Lord Ayyappa Swamy temple
Sabarimala : కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు హరిహర పుత్రుడు అయ్యప్పస్వామి నామస్మరణ వినిపిస్తూ ఉంటుంది. కొందరు శివుడిని కొలుస్తారు.మరికొందరు విష్షువును ఆరాధిస్తారు. కానీ అయ్యప్ప స్వామికి పూజలు చేయడం వల్ల ఇద్దరినీ కొలిచినట్లు ఉంటుందని కొందరు చెబుతుంటారు. అయ్యప్పస్వామి దీక్షలు చేపట్టిన తరువాత ఆయురారోగ్యాలు, సిరిసంపదలు ఉంటాయని చాలా మంది భక్తుల విశ్వాసం.అందుకే రోజురోజుకు అయ్యప్ప దీక్షలు చేపట్టేవారి సంఖ్య పెరిగిపోతుంది. దాదాపు మూడు నెలల పాటు భక్తులు అయ్యప్పస్వామి దీక్షలు కొనసాగుతాయి. ఆ తరువాత శబరిమలైకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. శబరిమలై పుణ్యక్షేత్రం 18 కొండల మధ్య ఉంటుందని అంటారు. అయితే స్వామి వారిని దర్శించుకునే ముందు 18 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఇవి బంగారు తాపడంతో ఉన్న మెట్లు. ఈ 18 మెట్లు సాధారణమైనవి కావు. అంతేకాకుండా వీటిపై అయ్యప్ప దీక్ష చేపట్టిన వారు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. 18 కొండలు, 18 మెట్లు ఉండడానికి కారణమేంటి? వీటి అర్థం ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..
శబరిమలై పుణ్య క్షేత్రం 17 కొండల మధ్య ఉన్న 18వ క్షేత్రం. వీటిలో 1. నాగమల, 2. పొన్నాంబళ మేడ, 3.గౌదవ మల 4. సుందరమల. 5. ఖలిగిమల. 6.చిట్టమ్బల మల 7. దైలాదుమల 8. మాతంగమల 9. దేవరమల 10. శ్రీపాద మల 11. దాలప్పార్ మల 12. నీలిమల. 13. పుత్తుశేరిమల 14. కరిమల 15. కాళైకట్టి మల 16. ఇంజాప్పార 17. నీల్కల్ మల 18. శబరిమల
ఈ 18 కొండలు దాటిన తరువాత అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 మెట్లపై వెళ్లాల్సి ఉంటుంది. ఈ 18 మెట్లపై 18 దేవతలు ఉంటారని అంటారు. వీరిలో 1.కళింకాళి 2. మహాంకాళి 3. గంధర్వరాజ 4. సుబ్రహ్మణ్య 5. కృష్ణ పింగళ 6. కార్తవీర్య 7. బైరవ 8. హిడింబ 9. బేతాళ 10. నాగరాజ 11. కర్ణ వైశాఖ 12. పుళిందిని 13. రేణుకా పరమేశ్వరి 14. స్వప్న వారాహి 15. ప్రత్యంగళి 16. నాగ యక్షిణి 17. మహిషాసుర మర్దిని 18. అన్నపూర్ణేశ్వరి
పూర్వకాలంలో రాజరాజశేఖరుడికి అయ్యప్పస్వామి దొరికాడు. ఆ తరువాత కొన్నేళ్ల తరువాత అయ్యప్పస్వామి కోరిక మేరకు తనకు రాజరాజశేఖరుడు అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన వారు ఆలయంలోకి ప్రవేశించే ముందు ఈ 18 మెట్లపై వెళ్లాల్సి ఉంటుంది. వీటిపై వెళ్లడం వల్ల మనిషిలోని చెడు గుణాలు తొలగి మంచి గుణాలు వస్తాయని భక్తులు నమ్మతూ ఉంటారు. అంతేకాకుండా ఎరుమేలి నుంచి శబరి మలై వరకు ఉన్న 18 కొండలు దాదాపు 90 కిలోమీటర్ల వరకు దట్టమైన అడవి నుంచి నడిచి వెళ్తారు. ఇలా పాదయాత్ర చేయడం వల్ల ప్రశాంతమైన, స్వచ్ఛమైన వాతావరణం శరీరానికి తాకుతుంది. దీంతో ఎటువంటి రోగాలు లేకుండా ఉంటారని చెబుతారు. అందువల్లే జీవితంలో ఒక్కసారైనా అయ్యప్పస్వామిని దర్శించుకోవాలని చూస్తారు.