గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చీలిపోతుందా? ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై కసరత్తు ముమ్మరం చేసింది. ప్రభుత్వం ముందు రెండు ప్రత్యామ్నాయాలు వున్నాయి. ఒకటి పరిపాలనాపరంగా అలవికాని నగర వ్యవస్థను వికేంద్రీకరించటమా? లేక ఇప్పుడున్న కార్పొరేషన్ వార్డుల స్థానాలను పెంచటమా అనేది? వచ్చే సంవత్సరం ఫిబ్రవరి తో నగరపాలక సంస్థ గడువు ముగుస్తుంది. ఈ లోపలే దీనిపై ఒక నిర్ణయానికి రాగలిగితేనే శాసన సభలో పెట్టి చట్టంలో మార్పులు చేయటానికి అవకాశముంటుంది. అయితే ఒక వారంలోపల జరిగే శాసన సభ సమావేశాల్లో ఈ చట్టంలో మార్పులు ప్రవేశపెట్టే అవకాశం లేదు. ఈ సమావేశాలు అయిపోయిన తర్వాత దీనిపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశమున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే జరిగిన అన్ని స్థానిక సంస్థల్లో తెరాస విజయ బావుటా ఎగరవేసింది. అవన్నీ ఒక ఎత్తు హైదరాబాద్ నగరం ఒక్కటే ఒక ఎత్తు. అందుకే దీనికి ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ సంస్థాగత మార్పులు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నట్లు లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందునా ఒవైసీ పూర్తి మద్దత్తున్న నేపథ్యంలో జి హెచ్ ఎమ్ సి ని దక్కించుకోవటం తెరాస కి పెద్ద కష్టమేమీ కాదు. నిజంగానే ఇప్పుడున్న స్వరూపంతో పరిపాలన కష్టమనే భావనలో ఉన్నట్లు తెలుస్తుంది. కొత్తగా కలిసిన శివారు మున్సిపాలిటీల్లో కనీస మౌలిక సదుపాయాలు మెరుగుపడలేదు. దాదాపు కోటి జనాభాను ఒకే నగర పాలక సంస్థతో పరిపాలన చేయటం కన్నా నాలుగయిదు కార్పొరేషన్లగా చేస్తే మరింత మెరుగైన పాలన అందించవచ్చనే అభిప్రాయం వుంది. అదేసమయంలో ఇలా చేయటం వలన కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. పోలీస్ వ్యవస్థ ఇప్పుడున్న స్వరూపంలో పకడ్బందీగా వుంది. రేపు వికింద్రికరణ పేరుతో అది సడలిపోయే అవకాశముంది. అలానే ఇంకా ఎన్నో వ్యవస్థలు విభజించబడాల్సి ఉంటుంది. దానివలన వచ్చే సమస్యలపై కూడా అధ్యయనం చేయాల్సివుంది. అందుకనే ఇప్పటికి నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చినట్లుగా లేదు. వచ్చే ఒకటి, రెండు నెలల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
ఇప్పటికే ఢిల్లీలో అధికార వికేంద్రీకరణ జరిగి మూడు కార్పొరేషన్లగా విభజించారు. ముంబై లో మొదట్నుంచీ థానే ఇంకా కొన్ని ప్రాంతాలు ప్రత్యేక కార్పొరేషన్లుగా పనిచేస్తున్నాయి. కోల్ కతా కూడా హౌరా, సాల్ట్ లేక్ లాంటి ప్రత్యేక కార్పొరేషన్లగా విడిపోయివున్నాయి. అయితే బెంగుళూరు మనలాగే ఒకే కార్పొరేషన్ గా వుంది. జనాభా లెక్కల్లో విడిపోయినా , కలిసివున్నా పెద్ద తేడా రాదు. మొత్తాన్ని కలిపి అర్బన్ అగ్లామరేషన్ కింద లెక్కిస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. ఒకవేళ ఈ ప్రతిపాదన కుదరకపోయేటట్లయితే వార్డులు పెరిగే అవకాశమయితే ఖచ్చితంగా వుంది. ఇంతవరకు ఈ చర్చలు రహస్యంగానే ఉండటంతో పూర్తి సమాచారం రావటానికి సమయం పడుతుంది. ప్రస్తుతానికి ఇదే సమాచారం.