Homeజాతీయ వార్తలులాక్‌ డౌన్‌ లో దాగిఉన్న జీవిత సత్యాలు!

లాక్‌ డౌన్‌ లో దాగిఉన్న జీవిత సత్యాలు!

జీవితంలో కొన్నిసార్లు ఊహించని మార్పులు ఎదురవుతాయి. ఆ మార్పులు ప్రమాదం రూపంలో, ప్రకృతి విపత్తు రూపంలో.. ఇంకా అనూహ్య పరిస్థితి రూపంలో, ఉపాధి కోల్పోయిన రూపంలో రావొచ్చు. అయితే ఆయా సమయాలలో ఊహించని పాఠాలు కూడా నేర్చుకోవచ్చు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించారు. ఏప్రిల్ 14న లాక్ డౌన్ ఎత్తేయక పోతే మరి కొంతకాలం ఇంట్లోనే ఉండే పరిస్థితి రావొచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో జీవిత పాఠాలు కూడా నేర్చుకోవచ్చు.

కుటుంబాన్ని అర్థం చేసుకోండి

మీ ఒత్తిడి జీవితానికి ఒక్కసారిగా బ్రేక్‌ పడింది. కుటుంబంతో గడపడం లేదన్న మీ బెంగను తీర్చింది. మీ పిల్లల వ్యక్తిత్వం, మీ పిల్లల అలవాట్లు, వారి దృక్పథాన్ని సరైన దారిలో పెట్టేందుకు ఉపయోగపడింది. జీవితంలో దీనిని కొనసాగించండి. మీ పిల్లలకు ఇంతకంటే మీరేం ఇవ్వగలరు? డబ్బు అవసరాలను తెలియపరచండి. పొదుపు ఎంత ముఖ్యమో వివరించండి. అత్యవసర పరిస్థితి అంటే ఏంటో చెప్పండి. వారితో కలిసి చదవండి. వారితో కలిసి రాయండి. వారితో కలిసి టీవీ చూడండి. కలిసి తినండి. వ్యాయామం, యోగ, ధ్యానం, ఇంటి పనులు.. ఇలా ఒకటేమిటి.. అన్నింట్లో వారిని ఇన్‌వాల్వ్‌ చేయండి.

అదే సమయంలో మరో ముఖ్యమైన విషయం.. కుటుంబం అంటే మీరు, మీ జీవిత భాగస్వామి, మీ పిల్లలు మాత్రమే కాదు. మీ తల్లిదండ్రులు కూడా. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన వారికి ఇప్పుడు ఆత్మీయ పలుకరింపు అవసరమని గ్రహించండి. వారితో మాట్లాడండి. వారు చెప్పేది వినండి. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వారు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వారి అవసరాలు తీర్చే ప్రయత్నం చేయండి. వారికి సంతోషం ఇవ్వడం కంటే మీకు దక్కే సంతోషం ఏముంటుందని?

జీవితం అంటే పరుగెత్తడం మాత్రమే కాదని తెలుసుకోండి

ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగో, జీవితాన్ని ఆనందంగా గడపడం ఎలాగో ఈ కరోనా సెలవులు నేర్పి ఉంటాయి. ఎంతోకాలంగా నేర్చుకోవాలనుకున్న కోర్సులు ఆన్‌ లైన్‌ లో నేర్చుకోవడమో, ఎంతో కాలంగా చూడాలనుకున్న సినిమాలు ఏ ఓటీటీలోనో చూడడమో వంటివి చేసి ఉంటారు. ఇష్టమైన పుస్తకాన్ని కిండ్లే ద్వారా చదవడమో, ఆడిబుల్‌ ద్వారా వినడమో చేసి ఉంటారు. దీనిని భవిష్యత్తులో కూడా కొనసాగించండి. జీవితం అంటే పరుగెత్తడం మాత్రమే కాదని తెలుసుకోండి. కొత్త నైపుణ్యం అందిపుచ్చుకుంటే జీవితం మరింత ఉజ్వలంగా ఉంటుందని గ్రహించండి.

