Anjani Mahadev Temple: బాహుబలి సినిమా చూశారా. ఆ సినిమాలో ప్రభాస్ తల్లి శివలింగానికి జలాభిషేకం చేయడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. తల్లి పడుతున్న ప్రయాసను చూడలేక శివలింగాన్ని వెలికి తీస్తాడు. ఆ తర్వాత జలపాతం కింద ప్రతిష్టిస్తాడు. ఆ జలపాతం పైనుంచి హోరున కిందికి ప్రవహిస్తూ ఉంటుంది. దీంతో శివుడికి నిత్యం జలాభిషేకం జరుగుతూ ఉంటుంది. అదంటే సినిమా కాబట్టి అలా ఉంటుంది.. కానీ వాస్తవంలో అలా ఉంటుందా? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ కథనం.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి అందాలకు కొదువ ఉండదు. ఇక్కడ ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. శివుడు నడియాడిన ప్రాంతం కావడంతో ఇక్కడ విస్తారంగా శైవ క్షేత్రాలు ఉంటాయి. కేదారినాథ్ వంటి ప్రఖ్యాత జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఈ ప్రాంతం నుంచి వెళుతుంటారు. ఇక్కడ ప్రకృతి కూడా అద్భుతంగా ఉంటుంది. నిత్యం మంచు దట్టంగా కురుస్తూ ఉంటుంది కాబట్టి.. చూసేందుకు ఆ వాతావరణం ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటుంది.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలి ప్రాంతంలో ఉన్న సోలాంగ్ వ్యాలీలో అంజనీ మహదేవ్ అనే ఆలయం ఎంతో విశిష్టమైనది.
ఈ ఆలయంలో శివుడు స్వయంభుగా వెలిశాడు. ఇక్కడ 50 అడుగుల ఎత్తు నుంచి జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహించడం మాత్రమే కాదు శివుడికి నిత్యం అభిషేకం చేస్తూ ఉంటుంది. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. హనుమంతుడి మాతృమూర్తి అంజని దేవి ఇక్కడ తపస్సు చేసింది. దానికి సంబంధించిన ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. దట్టమైన కొండ ఉండడంతో ప్రకృతి కూడా రమణీయంగా ఉంటుంది.
దట్టమైన కొండమీద చెట్లు విస్తారంగా ఉండడంతో ఈ ప్రాంతం చూసేందుకు అద్భుతంగా దర్శనమిస్తుంది. ఆధ్యాత్మికంతో పాటు ప్రకృతి, పురాణం ఇక్కడ మేళవించి ఉంటాయి. ఈ క్షేత్రాన్ని చూసేందుకు భక్తులు ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు. ముఖ్యంగా కేదార్నాథ్ యాత్ర మొదలైనప్పుడు ఈ క్షేత్రాన్ని చూసేందుకు భక్తులు ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు.. ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తే ఇంకా గొప్పగా ఉంటుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.