగితే ఈశాన్య ప్రదేశంలో ఉంచుకోవడం మంచిది. ఇలా ఏర్పాటు చేయడం వల్ల ఇంటికి ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే ఇంట్లో ధన ప్రవాహం ఉంటుంది. ఈశాన్యం వీలుకాకపోతే ఉత్తరం దిశలో కూడా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ దిశలో లక్ష్మీదేవి, కుబేరుడిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా ఉంచడం వల్ల ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ఇంట్లో విగ్రహాలు ఏర్పాటు చేసేటప్పుడు గోడకు తగలకుండా ఉంచాలి.. అలాగే నేలపై కాకుండా ఒక పీఠం ఏర్పాటు చేసి వీటిపై విగ్రహాలు ఉంచడం మంచిది. ఇంటికి ప్రధాన ద్వారానికి ఎదురుంగా దేవుళ్ళ విగ్రహాలు ఉంచడం మంచిది కాదు.