Homeజాతీయ వార్తలుఢిల్లీ మారణహోమం వెనుక సంఘ విద్రోహ శక్తులు?

ఢిల్లీ మారణహోమం వెనుక సంఘ విద్రోహ శక్తులు?

గత మూడు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు చూస్తుంటే.. కేవలం పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ)కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లగా అనిపించడం లేదు. అల్లర్ల ఉద్రిక్తత రోజు రోజుకి పెరగి, హింసాత్మంగా మారడం అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ హింసాత్మక ఘటనలలో అటు ముస్లింలు, ఇటు హిందువులు చనిపోతున్నారు. కాబట్టి సిఏఏకి వ్యతిరేక వర్గాలు ఈ మారణహోమం చేస్తున్నట్టుగా లేవు. కర్రలు, రాళ్లు, రివాల్వర్లతో అల్లరి మూకలు యథేచ్ఛగా లూటీలు, విధ్వంసకాండకు తెగబడడాన్ని బట్టి ఇదంతా ఒక స్క్రిప్టు ప్రకారమే జరిగిందని అర్థమవుతోంది.

షాహిన్ బాగ్ లో మహిళలు రెండు నెలలుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. ఎన్నడూ ఎలాంటి హింసాత్మక ఘటన కూడా చోటుచేసుకోలేదు. కానీ, ఈశాన్య ఢిల్లీలో ప్రారంభమైన అల్లర్లు మూడు రోజుల్లోనే.. ఢిల్లీ మొత్తం వ్యాపించి, మారణహోమం సృష్టించడం వెనుక బలమైన సంఘ విద్రోహ శక్తులు పనిచేశాయని చెప్పొచ్చు. సిఏఏ నిరసనకారులపై జరిగిన దాడులను సిఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణగాను, మత ఘర్షణలుగాను చిత్రీకరించేందుకు ఈ శక్తులు ప్రయత్నిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

వ‌రుస‌గా సాగుతున్న దాడుల్లో మృతుల సంఖ్య 32కు చేరుకుంది. వందల మంది గాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. వీరిలో సగం మందికి బులెట్‌ గాయాలు ఉన్నట్లు తేలింది. చివరికి జర్నలిస్టులను, పోలీసులను కూడా ఈ శక్తులు వదల్లేదు. ఈ హింసాత్మక దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు గాయపడ్డారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఉద్యోగి అంకిత్ శర్మ ని చంపి, ఆయన శవాన్ని మురికి కాలవలో పడేసి, ఎవరికైన చెబితే చంపేస్తాం.. అని అక్కడున్న మహిళలను బెదిరించడం వెనుక సంఘ విద్రోహ శక్తులు ఏ స్థాయిలో వీరవిహారం చేస్తున్నాయో అర్థంచేసుకోవచ్చు.

అసలు బీజం పడ్డది.. ఢిల్లీ ఎన్నికలలో..?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జామియా, జెఎన్‌యు, అలీగఢ్‌ యూనివర్శిటీల్లో విద్యార్థులపై సంఘ విద్రోహ శక్తులు, పోలీసుల వత్తాసుతో భయానక దాడులకు తెగబడడం ద్వారా సిఏఏ వ్యతిరేకులను భయభ్రాంతులను చేయాలని చూశాయి. ఈ ఎన్నికల్లో బిజెపి నేతలు గతంలో ఎన్నడూ లేని రీతిలో అసత్యాలు, అర్థసత్యాలతో విషప్రచారం చేశారు. యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌, బిజెపి నాయకుడు కపిల్‌ మిశ్రా వంటి బీజేపీ నేతలు రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్నీ హోమ్ మంత్రి అమిత్ షా కూడా ఒప్పుకున్నారు. ఢిల్లీ ఎన్నికలలో ఘోర పరాభవం వెనుక బీజేపీ నేతల మత విద్వేష వ్యాఖ్యలే కారణమని అమిత్ షా చెప్పడం ఆశ్చర్యం.

ఢిల్లీని మరో గుజరాత్‌ గా మార్చాలని చూస్తున్న విద్వేష శక్తులు, 1984 మరణహోమాన్ని పునరావృతం చేయాలనుకుంటున్న దేశ ద్రోహులను వీలైనంత త్వరగా అణిచివేసి, దేశ రాజధానిలో శాంతిని నెలకొల్పాలని ఆశిద్దాం..

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular