Grama Panchayat Rules: తెలంగాణలో త్వరలో స్థానిక ఎన్నికల సందడి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఆయా గ్రామంలో ఇప్పుడే కొందరు రాజకీయ నాయకులు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానానికి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే వీటిలో సర్పంచ్ ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. ఒక గ్రామానికి అధినేతగా ఉండే సర్పంచ్ గా ఉండేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తారు. ఇందుకోసం రాజకీయంగా ఎన్నో ఎత్తులు వేస్తారు. ప్రజలను ఆకట్టుకోవడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే సర్పంచిగా గెలిచిన తర్వాత ఆ సర్పంచ్ ప్రజలకు నచ్చకపోయినా.. అతను లేదా ఆమె తప్పుడు పనులు చేసినా.. ఎన్నుకున్న ప్రజలే అతడిని పదవి నుంచి తొలగించవచ్చు. అదెలా అంటే?
ఒక గ్రామానికి సర్పంచ్ గా ఎన్నికైన వ్యక్తి గ్రామంలోని ప్రజల మంచి చెడులు చూస్తూ.. సమస్యలను పరిష్కరిస్తూ ఉండాలి. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి గ్రామానికి అవసరమయ్యే నిధులను సేకరిస్తూ ఉండాలి. గ్రామంలో అభివృద్ధి పనులను చేపడుతూ ఉండాలి. భౌతికంగా, నైతికంగా ఒక గ్రామం అభివృద్ధి చెందేందుకు సర్పంచ్ ఎంతో కీలకంగా వ్యవహరిస్తాడు. అయితే సర్పంచ్ గా ఎన్నికైన కొందరు మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో సరైన విధంగా పనులు చేయకుండా ఉంటారు. అలాగే గ్రామానికి చెందిన నిధుల్లో అక్రమాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిపై చర్యలను ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా తీసుకునే అవకాశం ఉంది.
పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 35, 37 ప్రకారం ఒక సర్పంచ్ లేదా ఉపసర్పంచ్.. అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడడం, పక్షపాతం చూపించడం వంటివి చేయడం వల్ల ప్రజలు నష్టపోతే తమ సర్పంచులు తొలగించే అధికారం వారికి ఉంటుంది. అయితే ఇందుకోసం గ్రామంలోని 50% వార్డు సభ్యుల మద్దతు ఉండాలి. వీరు అభిశంషన తీర్మానం ద్వారా తమకు సర్పంచ్ నచ్చలేదు అని ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదును జిల్లా పంచాయతీ అధికారితో పాటు కలెక్టర్ పరిశీలిస్తాడు. వీరి ఆరోపణలు నిజమని తేలితే.. మరోవైపు 50 శాతం వార్డు సభ్యులు సర్పంచును తొలగించాలని కోరితే నిరభ్యంతరంగా తొలగించవచ్చు.
సర్పంచును ప్రజలే ఎన్నుకుంటారు. అలాగే ప్రజలే ఆ వ్యక్తిని పదవి నుంచి దించే అధికారం ఉంటుంది. ఒక దేశంలో లేదా ఒక జిల్లాలో ఒక గ్రామం అభివృద్ధి చెందితేనే ఆ జిల్లాకు పేరు వస్తుంది. అలాంటి గ్రామానికి అధ్యక్షత వహించే సర్పంచ్ పదవి కీలకమైనది. అందువల్ల సర్పంచ్ గా పోటీ చేసే వ్యక్తులు ప్రజల కోసం పనిచేయాలి తప్ప.. అవినీతి, డబ్బు సంపాదన కోసం చేయవద్దని కోరుతున్నారు. అయితే సర్పంచుగా ఎందుకు పోటీ చేస్తున్నారో ప్రజలకు ముందే తెలిపి.. వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయాలి. అప్పుడే నిజమైన రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకుంటారు.