
హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికపై ఇంకొన్ని గంటల్లో ఉత్కంఠ వీడబోతుంది. ఈ ఉప ఎన్నిక ఫలితం ఎన్నో విషయాలపై క్లారిటీ ఇవ్వబోతుంది. దాని పర్యవసానాలపై చర్చించుకునేముందు ఒక్కటి మాత్రం స్పష్టత వచ్చింది. అదేంటంటే పోటీ ఇద్దరిమధ్యనే ఉంటుందనేది. బీజేపీ, టీడీపీ పోటీ నామమాత్రంగానే ఉంటుంది. బీజేపీ మొన్న లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన గుడ్ ఇమేజ్ ని కాపాడుకోవాలంటే పోటీ చేయకుండా ఉంటే బాగుండేదని విశ్లేషకుల అభిప్రాయం. టీడీపీ వరకు పోటీ చేయటం కరెక్టు స్ట్రాటజీ నే. ఈ నియోజకవర్గం లో వాళ్లకు మద్దతుగా నిలిచే సామాజిక వర్గం ఒక స్థాయిలో ఓట్లు ఉండటం, టీడీపీ కి నాయకులతో సంబంధం లేకుండా కొంత కేడర్ ఉండటం , అన్నింటికన్నా ముఖ్యంగా మొన్న లోక్ సభ లో పోయిన ప్రతిష్టను కొంతమేర పునరుద్ధరించుకొనే అవకాశం ఉండటం లాంటి కారణాలతో పోటీ చేయటం కరెక్టు ఎత్తుగడగానే భావించాలి. ఒకవేళ ఈ ఉపఎన్నికలో కనీసం పదివేల ఓట్లు సంపాదించుకో గలిగితే ముందు ముందు మిగతా పార్టీలతో పొత్తులు పెట్టుకోవటానికి ఉపకరిస్తుంది. కాబట్టి టీడీపీ పోటీ చేయటం ఓ వ్యూహాత్మక ఎత్తగడే.
మరి బీజేపీ విషయంలో ఏమి స్ట్రాటజీ వుంది? సానుకూల అంశాల కన్నా ప్రతికూల అంశాలే ఎక్కువవున్నాయనిపిస్తుంది. కనీసం ఓ గౌరవప్రదమైన ఓటింగు వస్తే వాళ్ళ ఎత్తుగడ కరక్టే ననుకోవాలి. నామమాత్ర ఓట్లు వచ్చి డిపాజిట్ పొతే అది ప్రతికూల ప్రభావం పడే అవకాశం వుంది. ఓ విధంగా చెప్పాలంటే బీజేపీ పెద్ద రిస్క్ తీసుకుందని చెప్పాలి. ఇటీవల కాలంలో బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ దూకుడు అంత పరిణితి తో లేదనిపిస్తుంది. గోదావరి నీళ్లు ఆంధ్రతో పంచుకునే విషయం లో తను మాట్లాడిన తీరు ఫక్తు ఓ ప్రాంతీయ పార్టీ నాయకుడు మాట్లాడినట్లుగా వుంది . అలాగే ఆర్టీసీ సమ్మెవిషయం లోనూ సూత్రబద్ధంగా లేదనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ విలీనంపై ఓ స్పష్టమైన వైఖరి తీసుకొని వుండాల్సింది. కెసిఆర్ అహంకార పూరిత వైఖరిని గర్హిస్తూనే సమ్మెకు మద్దత్తు తెలపటం వరకూ బాగానేవుంది. ఆర్టీసీ కార్మికులు పండగ సమయంలో సమ్మెకు దిగడం, విలీనంపై పట్టుపట్టటంపై బీజేపీ వైఖరి సూత్రబద్ధంగా లేదు. అంతర్లీనంగా కెసిఆర్ కి గుణపాఠం చెప్పాలనే ఒకే ఒక బలమైన కోరిక అన్ని ప్రతిపక్షాలలో కనబడుతుంది. రేపు ప్రతిపక్షాలు అధికారం లోకి వచ్చినా విలీనం చేయటం అంత తేలికకాదు. అయితే కెసిఆర్ ధోరణికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.
ఇక ప్రధానపోటీదారుల పరిస్థితులు చూద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఇది అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నిక. ఒకటి , తన నియోజక వర్గం కావటం , రెండు తన సతీమణి నే పోటీలో ఉంచటం. ఈ ఎన్నిక లో గెలవకపోతే దాని పర్యవసానం చాలా వాటి మీద పడుతుంది. కాంగ్రెస్ లో వున్నన్ని గ్రూపులు ఏ పార్టీలో వుండవు. కాంగ్రెస్ కనుక ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్ష పదవికి ముప్పు వస్తుందనేది ఖచ్చితం. అంతకన్నా ముఖ్యమైనది తెరాస కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్న సమయంలో కాంగ్రెస్ కంచుకోట స్థానంలో ఓడిపోతే అది భవిష్యత్తు సమీకరణాలపై ప్రభావం చూపుతుంది. కాంగ్రెస్ నైతిక స్థాయి దెబ్బతిని బీజేపీ పుంజుకునే అవకాశాలు పెరుగుతాయి. అందుకని ఈ ఎన్నిక కాంగ్రెస్ కి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కి అత్యంత పరీక్ష గా చెప్పాల్సి వస్తుంది.
చివరగా తెరాస , కెసిఆర్ పరిస్థితి. ఈ ఎన్నికల్లో గెలిస్తే కెసిఆర్, తెరాస కు పెద్ద మోరల్ బూస్టు అవుతుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కెసిఆర్ వైఖరి కి ప్రజల ఆమోదముద్ర వేసినట్లవుతుంది. ఈ సమయంలో కెసిఆర్ కి పెద్ద నైతిక విజయమే అవుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం కెసిఆర్ కి దెబ్బనే చెప్పాలి. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ఆర్టీసీ కార్మికులు కెసిఆర్ పై దాడిని పెంచే అవకాశముంది. అలాగే తెరాస లో అంతర్గత విభేదాలు మెల్లి మెల్లిగా బయటపడే అవకాశముంది. కాబట్టి కెసిఆర్ కి, తెరాస కి కూడా ఈ ఎన్నిక ప్రతిషాత్మకమనే చెప్పాలి.
ఇన్ని ప్రత్యేకతలు వున్న ఈ ఎన్నిక ఫలితం కొన్ని గంటల్లో రాబోతుంది. ఫలితాన్నిబట్టి పైన చెప్పినవిధంగా పర్యవసానాలు ఉండబోతున్నాయి.