Sri Chaitanya Chairman BS Rao
Sri Chaitanya Chairman BS Rao: శ్రీ చైతన్య.. ఈ పేరు అంటే తెలియని వారు ఉండరు. 1986లో ప్రారంభమైన ఈ విద్యాసంస్థ క్రమక్రమంగా విస్తరించింది. ఒక సెక్షన్ ప్రజలకు మాత్రమే పరిమితం కాకుండా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు కూడా కార్పొరేట్ విద్యను పరిచయం చేసింది. దీని వెనుక ఉన్నది బిఎస్ రావు అలియాస్ బొప్పన సత్యనారాయణ రావు. ఎక్కడో విజయవాడలో మారుమూల గ్రామంలో పుట్టిన ఈయన ఆ రోజుల్లోనే వైద్య విద్యను అభ్యసించారు. 1980 కాలంలో విదేశాలకు వెళ్లారు. ఇరాన్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో ప్రాక్టీస్ చేశారు. ఆ దేశాల్లో కరెన్సీ మన దేశం కంటే ఎక్కువ విలువ ఉండటంతో దండిగా సంపాదించారు. వైద్య విద్య అనేది కేవలం డబ్బుల కోసం మాత్రమే కాదు అని నమ్మిన ఆయన.. తన ప్రాక్టీస్ కూడా అదే విధంగా చేశారు. ఆయన హస్తవాసి బాగుండడంతో ఇతర దేశాల వాళ్ళు ఇతని వద్ద చూపించుకునేందుకు క్యూ కట్టేవారు. ఇరాన్, ఇంగ్లాండ్ దేశాలలో ప్రాక్టీస్ చేసిన తర్వాత బొప్పన సత్యనారాయణరావు విజయవాడ వచ్చారు.
విజయవాడ గోశాల
చాలామందికి అప్పట్లో గోశాల అంటే తెలిసేది కాదు. 1986లో శ్రీ చైతన్య బాలికల కళాశాల ఏర్పాటు అయిన తర్వాత విజయవాడ గోశాల అనేది శ్రీ చైతన్య విద్యాసంస్థలకు కేంద్ర కార్యాలయంగా మారిపోయింది. చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ.. ఇవ్వాళ్టిటికి శ్రీ చైతన్య గోశాల బ్రాంచ్లో సీటు సంపాదించడం అంత ఈజీ కాదు. ఎమ్మెల్యేలు ఎంపీల రికమండేషన్లు కూడా అక్కడ నడవవు.. మొదట్లో కొంతమేర ప్రాక్టీస్ చేసుకుంటూ.. మిగతా సమయాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన కార్యకాల పాలను పర్యవేక్షించేవారు. అయితే ఆయన సతీమణి పూర్తి సమయం విద్యాసంస్థల అభివృద్ధికి కేటాయించడంతో జనాల్లోకి సులభంగానే వెళ్లగలిగింది. ఫలితాలు కూడా ఆశించిన దాని కంటే మెరుగ్గా రావడంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో చేర్పించేందుకు మొగ్గు చూపేవారు. తర్వాత బీ ఎస్ రావు తన ప్రాక్టీస్ మానేశారు. పూర్తి సమయం శ్రీ చైతన్య విద్యాసంస్థలకు కేటాయించారు. బాలికల విద్యాలయంగా ప్రారంభమైన శ్రీ చైతన్య విద్యాసంస్థలు క్రమక్రమంగా శాకోపశాఖలుగా విస్తరించేలా కృషి చేశారు. మొదట్లో అందరికీ నాణ్యమైన విద్య అందించాలని శ్రీ చైతన్య విద్యాసంస్థలను ప్రారంభించిన బిఎస్ రావు.. తర్వాత దీనికి కార్పొరేట్ రూపం తీసుకొచ్చారు.
పరిస్థితులు మారిపోయాయి
శ్రీ చైతన్యకు పోటీగా నారాయణ విద్యా సంస్థ ఉండడంతో.. అనివార్యంగా విద్యా వ్యాపారం మొదలైంది. మొదట సాధారణంగా ప్రారంభమైన శ్రీ చైతన్య విద్యా సంస్థకు కార్పొరేట్ లుక్కు అద్దిన బిఎస్ రావు తర్వాత విద్యను వ్యాపారంగా మార్చారు. ఏ మాటకు ఆ మాట బిఎస్ రావు కార్పొరేట్ లుక్ అద్దిన తర్వాతే మిగతా సంస్థలు కూడా ఇందులోకి వచ్చాయి. తెలుగు నాట అటు శ్రీ చైతన్య, ఇటు నారాయణ విద్యాసంస్థలదే గుత్తాధిపత్యంగా ఉండేది. నేటికి కూడా అదే కొనసాగుతోంది. 2016 వరకు ఈ రెండు సంస్థల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. అప్పట్లో ఈ రెండు సంస్థలు అధ్యాపకులను కిడ్నాప్ చేసేందుకు కూడా వెనకాడ లేదంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఈ రెండు సంస్థలు కలిసి చైనా అకాడమీని ప్రారంభించాయి. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ చైనా అకాడమీ మూతపడింది.. నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ రాజకీయాల్లోకి వెళ్లడంతో రెండు సంస్థల మధ్య వైరం దాదాపుగా ముగిసిపోయింది. బిఎస్ రావుకు ఇద్దరు కూతుర్లు సంతానం. ప్రస్తుతం వారిద్దరే శ్రీ చైతన్య విద్యాసంస్థల కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో లెక్కకు మిక్కిలి బ్రాంచ్ లు నిర్వహిస్తూ తండ్రికి తగ్గ తనయలు అనిపించుకుంటున్నారు.
మహావృక్షం
1986లో విజయవాడలో ప్రారంభించిన శ్రీ చైతన్య విద్యాసంస్థ శాఖోపశాఖలుగా విస్తరించింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ చైతన్యకు 321 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. 322 టెక్నో స్కూల్స్ ఉన్నాయి. 107 సీబీఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఫ్రాంచైజీ మోడ్ లో విద్యా సంస్థలున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా ప్రాంతంలో దక్షిణాది రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఐఐటి కోచింగ్ సెంటర్ ఉంది. అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఇవాల్టికి దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని శ్రీ చైతన్య విద్యాసంస్థలోనే చేర్పించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. దానికి కారణం మార్కులపై తల్లిదండ్రులకు పెరిగిన మోజు..తన విద్యాసంస్థలను వారికి చేరువ చేసిన బిఎస్ రావు పట్టుదల. ఏది ఏమైనప్పటికీ బిఎస్ రావు శ్రీ చైతన్య విద్యాసంస్థలను దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా అభివృద్ధి చేశారు. అనారోగ్యంతో ఆయన కన్నుమూసిన నేపథ్యంలో ఒక శకం ముగిసిపోయినట్టుంది. అయితే ఈ పరిస్థితిని ముందే ఊహించినట్టున్నారు కాబోలు.. ఆయన పిల్లల్ని విద్యాసంస్థల వ్యాపారం లోకి తీసుకొచ్చారు. వారు కూడా ఆయన తండ్రికి తగ్గట్టుగానే విద్యాసంస్థల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రకటించిన ఐఐటి ర్యాంకుల్లో శ్రీ చైతన్య విద్యార్థులు టాప్ టెన్ లో ఐదు ర్యాంకులు సాధించారంటే.. బీఎస్ రావు తనయలు ఎలాంటి పట్టు సాధించారో అర్థం చేసుకోవచ్చు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Shri chaitanya chairman bs rao passed away
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com