Vamsadhara River : వంశధార నది పేరు మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పేరులో ‘వంశ’ అంటే వెదురు అని, ‘ధార’ అంటే నీటి ప్రవాహమని అర్థం వస్తుంది. వెదురుతో కప్పిన అడవుల నుంచి ఉద్భవించిన ఈ నదికి ఒరియాలో బంసధార అని పేరు. అలాగే ఈ నది తెలుగులో వంశధార అని పిలవబడుతుంది. అటువంటి వంశధార నది ఏర్పడడంపై ఒక పురాణ గాథ కూడా ప్రాచుర్యంలో ఉంది అంటున్నారు ప్రజలు.
ఒకప్పుడు అంటే పూర్వం దక్షిణ సముద్ర తీరాన ఉన్న శ్వేతపురమనే గ్రామాన్ని శ్వేత చక్రవర్తి పరిపాలించేవారట. ఆయనకు విష్ణు ప్రియ అనే సతీమణి ఉండేవారు. ఆమె విష్ణు భగవానుడికి పరమ భక్తురాలు. ఒకరోజు ఏకాదశ వ్రత దీక్షలో ఉండగా.. ఆమె భర్త శ్వేత మహారాజు వేటకు వెళ్లి ఇంటికి వస్తున్నాను మిమ్మల్ని చూసేందుకని వర్తమానము పంపించగా.. అటు భర్తను ఇటు వ్రతమును, దేనిని వదలలేక బాధపడుతూ శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు. అయ్యా ఈ వ్రతం చేస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్రతం భంగం కాకుండా ఉండేలా చూడమని కోరారట.
రాణి విష్ణు ప్రియ బాధను విన్న శ్రీ మహావిష్ణువు ఒక విషయం చెప్పారట. వారిద్దరి భార్యాభర్తల మధ్యలో ఒక వెదురు బొంగును ఉంచి అందులో నుండి ఒక నదిని సృష్టించి.. ఒకవైపు భార్యను.. మరోవైపు భర్తను నది రెండుగా చీల్చి విడదీసారు అనితెలుస్తుంది. ఈ విషయం గురించి ఇక్కడ చరిత్ర ప్రాచుర్యంలో ఉంది. అయితే హఠాత్తుగా నది అడ్డుగా రావడంతో ఆశ్చర్యపోయిన రాజు అసలు విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారట.
నారదుడు ముని రూపంలో వచ్చి వ్రతభంగం జరగకూడదని మీ ఇద్దరి మధ్యన ఈ గంగాదేవి వచ్చేలా చేసి విడదీసిందని తెలిపారట. ఈ గంగా ప్రవాహము సాగరంలో కలిసిపోవాలన్నా మీ భార్య కనిపించాలన్నా.. ఈ కూర్మ మంత్రంతో మీరు తపస్సు ఆచరించాలి అన్నారట. దీంతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించి మనోవేదన తీరుస్తారని నారదుడు చెప్పి సెలవు ఇచ్చారట.
ఇది విన్న మహారాజు పశ్చాత్తాపంతో ఈ తప్పును నేను ఏ విధంగా సరిదిద్దుకోవాలని తపన పడి, తపస్సు ఆచరించగా.. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై.. రాజా శ్రీ కూర్మావతారంలో తాను ఉన్నట్లు, ఆలయాన్ని నిర్మించమని కోరారు. శ్రీ కూర్మం తపస్సు చేసే ప్రదేశంలో కూర్మనాథ స్వామి ఆలయం, శ్వేత గిరి కొండపైన వేణుగోపాల స్వామి ఆలయం వెలిసాయి. అంతేకాదు మరో 4 శివాలయాలను కూడా ప్రతిష్టించాడు ఆ రాజు. ఇలా వెదురు బొంగులో నుంచి నీరు రావడం వలన ఏర్పడిన నది కావడంతో.. వంశధార నదిగా పేరు కాంచింది ఈ నది. ఈ నది శ్రీకాకుళం జిల్లాలో 80 కిలోమీటర్ల మేర ప్రవహించి కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందనే విషయం తెలిసిందే.