Trimbakeshwar Temple: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయం ఎంత ప్రాచీనమైందో చాలా మందికి తెలిసిన విషయమే. అయితే ఈ ఆలయంలో పురావస్తు శాఖ (ASI) ఇటీవల చేపట్టిన పునరుద్ధరణ పనుల్లో అరుదైన ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ఆలయ ప్రాంగణంలోని చారిత్రక ‘అమృత కుండ్’ లో పూడికతీత పనులు నిర్వహిస్తుండగా అడుగుభాగంలో పురాతన శివలింగం బయటపడింది. ఈ శివలింగం కనిపించడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. పూర్తి వివరాల్లోకి వెళితె..
పురావస్తు శాఖ అధికారులు ప్రస్తుతం ఆలయంలోని చారిత్రక నిర్మాణాలను సంరక్షించే కార్యక్రమంలో భాగంగా అమృత కుండ్‌ను శుభ్రపరుస్తున్నారు. ఈ క్రమంలో కుంట అడుగున దాగి ఉన్న శివలింగం వెలుగులోకి రావడం విశేషంగా మారింది. శివలింగం చాలా కాలంగా పూడికలో కూరుకుపోయి ఉండటంతో ఇప్పటివరకు ఎవరికీ కనిపించలేదని అధికారులు భావిస్తున్నారు.
ఈ విషయాన్ని భారత పురావస్తు సర్వేక్షణ (ASI) తమ అధికారిక సోషల్ మీడియా వేదికలో వెల్లడించింది. అమృత కుండ్‌లో పూడికతీత సందర్భంగా పురాతన శివలింగం బయటపడిన ఫోటోలను పంచుకుంటూ, ఇది భారతదేశ ప్రాచీన సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంది. ఆలయాల పరిరక్షణతో పాటు వాటి చారిత్రక విలువలను వెలికితీయడం తమ బాధ్యత అని ASI తెలిపింది.
త్రయంబకేశ్వర ఆలయం దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా అత్యంత పవిత్రమైన క్షేత్రంగా గుర్తింపు పొందింది. గోదావరి నది ఉద్భవించే బ్రహ్మగిరి పర్వత ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. ఇక్కడి అమృత కుండ్‌కు కూడా ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది.
శివలింగం వెలుగులోకి రావడాన్ని భక్తులు దైవ సంకేతంగా భావిస్తున్నారు. చాలా మంది దీనిని శుభ పరిణామంగా అభివర్ణిస్తూ, శివుని కృపకు నిదర్శనంగా చెబుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో దేశవ్యాప్తంగా శివభక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పురావస్తు నిపుణులు ఈ శివలింగం కాలం, నిర్మాణ శైలి, చారిత్రక ప్రాధాన్యంపై అధ్యయనం ప్రారంభించనున్నారు. పరిశోధన అనంతరం దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఆవిష్కరణతో త్రయంబకేశ్వర ఆలయ చారిత్రక విశిష్టతకు మరో కొత్త అధ్యాయం చేరిందని భావిస్తున్నారు.

