Spiritual Rituals: మానసిక ప్రశాంతత కోసం, దేవుడి కృప ఉండాలని ఆలయాలను సందర్శిస్తూ ఉంటాం. అయితే ఇంటి వద్ద ఉండే ఆలయాలతో పాటు దూర ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ క్షేత్రాలను దర్శించుకోవడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. అందుకే చాలామంది వీకెండ్ ట్రిప్ లేదా ఏడాదికి ఒకసారైనా పుణ్యక్షేత్రాలను సందర్శించాలని అనుకుంటూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి క్షేత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. విదేశాల్లో ఉన్న భక్తుల సైతం శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా వస్తూ ఉంటారు. తిరుపతికి వచ్చేవారు కేవలం ఈ ఒక్క ఆలయం మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఆలయాలను దర్శిస్తూ ఉంటారు. వీటిలో పద్మావతి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయం, కాణిపాక ఆలయం ప్రముఖంగా ఉన్నాయి. అయితే వీటిలో శ్రీకాళహస్తి ఆలయం దర్శనం తర్వాత నేరుగా ఇంటికే వెళ్లాలని కొందరు చెబుతున్నారు. అలా ఎందుకు అంటే?
కొంతమంది తిరుపతి దర్శనం చేసుకునేందుకు సమయం ఉంటే.. ముందుగా ఇతర ఆలయాలను దర్శించాలని అనుకుంటారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తిని కూడా దర్శించుకోవాలని అనుకుంటారు. అలా చాలామంది ముందుగా శ్రీకాళహస్తిని దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరుపతి శ్రీవారిని దర్శనం చేసుకునే వారు ఉన్నారు. కానీ కొందరు పండితులు చెబుతున్న ప్రకారం తిరుపతి దర్శనం అయిన తర్వాతనే శ్రీకాళహస్తి దర్శనం చేసుకోవాలని అంటున్నారు. అంతేకాకుండా శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లిన తర్వాత మరే ఆలయానికి వెళ్లకుండా నేరుగా ఇంటికి వెళ్లారని సూచిస్తున్నారు.
Also Read: తప్ప తాగి వినాయకుడి ముందు డాన్స్ చేస్తున్నారా?
శ్రీకాళహస్తి ఆలయం మిగతా ఆలయాల కంటే కొన్ని ప్రత్యేక సాంప్రదాయాలను కలిగి ఉంటుంది. పంచభూతాలైన ఆకాశం, భూమి, వాయువు, నీరు, అగ్ని అన్న విషయం చాలామందికి తెలుసు. వీటికి ప్రత్యేకగా భూమిపై పంచభూత లింగాలు వెలిసాయి. వాటిలో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఉంది. ఇక్కడ గాలిని మరించుకున్న తర్వాత మరే ఆలయానికి వెళ్ళకూడదు అని ఆచారం చెబుతోంది. అలాగే శ్రీకాళహస్తి దేవాలయంలో సర్ప దోష నివారణ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకోవడంతో సర్ప దోషం తొలగిపోతుంది. ఇలా తొలగిపోయిన దోషాన్ని ఇక్కడే వదిలేసి ఇంటికి వెళ్లాలని చెబుతారు. అలాకాకుండా వేరే ఆలయానికి వెళితే దోష నివారణ జరగదని పండితులు చెబుతుంటారు.
అలాగే సూర్య, చంద్రగ్రహణ సమయంలో ఆలయాలు మూసివేసి ఉంటాయి. కానీ శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. ఆ సమయంలో ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. అలాగే ప్రతిరోజు ఇక్కడ పూజలు నిర్వహించడం వల్ల.. ఇక్కడి దైవదర్శనం జరిగిన తర్వాత మరో దైవ దర్శనం అవసరం లేదని పండితులు చెబుతూ ఉంటారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాలలో.. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా అన్ని రకాలుగా ఈ ఆలయం ప్రత్యేకత చాటుకుంది.