VIP darshan: మనుషులు చేసే కొన్ని పనులు సాధ్యం కానప్పుడు.. కష్టాలు ఎదురైనప్పుడు.. సమస్యలు పరిష్కరించ లేనప్పుడు.. సహాయంగా దైవాన్ని కోరుకుంటారు. అయితే దైవం ఎప్పుడూ మన వెంటే ఉంటుంది. మనం చేసే పనులను గమనిస్తూ సక్రమమైన మార్గంలో ఉంచాలని ప్రయత్నిస్తూ ఉంటుందని ఆధ్యాత్మిక వాదులు అంటూ ఉంటారు. అయితే మనం చేసే పనులు మనం చేస్తూ.. మానసిక ప్రశాంతత కోసం.. ఆధ్యాత్మిక చింతన కోసం.. దేవాలయాలకు వెళుతూ ఉండాలి. అయితే దేవాలయాలకు వెళ్లిన వారిలో కొందరు దేవుడిని నిర్మలమైన మనసుతో దర్శించుకోవడం కాకుండా.. డబ్బు పెట్టి దర్శించుకోవాలని చూస్తున్నారు. ఇంతలా అంటే ఎక్కువ డబ్బు పెట్టి తొందరగా చూసేయాలని అనుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుందా?
భారతీయ సంప్రదాయాలపై కొందరి విదేశీయులకు బాగా నమ్మకం. అందుకే ఇక్కడి దేవాలయాల గురించి తెలుసుకొని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా వస్తుంటారు. ఇలా ఒక దేశానికి చెందిన మహిళ దైవ దర్శనం కోసం ఒక ఆలయంలో క్యూలో నిల్చుని ఉంది. అయితే ఈ మహిళను చూసి ఆలయానికి సంబంధించిన ఒక వ్యక్తి ఇలా అన్నాడు.. మీరు క్యూలో నిల్చడం దేనికి.. వీఐపీ పాస్ ద్వారా రూ. 501 ఇస్తే నేరుగా దేవుడి దగ్గరికి తీసుకెళ్తాను అని చెబుతాడు. అప్పుడు ఆ మహిళ అతనితో.. రూ.501 కాదు.. రూ. 50,000 ఇస్తా.. దేవుడిని నేను నిలుచున్న దగ్గరికి తీసుకురండి అని చెబుతోంది.. అప్పుడు ఆ వ్యక్తి షాక్ తిని అలా కుదరదు అని చెబుతాడు.. అయితే రూ. 5,00,000 ఇస్తా.. దేవుడిని మా ఇంటికి తీసుకురండి అని అంటుంది. దీంతో ఆ వ్యక్తికి కోపం వచ్చి డబ్బుతో దేవుడిని కొంటారా? అని అంటాడు.
అప్పుడు విదేశీ మహిళ మాట్లాడుతూ.. మరి మీరు చేసేది ఏంటి? దేవుడిని అమ్మకానికి పెట్టారా? ఎక్కువ డబ్బు ఇస్తే తొందరగా దర్శనం.. తక్కువ డబ్బు ఇస్తే మామూలుగా దర్శనం.. డబ్బు ఇవ్వకపోతే రోజుల తరబడి దర్శనం.. ఇలా ఎందుకు పెడుతున్నారు. దేవుడు ముందు అందరూ సమానమే కదా..? మరి అలాంటప్పుడు డబ్బు ఇచ్చి కొందరు ముందుగా వెళ్లడం.. డబ్బు లేని వారు ఆలస్యంగా దర్శనం అయ్యేలా ఎందుకు చేస్తున్నారు? నిర్మలమైన మనసుతో.. భక్తితో దేవుడి దర్శనానికి వస్తే ఎంత క్యూలో నిలుచున్న ఎలాంటి కష్టం అనిపించదు. ఎందుకంటే మనసులో దేవుడిని చూడాలన్న ఆలోచన తప్ప వేరే ఉండదు. అంతేకాకుండా జీవితంలో కొన్ని రోజులు దేవుడి కోసం కేటాయిస్తే తప్పులేదు.
అలాగే కొందరు దేవుళ్లను నాకు డబ్బు ఇవ్వండి.. నన్ను కోటీశ్వరుడిని చేయండి.. నాకు వచ్చిన దాంట్లో మీకు సగం ఇస్తానంటూ బేరం పెట్టుకుంటున్నారు. ఇలాంటి వారికి అవకాశం ఇచ్చి దేవుడిని మీరు మార్కెట్లోకి పెడుతున్నారు.. అని ఆ విదేశీ మహిళ అనడంతో ఆలయానికి చెందిన ఆ వ్యక్తి పశ్చాతాపానికి గురవుతాడు. మొత్తంగా చెప్పేది ఏంటంటే ఆలయానికి వెళ్లి మంచి మనసుతో దేవుడిని చూడాలే తప్ప.. కమర్షియల్ చేయకుండా ఉండడమే అసలైన భక్తి.