Assembly Fight: బోథ్ అసెంబ్లీ నియోజవర్గం.. ఎస్టీ రిజర్లు అయిన ఈ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. ఇక్కడి నుంచి ఐదుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు టీడీసీ అభ్యర్థులు విజయం సాధించారు. టీఆర్ఎస్ మూడుసార్లు గెలిచింది. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్(బీఆర్ఎస్) నుంచి గెలిచిన రాథోడ్ బాపూరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపూరావుపై ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన సోయం.. ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలిచారు.
బీఆర్ఎస్లో అంతర్గత పోరు..
అధికార బీఆర్ఎస్లో ప్రస్తుతం అంతర్గత పోరు కొనసాగుతోంది. బోథ్ ఎంపీపీ శ్రీనివాస్‌రావు ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. పార్టీ పెద్దలు కేటీఆర్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆశీస్సులు మెండుగా ఉండడంతో ఎమ్మెల్యేను ఖాతర్ చేయడం లేదు. సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే గొడం నగేష్ వచ్చే ఎన్నికల్లో బోథ్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. గతంలో టీడీపీ తరఫున పోటీచేసిన నగేష్.. 2014లో ఆదిలాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి గెలిచారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్‌కు దీటుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆశీస్సులు నగేష్‌కు ఉన్నాయి.
ఒంటరైన బాపూరావు..
అధికార పార్టీలోనే అంతర్గతంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు వ్యతిరేకంగా నేతలు పావులు కదుపుతున్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు బాపూరావుకు అంత ఈజీ కాదన్న అభిప్రాయం సొంత పార్టీలోనే వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఒంటరైన బాపూరావుపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ పనికి డబ్బులు వసూలు చేస్తారన్న విమర్శలు ఉన్నాయి. అభివృద్ధి కూడా పెద్దగా ఏమీ లేదు. దీంతో ప్రజల్లో బాపూరావుపై వ్యతిరేకత పెరిగింది.
బీజేపీ నుంచే పోటీ..
ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచే బీఆర్ఎస్కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. బీజేపీ తరఫున ప్రస్తుత ఎంపీ సోయం బాపూరావు బరిలో నిలవాలని అనుకుంటున్నారు. అసెంబ్లీకి వెళ్లాలని భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లోనూ బాపూరావుల మధ్యనే పోటీ నెలకొంది. 12 వేల పైచిలుకు మెజారిటీతో రాథోడ్ బాపూరావు విజయం సాధించారు. ఈసారి అలా జరగకుండా సోయం బాపూరావు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేసినా ఓడించాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి గజేందర్, నరేశ్, అశోక్ పేర్లు టికెట్ రేసులో వినిపిస్తుండగా.. ప్రధాన పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన నేతలను ఎన్నికల సమయానికి అక్కున చేర్చుకొని టికెట్ ఇవ్వాలని హస్తం పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
కాంగ్రెస్‌తో టచ్‌లో నగేష్..
ఇక సిట్టింగులకే టికెట్ అని కేసీఆర్ ప్రకటించారు. సర్వే ఆధారంగా టికెట్లు ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ టికెట్‌పై స్పష్టత లేదు. ఈ క్రమంలో నగేష్‌కు బీఆర్ఎస్ టికెట్ దక్కకుంటే కాంగ్రెస్ గూటికి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పెద్దలతో టచ్‌లోకి వెళ్లారని సమాచారం. ఒకసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన నగేష్.. రేవంత్‌రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. టీడీపీలో ఇద్దరు కలిసి పనిచేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌లో చేరితే టికెట్ ఖాయమని ప్రచారం జరుగుతోంది.
త్రిముఖ పోరే..
మొత్తంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదన్న అభిప్రాయం నియోజకవర్గంలో వ్యక్తమవుతోంది. రాథోడ్ బాపూరావు, సోయం బాపూరావు, గొడం నగేష్ మధ్య పోటీ ఉంటుందని తెలుస్తోంది. ముగ్గురికీ నియోజకవర్గంలో పట్టు ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ముగ్గురి మధ్య గట్టి పోటీ ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఎవరు గెలిచినా 10 వేల లోపు మెజారిటీతోనే అని అంటున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Special article about boath assembly constituency
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com