
హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో రాజకీయాలు రంజుగా మారాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజక వర్గం కావటంతో దానిపై అందరికీ ఆసక్తి పెరిగింది. కాంగ్రెస్ తో పాటుగా తెరాస , బీజేపీ కూడా ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు అర్ధమవుతుంది. సిపిఎం పోటీకి దిగినా అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. పోటీలోవున్నా అది పెద్దగా ప్రభావం చూపించి ఉండేది కాదు. ఇక సిపిఐ పోటీ చేయకపోయినా ఎవరికి మద్దత్తు ఇస్తుందనే విషయంలో ఆసక్తి ఏర్పడింది. చివరకు తెరాస కు మద్దత్తు ఇస్తున్నట్లు ఇప్పుడే వార్తలు వచ్చాయి. తేజస కాంగ్రెస్ కి మద్దత్తు ప్రకటించే అవకాశాలు వున్నాయి.
బీజేపీ ఈ పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఎన్నికలు దగ్గరపడే కొద్దీ బలహీనపడే అవకాశాలు ఎక్కువ. దానికి కారణం ఇంతకుముందు ఈ నియోజక వర్గం బీజేపీ కి బలమైనది కాకపోవటం. రెండోది కాంగ్రెస్ స్వతహాగా బలంగా ఉండటం తెరాస అన్ని వనరులు వుపయోగించి సర్వశక్తులు ఒడ్డటం వలన పోటీ ఈ రెండిటి మధ్య సమీకరించబడటం. అయినా బీజేపీ ఇటీవల బలపడిన రీత్యా తన బలాన్ని ఇక్కడ కూడా ప్రదర్శించాలని అనుకుంటుంది. అందుకే అభ్యర్థి ని సెలెక్ట్ చేయటంలో కొంత చాకచక్యాన్ని ప్రదర్శించి బీసీ అభ్యర్థిని నిలబెట్టింది. కాంగ్రెస్, తెరాస అభ్యర్థులిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావటం వలన తన అభ్యర్థి బలమైన అభ్యర్థిగా బరిలో ఉంటాడని భావిస్తుంది. కానీ రెండు శక్తులు బలంగా వున్నప్పుడు కొత్తగా మూడో శక్తి ఎదగటం చాలా కష్టం. అదే సాధారణఎన్నికలయితే పరిస్థితులు వేరుగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్త ప్రభావం అన్ని ఎన్నికలపై ఉంటుంది. కాబట్టి ఈ ఉప ఎన్నికలో బీజేపీ ప్రభావం నామమాత్రంగానే వుండే అవకాశాలు మెండుగా వున్నాయి.
ఇకపోతే సిపిఐ తెరాస కు మద్దత్తు ఇవ్వటం ఆశ్చర్యమూ, అవకాశవాదం కూడా. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో జత గట్టింది. ఇంతలోనే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెరాస కు అనుకూలంగా పరిస్థితుల్లో ఏమి మార్పు వచ్చిందో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతయినా వుంది. పోయిన ఎన్నికల్లో సిపిఎం కూటమిలో చేరకుండా కాంగ్రెస్ కి మద్దత్తు ఇవ్వటానికి చెప్పిన కారణం ఒక్కటే. తెరాస ని ఓడించాల్సిన అవసరం వుంది కాబట్టి తెరాస వ్యతిరేక ఓట్లలో చీలిక రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కి మద్దత్తు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు తెరాసకు మద్దత్తు ఇవ్వటానికి కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లలో చీలిక రాకూడదనే వాదన తీసుకొస్తుందా ? మరి దేశవ్యాప్తంగా సిపిఐ కాంగ్రెస్ తో కలిసి బీజేపీ కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. మరి తెలంగాణకమ్మూనిస్టు పార్టీది ప్రత్యేక వైఖరా? సిపిఐ ది పచ్చి అవకాశవాదం. ఒక కమ్మూనిస్టు పార్టీ ఇంత అవకాశవాద రాజకీయాలు చేయటం ఎక్కడా చూడలేదు. ఎన్నికల్లో ప్రతిపార్టీ వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలతో వైఖరులు ప్రదర్శిస్తూవుంటాయి. కానీ ఇంత పచ్చి అవకాశవాద వైఖరి ఒక కమ్మూనిస్టుపార్టీ తీసుకోవటం ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. ఇందుకు తెరాస సిపిఐ నాయకులను కొన్నదని ప్రజల్లో వచ్చిన రూమర్లను పూర్తిగా కొట్టి పారేయలేము. మొత్తం హుజూర్ నగర్ ఎన్నికల్లో ఏ పార్టీ ఇంత అప్రతిష్ట పాలు కాలేదు. చివరగా ఒక్కమాట సిపిఐ అవకాశవాద వైఖరిని విమర్శించటంవరకే ఈ వ్యాఖ్యానాన్ని చూడాల్సివుంది. ఇది తెరాసకు వ్యతిరేకమనో , కాంగ్రెస్ కి అనుకూలమనో భావన తీసుకోవద్దు. ఎవరికి వోటువేయాలో ప్రజలకి వదిలేద్దాం.