Gupt Navratri 2024: వారాహి దేవిని ఎలా పూజించాలి.. వ్రతాచారం ఏంటి? ఆషాఢ గుప్త నవరాత్రుల ప్రత్యేకతేంటంటే?

అమ్మవారు భండాసురుడు అనే రాక్షసుడిని సంహించేందుకు పుడుతుందట. అమ్మలందరకీ మూలపుట్టమ్మ లలితాదేవి అని అంటారు. దేవతలంతా ఆమెకు సహకరిస్తాం అంటే వద్దని వారించిన అమ్మవారు.. తనలోపల నుంచే సృష్టి ప్రారంభిస్తుందట.

Written By: Swathi Chilukuri, Updated On : July 6, 2024 12:35 pm

Gupt Navratri 2024

Follow us on

Gupt Navratri 2024: ఆషాడ మాసం అంటే పూజలు పుణ్యక్షేత్రాలు అంటూ వెళ్తుంటారు భక్తులు. ఈ మాసం ఆరంభంలో మొదటి తొమ్మిది రోజులను వారాహి నవరాత్రులు అని పిలుస్తుంటారు. అయితే ఈ నవరాత్రులు అందరూ చేయవచ్చా? లేదా? ఇంతకీ ఈ వారాహీ అమ్మవారి గురించి పురాణాల్లో ఏముంది అనే వివరాలు ఒకసారి తెలుసుకుందాం?

బ్రహ్మాండ పురాణం, మార్కండేయ పురాణం, మత్స్యపురాణాలలో వారాహి దేవి మహిమల గురించి ప్రస్తావించారు.

బ్రహ్మాండ పురాణం ఏం చెబుతుంది?
అమ్మవారు భండాసురుడు అనే రాక్షసుడిని సంహించేందుకు పుడుతుందట. అమ్మలందరకీ మూలపుట్టమ్మ లలితాదేవి అని అంటారు. దేవతలంతా ఆమెకు సహకరిస్తాం అంటే వద్దని వారించిన అమ్మవారు.. తనలోపల నుంచే సృష్టి ప్రారంభిస్తుందట. అలా లలితాదేవి బుద్ధి శక్తిలోంచి శ్యామలాదేవి , హృదయంలోంచి బాలాత్రిపుర సుందరి, అహం అనే ప్రజ్ఞ నుంచి వారాహి అమ్మవారు ఉద్భవిస్తారు. లలితాదేవికి వారాహీదేవి సైన్యాధ్యక్షురాలిగా నియమించగా…అప్పుడు ఆమె విషంగుడు అనే రాక్షసుడని చంపేస్తుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది.

మార్కండేయ పురాణం ఏం చెబుతుంది?
వరాహస్వామి నుంచి బయటకు వచ్చిన శక్తినే వారాహి శక్తి అంటారట. చండీసప్తశతి లో అమ్మవారిగురించి ప్రస్తావన ఉందట. రాక్షససంహారం కోసం లలితాదేవికి…దేవతలంతా వారి శక్తులను ఇస్తారు. బ్రహ్మదేవుడు సరస్వతిని బ్రాహ్మీరూపంలో, శివుడు పార్వతీదేవిని మాహేశ్వరి, విష్ణువు వైష్ణవి, నారసింహుడు ప్రత్యంగిరీ దేవి , కుమారస్వామి కౌమారీ రూపంలో శక్తులను ఇచ్చారు. వీరినే సప్తమాతృకలు అని పిలుస్తారు.

హిరణ్యకశిపుడు సోదరుడు హిరణ్యాక్షుడు మృత్యువులేని వరం అమ్మవారిని ప్రార్థించి కోరతాడు . అమ్మవారు తప్ప దేవతలు, మనుషులు తనను చంపకూడదని కోరుతాడు. అంతేకాదు వెనువెంటనే కూడా అమ్మవారు తనను చంపకుండా వరం పొందుతాడు. దీంతో వరాహస్వామి రూపంలో ఉన్న స్వామివారిలో కొలువైన వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడిని సంహరిస్తుందని ఈ మార్కండేయ పురాణం చెబుతుంది…

మత్స్యపురాణం ఏం చెబుతుంది?
అంధకాసురుడిని సంహరించేందుకు పరమేశ్వరుడు వెళుతున్నప్పుడు కొన్ని శక్తులు ఆ పరమశివుడికి సహాయం చేస్తాయి. వాటిలో ఒకటి వారాహీ అమ్మవారు అని ఈ మత్స్యపురాణం చెబుతుంది.

ఎవరు పూజించాలి?
మంచివారికి శుభం కలిగిస్తే..అహంకారం, అసూయ, ఈర్ష్య,ద్వేషంతో ఉండే వారికి అమ్మవారు దూరంగా ఉంటుందట. అమ్మవారిని పూజించే లక్షణాలు ఉంటేనే వారాహి అమ్మవారిని పూజించడం సాధ్యం అవుతుంది. లేదంటే ఛాయలకు కూడా అమ్మవారు రానివ్వరట. అంటే.. తనని ఎవరు పూజించాలో ఎవరు వద్దో అమ్మవారే చెబుతుంది అని అంటారు పండితులు. కేవలం సాత్విక పద్ధతిలో మాత్రమే అమ్మవారిని పూజించాలని.. వామాచార పద్ధతుల జోలికి వెళ్లకూడదు అని అంటారు. బ్రహ్మవిద్యా స్వరూపిణిగా ఎవరు అయినా అమ్మవారిని ఆరాధించవచ్చు. అయితే అమ్మవారి కృత మనపై ఉండేలా ఆరాధిస్తే కచ్చితంగా ఇక అన్నీ మంచి రోజులే అంటారు పండితులు.