Mahankali Ammavaru Temple: తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలకు కొదవలేదు. ఒకప్పుడు ఇవి అంతగా వెలుగులోకి వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. మీడియా విస్తృతి విపరీతంగా పెరిగిపోయిన తర్వాత ఈ తరహా వీడియోలు.. అద్భుత దృశ్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. సమాజానికి తెలిసిపోతున్నాయి. అటువంటిదే ఈ అద్భుతం కూడా..
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల ప్రాంతంలోని మహంకాళి నగర్ అనే ఏరియా ఉంది. ఈ ప్రాంతానికి మహారాష్ట్ర నుంచి హరి సింగ్ అనే వ్యక్తి తన భార్య తోని, ఇతర కుటుంబ సభ్యులతో వలస వచ్చాడు. అతడు మొదటి నుంచి కూడా అమ్మవారి భక్తుడు. తాను కోరుకున్న కోరికలు నెరవేరిన నేపథ్యంలో అమ్మవారికి ఆలయం నిర్మించాలని అనుకున్నాడు. ఇందులో భాగంగా హరి సింగ్, సోనీ దంపతులు అమ్మవారికి ఆలయ నిర్మించారు. హరి సింగ్, సోనీ దంపతులు రొట్టె పీటలు, గాజుల స్టాండ్ లు, ఇతర పరికరాలు అమ్ముతూ జీవించేవారు. హరి సింగ్ దంపతులకు ఐదుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు. సరిగా 45 సంవత్సరాల క్రితం హరి సింగ్ దంపతులు అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో మహంకాళి అమ్మవారిని ప్రతిష్టించారు. అమ్మవారి విగ్రహం కింద భూగర్భంలో మరో గదిని నిర్మించారు. అందులో దుర్గాదేవిని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం చుట్టూ కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ నీరు నిలిచి ఉంటుంది. అది కూడా మూడు అడుగుల మేర ఉంటుంది.
వాస్తవానికి ఆ నీరు ఆలయంలో పలికి ఎలా వస్తుందో? ఎలా బయటకు వెళ్లి పోతుందో? ఇప్పటికీ అర్థం కాదు. ప్రతి ఏడాది దసరాకు ఇక్కడ దుర్గాదేవికి నవరాత్రులు నిర్వహిస్తుంటారు. ఆ సందర్భంగా వచ్చే భక్తులు అమ్మవారి చుట్టూ ఉన్న నీటిని తీసుకెళ్తారు. ఆ నీటితో స్నానం చేస్తే అనారోగ్యాలు మాయం అవుతాయని నమ్ముతారు. హరి సింగ్ సరిగ్గా 25 సంవత్సరాల క్రితం కాలం చేశారు. ఇక అతడి కుటుంబ సభ్యులు, ఇతరులతో కలిసి మొత్తం అక్కడ 120 కుటుంబాలు ఏర్పాటయ్యాయి. అందువల్లే ఆ ప్రాంతాన్ని మహంకాళి నగర్ అని పిలుస్తుంటారు. కేవలం హరి సింగ్ కు సంబంధించిన వారే ఈ ప్రాంతంలో ఉండడం విశేషం. అయితే దుర్గాదేవి ఆలయం చుట్టూ నీరు వస్తున్న నేపథ్యంలో కాంక్రీట్ తో ఫ్లోరింగ్ చేశారు. దీనికోసం ఐదు లక్షల ఖర్చు కూడా చేశారు. అయినప్పటికీ నీరు ఆగడం లేదు.