ఇతరులకు కాస్త సాయం చేయండి

ఇలాంటి కష్ట సమయాల్లో ఇతరులకు మీ చేతనైనంత సాయం చేయండి. వారు ఈ కష్టకాలంలో నిలదొక్కుకునేందుకు మీరు మానవత్వం ప్రదర్శించండి. మీ డ్రైవర్‌ కో, మీ పని మనిషికో లేక మీ వద్ద పనిచేస్తే ఉద్యోగులకో వారి జీవనం సాఫీగా సాగేందుకు సహకరించండి. మీ వద్ద ఉంటే ఒక నెల వేతనం ముందే సర్దుబాటు చేయండి. ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాలు నిల్వ ఉంటే వారికి పంచండి. ఇవ్వడంలో ఉన్న తృప్తి దేనిలోనూ లేదని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోండి.

పాత స్నేహితులను ఫోన్ లో పలకరించండి

ఉరుకులు పరుగుల జీవితంలో మీ స్నేహితులు, క్లాస్‌మేట్స్‌ ఎందరున్నారో మీరు మరిచిపోయి ఉంటారు. వారితో మీ మరవలేని జ్ఞాపకాలు మరోసారి నెమరువేసుకునేందుకు హాయ్‌ అంటూ ఒకసారి ఫోన్‌ లో పలుకరించండి. మీరు దీని వల్ల ఎంత ఉల్లాసంగా ఉంటారో తెలుసుకోండి. ఈ జీవన ప్రయాణంలో మనకు తోడుండేది కుటుంబ సభ్యులే కాకుండా స్నేహితులు, సమాజం అని కూడా తెలుసుకోండి. మీ అనుభవాలు వారితో పంచుకోండి. మీ జీవిత పాఠాలు వారికి నేర్పండి..

చెడు అలవాట్లు తగ్గాయిగా.. అలాగే కొనసాగండి

అనూహ్యంగా దేశాన్ని కరోనా తరుముతుండడంతో లాక్‌ డౌన్‌ ఎదురైంది. దీంతో దేశంలో మద్యం దుకాణాలు, సిగరెట్ల షాపులు మూతపడ్డాయి. మీరు మద్యానికి, దూమపానానికి దూరమయ్యారు. అయినా నిబ్బరంగా నిలబడగలిగారు. నిలబడగలరని తేలిపోయింది. అవును. మీరు మీ అలవాట్లను మార్చుకుంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ పొదుపు పెరుగుతుంది. అందువల్ల మీరు దీనిని కొనసాగించండి. దురలవాట్లను వీడితో ఎలాంటి నష్టం లేదన్న మీ అనుభవాన్ని ఆస్వాదించండి. జీవితం చాలా సింపుల్‌ గా ఉంటే, కోరికలు అదుపులో ఉంటే ఎంతటి కష్టాన్నైనా అవలీలగా భరించవచ్చని గ్రహించండి.

ఆరోగ్య చిట్కాలు నేర్చుకున్నారుగా.. వాటినే కొనసాగించండి

కరోనా మన ఆరోగ్యాలకు ఒక పాఠం నేర్పింది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే సీ విటమిన్‌ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలని కరోనా దేశవాసులదరికీ అవగాహన కల్పించింది. అలాగే మనం ఏయే రకాల ఆరోగ్యాలకు ఏయే రకాల ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి. జీవితంలో దీనిని ఒక అలవాటుగా చేసుకోండి. శుచి, శుభ్రత పాటించండి. అవి లేని ప్రాంతంలో కూరగాయలు కొనకండి. శుచి లేని చోట మాంసం కొనకండి. ప్రాణాయామం, ధ్యానం, వ్యాయామం విలువ తెలుసుకోండి. వైరస్, బ్యాక్టీరియా నుంచి రక్షణ కోసం చేతులు కడుక్కోవడం, శుభ్రత పాటించడం అలవాటుగా చేసుకోండి.

డబ్బును భద్రం చేసుకోండి.

కుటుంబం ముందుకు సాగాలంటే కనీసం మూడు నుంచి ఆరు నెలలకు తగ్గకుండా కుటుంబ ఖర్చులను అత్యవసర నిధి రూపంలో దాచుకోవాలి. సేవింగ్‌ అకౌంట్‌ లో గానీ, లిక్విడ్‌ ఫండ్‌ రూపంలోగానీ దాచుకుంటే అత్యవసర సమయాల్లో వాడుకోవచ్చు. రెగ్యులర్‌ ఆదాయానికి అంతరాయం ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలి. నిత్యావసరాలకు, మందులకు, షెల్డర్‌ కోసం, కనీస అవసరాల కోసం వాడుకోవచ్చు. అంతేగానీ షేర్స్‌ కొనుగోలు చేసేందుకో, పెట్టుబడులు పెట్టేందుకో వీటిని వినియోగించరాదు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version