Vinayaka Chavithi 2025: పార్వతీ పరమేశ్వరుల ప్రియ పుత్రుడు విఘ్నేశ్వరుడికి పూజ చేసిన తర్వాతనే ఏ కార్యక్రమమైనా ప్రారంభించాలి అని నియమం ఉంది. విఘ్నాలను తొలగించే ఆ మహాగణపతిని ఎంతో ప్రేమతో సేవిస్తే అంత కరుణ చూపించి భక్తులను కాపాడుతాడని చెబుతారు. అయితే మహాగణపతికి వారం రోజులపాటు పూజ చేయడానికి ప్రతి ఏడాది వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకుంటూ ఉంటాం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా.. కులమత బేధాలు మరిచిపోయి అందరూ ఒకటే అని భావించి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. అయితే ఇందులో వేసే కొన్ని వెర్రి వేషాలు ఎందుకు అని కొందరు ప్రశ్నిస్తున్నారు?
వినాయక చవితి రోజు గణేష్ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అయితే ఈ ఉత్సవాలకు ముందే వినాయక విగ్రహాలను కొనుగోలు చేసి చవితి రోజు మండపాలకు తరలిస్తూ ఉంటారు. ఇలా మండపాలకు తరలించే ముందు డిజె సౌండ్స్ పెట్టి యువకులు డాన్స్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో మండపాల్లో అసభ్యకర డాన్సులు చేస్తున్నారు. ఇక నిమజ్జనం రోజు సినిమా పాటలు పెట్టి డిస్కో డాన్సులు చేస్తున్నారు. ఇలా చేసిన వారిలో కొందరు మద్యం సేవిస్తున్నారు. ఎంతో పవిత్రంగా భావించే గణపతి ముందు ఇలా చేయడం ఎందుకు అని కొందరు ఆధ్యాత్మికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. పవిత్రంగా భావించే మహాగణపతి ముందు ఎంతో పవిత్రంగా ఉంటేనే ఆ స్వామి కరుణిస్తాడని పేర్కొంటున్నారు.
వినాయకుడికి ఒక ప్రత్యేక రూపం ఉంది. ముఖంలో తొండంతో.. భారీ పొట్టతో ఆ మహాగణపతి భక్తులకు దర్శనం ఇస్తాడు. కానీ కొందరు వినాయకుడిని వివిధ రూపాల్లో తయారు చేస్తున్నారు. సినిమా హీరోలు, క్రికెటర్స్, రాజకీయ నాయకుల రూపాల్లో వినాయకుడిని ఏర్పాటుచేసి పూజలు చేస్తున్నారు. వినాయకుడికి పార్వతీదేవి ప్రత్యేక రూపం అందించింది. ఆ మహామాత అందించిన ప్రత్యేక రూపంలో మాత్రమే పూజించాలి గాని.. ఇలా తమకు ఇష్టం వచ్చిన రూపాయలతో వినాయకుడిని తయారుచేసి పూజలు చేయడం దేనికి? అని కొందరు వాదిస్తున్నారు. వినాయకుడిని సొంత రూపంలోనే పూజించడం వల్ల ఎంతో ఇష్టపడతాడు.
మరో విషయంలో వినాయకుడికి రకరకాల వస్తువులతో అలంకరణ చేస్తారు. కొందరు నోట్ల కట్టలతో మండపం నింపుతారు. వాస్తవానికి డబ్బు అనేది లక్ష్మికి ప్రతిరూపం. లక్ష్మీ దేవికి అత్యంత ఇష్టమైన గణపతి నీ ఇలా డబ్బుతో అలంకరణ చేస్తారు. అయితే ఇలా అలంకరణ చేసిన డబ్బులు వివిధ రూపాల్లో వాడుతూ ఉంటారు. అప్పటివరకు మండపాల్లో ఈ డబ్బులను ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. ఆ తర్వాత వాటిని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వినాయకుడు మాత్రమే కాకుండా లక్ష్మీదేవి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుందని అంటున్నారు. అయితే వినాయకుడికి లక్ష్మీదేవినీ కూడా తోడు ఉంచాలని అనుకున్నప్పుడు వినాయకుడి వద్ద ప్రత్యేకంగా కొన్ని డబ్బులను ఉంచితే సరిపోతుంది. ఒక్క రూపాయిలో కూడా లక్ష్మీదేవి ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. వినాయకుడికి అలంకరణ అంటే చాలా ఇష్టం. అయితే ఇది ఆధ్యాత్మిక వాతావరణం కలిగి ఉంటే బాగుంటుందని ఆధ్యాత్మికవేత్తలు కోరుతున్నారు.