AP Salaries: ఏపీలో ఉద్యోగుల జీతాలు దైవాదీనంగా మారాయి. ఏ నెలా ఒకటో తేదీన జీతాలు అందే పరిస్థితి లేదు. ఒక విధంగా చెప్పాలంటే వాన రావడం.. ఉద్యోగులకు జీతాలు పడడం కష్టమన్న అపవాదు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షనర్లకు 1న జీతాలు, పెన్షన్లు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ఏప్రిల్ నెలకు సంబంధించి ఐదో తేదీ వచ్చినా… ఇప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లలో సగంమందికి చెల్లింపులు జరపలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు, పింఛన్లకు రూ.5,400 కోట్లు అవసరమని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ రూ.2 వేల కోట్లు జీతాలు, పింఛన్ల రూపంలో చెల్లించినట్టు తెలుస్తోంది. అంటే సగం మందికి కూడా ఈ నెల జీతాలు పడలేదు. మరోవైపు అప్పు పుట్టడానికి అనుకూల పరిస్థితులు లేవు. కేంద్రం కళ్లు గప్పి అప్పుల తప్పులతో ప్రభుత్వం నెట్టుకొచ్చింది. కానీ ఈసారి పరిస్థితి అంత అనుకూలంగా లేదు.
రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కేంద్రం ఆగ్రహంతో ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా వైపు పరుగులు తీస్తోందని ఆందోళనతో ఉంది. మరోవైపు సకాలంలో జీతాలు అందకపోవడంతో ఉద్యోగ, ఉపాద్యాయ వర్గాల్లో అసంత్రుప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే సీపీఎస్ విషయంలో వారు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు జీతాలు పడకపోవడంతో ఏకంగా తిట్ల దండకాన్ని అందుకుంటున్నారు. ఒకటో తారీఖు దాటిన తరువాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు సబ్ ట్రెజరీ కార్యాలయాలకు ఫోన్ల మోత మొగించారు. ‘సార్.. ఈ రోజునయినా పడతాయా’ అంటూ దీనంగా ఆరాలు తీస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వింత వాదనను తెరపైకి తెస్తోంది. సీఎ్‌ఫఎంఎ్‌సను సాకుగా చూపించి … సాంకేతిక కారణాల వల్ల జీతాలు పడలేదని చెప్పుకొస్తోంది.
ప్రతీ నెలా ఇదేం తీరు?
ప్రభుత్వం సకాలంలో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకపోవడంతో వేతన జీవులకు వెతలు మొదలయ్యాయి. ఒక నెల అంటే ఏదో ఇబ్బంది అనుకుందాం…ప్రతి నెలా ఇదేం తంతు అంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. నెలంతా పని చేసినా సకాలంలో వేతనాలు ఇవ్వకపోతే… ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పిల్లల చదువుల కోసం, ఇళ్ల రుణాలు, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల రుణాలు తీసుకున్న ఉద్యోగులు ఈఎంఐల చెల్లింపులు కటాఫ్ డేట్‌గా 5వ తేదీని పెట్టుకుంటారు. నెలలో ఐదవ తేదీ దాటితే…వారి క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. ఈఎంఐలు సకాలంలో కట్టకపోతే చెక్ బౌన్స్‌లు అవుతాయి. ఇక విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయం. తాము 30 , 40 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగులుగా సర్వీసుచేసి… వృద్ధాప్యంలో సకాలంలో పెన్షను పొందలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. పెన్షన్ ఆలస్యం అవుతుండటంతో కనీసం మందు బిళ్లలు సకాలంలో కొనుక్కొవాలన్నా ఏ నెలకానెల అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
పాపం పండుటాకులు
పండుటాకుల విషయంలో సైతం ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. వారికి సకాలంలో పింఛన్లు అందించడం లేదు. దీంతో శేష జీవితం ఇబ్బందులమయంగా మారుతోంది. సకాలంలో పింఛన్లు అందించకపోగా.. ఇప్పుడు ప్రభుత్వం లైఫ్ సర్టిఫికెట్ల పేరుతో దొంగాట ఆడుతోంది. పెన్షనర్లకు 1వ తేదీన ప్రభుత్వం డబ్బులు వేయాలి. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా 38,038 మంది ఇంకా లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వలేదంటూ తీరిగ్గా నాలుగో తేదీన ట్రెజరీ అధిపతి సర్క్యులర్ జారీచేశారు. అవి సమర్పించనివారికి మాత్రమే డబ్బులు ఖాతాలో పడలేదని సెలవిచ్చారు. అయితే.. పెన్షన్ పడాల్సిన సమయంలో మెమో జారీ చేయడం ఏంటని విశ్రాంత ఉద్యోగులు మండిపడుతున్నారు. అయితే, లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చినవారిలోనూ చాలామందికి చెల్లింపులు జరపకపోవడం గమనార్హం. సాధారణంగా పింఛనుదారులు కుటుంబసభ్యులపై ఆధారపడరు. పింఛను మొత్తంతో ప్రణాళిక వేసుకుంటారు. మందులు, ఇతరత్రా కుటుంబ అవసరాలకు పింఛన్ మొత్తాన్నే వాడుకుంటారు. కానీ ప్రభుత్వం పింఛనుదారులకు మొండిచేయి చూపడంతో వారి కుటుంబ జీవనం కష్టంగా మారింది.
Also Read:AP Debts: ఏపీ అప్పుల తప్పుడు లెక్కలపై కేంద్రం సీరియస్.. ఆ ఇద్దరు అధికారులపై చర్యలు తప్పవా?
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Salaries not getting for ap employees 2
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com