
మరికొన్ని గంటలలో ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ నేపథ్యంలో 2019లో తెలంగాణలో ఎన్నో శుభ-అశుభ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటిలో కొన్ని ఆనందభరిత ఘటనలు ఉన్నాయి. అదే సమయంలో మరికొన్ని విషాద ఘటనలు ఉన్నాయి. వాటన్నిటిని ఒక్కసారి గుర్తుచేసుకుందాం..
- తొలిసారి రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు చోటు దక్కింది. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మంత్రులు అయ్యారు.
- గోదావరి నదిపై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వర ప్రాజెక్టు జూన్ 21న అధికారికంగా ప్రారంభమైంది. ప్రాజెక్టుతో 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.
- ఇంటర్ బోర్డులో పరీక్షా ఫలితాల్లో జరిగిన అవకతవకలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. 99 మార్కులు వచ్చిన విద్యార్థికి సున్నా మార్కులు వేయడం వివాదాస్పదం అయ్యింది. ఫలితాలు వెల్లడయ్యాక 23 మంది విద్యార్థులు ఆత్యహత్యకు పాల్పడ్డారు.
- సచివాలయం, అసెంబ్లీ భవనాలను కొత్తగా నిర్మించాలని కేసీఆర్ ఈ ఏడాది జూన్‌లో ముందడుగు వేశారు. ఎర్రమంజిల్‌లోని చారిత్రక పాత భవనాలను కూల్చి, వాటి స్థానంలో అసెంబ్లీ, పాత సచివాలయాన్ని పడగొట్టి, అక్కడే కొత్త సచివాలయం నిర్మించాలని నిర్ణయించారు.
- తక్కువ భూసేకరణతో, గోదావరి జలాలను కృష్ణా నదికి చేర్చాలనే ఉద్దేశంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్- కేసీఆర్ మధ్య జరిగిన చర్చలు ఈ ఏడాది ప్రత్యేకంగా నిలిచాయి.
- యాదగిరి గుట్ట ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రాన్ని, కారు బొమ్మను చెక్కడం టీఆర్‌ఎస్ సర్కారును ఇరుకున పెట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వాటిని తొలగించడంతో వివాదం సద్దుమణిగింది.
- ఆర్టీసీ కార్మికులు చేపట్టిన 52 రోజుల సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కువ ఛార్జీలు చెల్లించి గమ్యస్థానాలకు చేరాల్చిన పరిస్థితి వచ్చింది. మొదట్లో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. చివరికి సమ్మె విరమించడంతో వారిపై వరాల జల్లు కురిపించారు. అయితే.. సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడి.. కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున భారం పడింది.
- దిశ ఘటన యావత్తు దేశాన్ని కదిలించింది. దిశపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేయడాన్ని భారతావని తీవ్రంగా ఖండించింది. నిందితులను పట్టుకుని, ఘటన జరిగిన స్థలంలోనే వారితో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసేప్పుడు ఎదురు తిరగడంతో ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. ఈ ఘటన తెలంగాణకు, దేశానికి మరకగా మిగిలింది.
- ఆసిఫాబాద్ జిల్లాలో సమత హత్యాచారం జరిగింది. ముగ్గురు కామాంధులు ఓ గిరిజన మహిళపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ రెండు ఘటనలు కొద్ది రోజుల వ్యవధిలోనే జరగడంతో మహిళల భద్రతపై రాష్ట్రంలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.