
“వలస కార్మికులను కాపాడుకుంటాం,
తెలంగాణ అభివృద్ధిలో వాళ్లే భాగస్వాములు,
వారందరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటాం” నిన్న జరిగిన కేబినెట్ సమావేశ అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు ఇవి.
“సార్… మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం లేదు, పొట్టకూటికోసం వచ్చాం.. పని లేక పరాయి పంచన ఉండలేక పోతున్నాం..తీసుకొచ్చిన కాంట్రాక్టర్లు మమ్మల్ని వదిలేశారు. మా ఇంటికి చేర్చండి మీకు “పుణ్యముంటది” ఇది ఒక సాధారణ వలస కూలీ ఆవేదన.
పిడిగుపాటున వచ్చిపడిన లాక్ డౌన్ కారణంగా లక్షల మంది వలస కార్మికులు వివిధ ప్రాంతాలలో చిక్కుకునిపోయారు. కొన్ని ప్రాంతాలలో వారిని పంపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కార్మికుల తరలింపు కోసం ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేశారు. కానీ చాలా ప్రాంతాలలో వారిని పట్టించుకున్న వారే లేరు. కొంతమంది రాజకీయనాయకులు మాటలకే పరిమితం అయ్యారు. వారిని సొంత ప్రాంతాలకు పంపించే ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం.
తాజాగా కుత్బుల్లాపూర్ లోని దూలపల్లి చౌరస్తా వద్ద ఒక సంఘటన స్థానికులను, పోలీసులను కలిచి వేసింది. ఒక వ్యక్తి తన ఇద్దరి పిల్లల్ని, నడవలేని స్థితిలో ఉన్న భార్యను ఒక వీల్ చైర్ లో నడిపించుకొని నగరం నుండి ఛత్తీస్ గడ్ కి ప్రయాణమయ్యాడు. “ఎంతకష్టమైనా సరే ఇంటికి చేరుకుంటాం.. తినడానికి తిండిలేక 43 రోజులుగా అష్టకష్టాలు పడ్డాం.. మమ్మల్ని తీసుకొచ్చిన కాంట్రాక్టర్ 10 కిలోల బియ్యం ఇచ్చి పత్తా లేకుండాపోయాడు. ఇక్కడ మాకు దిక్కు ఎవరూ లేరు. చేసేదేమీ లేక ఇంటి దారి పట్టాం..” అని ఆయన చెప్పిన మాటలకు స్థానికులు, పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. రైలు ద్వారా స్వస్థలానికి పంపిస్తామని సిఐ మహేష్ హామీ ఇచ్చి వారిని సహాయక కేంద్రానికి తరలించారు.
అయితే ఈ విధంగా బ్రతుకు బండి నడవక, పొట్ట చేతపట్టుకొని పని కోసం వచ్చి, తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్య లో ఉండి ఉంటారు. కాబట్టి వారందరిని గుర్తించి వీలైనంత త్వరగా వారి వారి ప్రాంతాలకు పంపిస్తే మంచిదని అనేకమంది నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.