Amarnath Temple: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్‌నాథ్ శివలింగంపై ఈ ఏడాది కలత పెట్టే దృశ్యం వెలుగులోకి వచ్చింది. మహా శివుడు మిగతా చోట్ల కంటే అమర్ నాథ్ లో మంచు శివలింగం రూపంలో దర్శనమిస్తాడు. ఈ దేవదేవుడిని దర్శనం చేసుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి ఎన్నో ప్రయాసలు పడి వస్తుంటారు. ఎంత కష్టపడినా…ఇక్కడ మంచులింగం రూపంలో శివుడిని చూసిన తరువాత తమ కష్టాన్ని మరిచిపోతారు. అయితే ఈసారి ఆ శంకరుడి దర్శనభాగ్యం కష్టంగానే ఉండనుంది. ఎందుకంటే ఇక్కడి శివలింగం పూర్తిగా మాయమైపోయింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలోకి రావడంతో తీవ్ర చర్చ సాగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితె..
పవిత్ర అమర్‌నాథ్ మంచు శివలింగం యాత్ర ఇటీవలే ప్రారంభమైంది. అయితే ఇదే సమయంలో శివలింగం గురించి చర్చ సాగుతోంది. ఈ శివలింగంను ఆయా తేదీల్లో తీసిన చిత్రాలను రిలీజ్ చేశారు. వీటిలో మే 23, జూన్ 29, జూలై 7 నాటి ఫొటోలున్నాయి.
మే 23న 7 అడుగులు:
మే 23వ తేదీన సరిహద్దు భద్రతా దళం (BSF) అధికారులు పవిత్ర గుహకు సంబంధించిన ఒక ఫోటోను విడుదల చేశారు. ఆ సమయంలో హిమాలయాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో, మంచు లింగం ఎంతో స్పష్టంగా, గంభీరంగా దాదాపు 7 అడుగుల ఎత్తుతో దర్శనమిచ్చింది. ఈ అద్భుత రూపాన్ని చూసి భక్తులు ఎంతో పులకించిపోయారు.
జూన్ 29: తొలి పూజల నాటికే తగ్గిన పరిమాణం:
అమర్‌నాథ్ యాత్ర అధికారికంగా ప్రారంభమై, గుహలో తొలి పూజలు నిర్వహించిన జూన్ 29వ తేదీ నాటికి పరిస్థితిలో మార్పు వచ్చింది. తొలి పూజల రోజైన జూన్ 29 నాటి చిత్రంలో శివలింగం ఎత్తు 5 అడుగులకు పడిపోవడం స్పష్టంగా కనిపించింది. కేవలం నెల రోజుల్లోనే రెండు అడుగుల మంచు కరిగిపోవడం ఆందోళన కలిగించింది.
జూలై 7: పూర్తిగా కరిగిపోయిన శివలింగం
యాత్ర ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా, జూలై 7వ తేదీ నాటికి పవిత్ర మంచు శివలింగం పూర్తిగా కరిగిపోయింది. ఆ రోజు తీసిన మూడవ చిత్రంలో శివలింగం ఉన్న స్థానంలో కేవలం ఖాళీ పీఠం మాత్రమే కనిపిస్తోంది. కాశ్మీర్ లోయలో ఈ ఏడాది నమోదవుతున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తక్కువ హిమపాతం దీనికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
ఉష్ణోగ్రతల పెరుగుదలనే కారణమా?
హిమాలయ ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవిలో తీవ్రమైన ఉష్ణగాలులు వీచడం వల్ల మంచు వేగంగా కరిగిపోతోంది. ముఖ్యంగా అమర్‌నాథ్ గుహ పరిసరాల్లో ఉష్ణోగ్రతలు గతంతో పోలిస్తే అధికంగా నమోదవుతున్నాయని పర్యావరణ అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీనివల్ల సహజంగా ఏర్పడే మంచు శివలింగం పరిమాణం తగ్గడం లేదా ముందుగానే కరిగిపోతుందని అంటున్నారు. అమర్‌నాథ్ శివలింగం ఏర్పడటానికి శీతాకాలంలో కురిసే భారీ మంచు కీలకం. అయితే ఇటీవలి కాలంలో మంచు కురిసే పరిమాణం తగ్గడంతో గుహలో పేరుకునే మంచు కూడా తగ్గుతోంది. ఫలితంగా శివలింగం పూర్తిస్థాయిలో ఏర్పడకపోవడం లేదా ఏర్పడినా ఎక్కువకాలం నిలవకపోవడం కనిపిస్తోంది.
