
వైస్సార్సీపీ లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. 22 స్థానాలతో కాంగ్రెస్ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా టీఎంసీ తో పాటు అవతరించిన వైస్సార్సీపీ తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పార్లమెంట్ పార్టీ. వచ్చే అయిదు సంవత్సరాల్లో లోక్ సభ లో దాని పాత్ర చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే 22 స్థానాలతో రాష్ట్రాలపరంగా చూస్తే పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ మాత్రమే బీజేపీ రాష్ట్రాల తర్వాత పెద్ద సంఖ్యలో వున్నాయి. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికివ్వటం ఓ ఆనవాయితీగా వస్తూవుంది. అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షపార్టీకి ఇవ్వటం ఇష్టంలేదు. పోయినసారి ఎన్డీయే లో లేని అన్నా డీఎంకే కి ఇవ్వటం జరిగింది. ఈసారి కాంగ్రెస్ తర్వాత పెద్ద పార్టీలుగా వున్న టీఎంసీ , వైస్సార్సీపీ లలో టీఎంసీ కి ఇవ్వటం మోడీకి ఇష్టంలేదు. కాబట్టి వైస్సార్సీపీ కి ఆఫర్ చేయటం జరిగింది. అయితే ఈ పదవి తీసుకోవాలా వద్దా అనే విషయంలో వైస్సార్సీపీ ఆలోచనలో పడింది.
ఆ పదవి తీసుకోకుండా ఉంటేనే మంచిదని ఆ పార్టీ ఆంతరంగిక చర్చల్లో ఓ అభిప్రాయానికి వచ్చారు. పోయిన లోక్ సభలో తెలుగుదేశం చేసిన తప్పిదం ఈ సారి చేయకుండా జాగ్రత్తపడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ సారి బీజేపీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకుంటే బీజేపీ తో వైస్సార్సీపీ మిలాఖత్ అయిందనీ, ప్రత్యేక హోదా తాకట్టు పెట్టిందనీ ప్రచారం జరిగే అవకాశం మెండుగా వుంది. ఇది తీసుకోకపోతే సమస్యలపై మిత్రవైఖరి అవలంబించినా పెద్దగా నష్టం వాటిల్లే అవకాశాలు లేవు. అందుకే వ్యూహాత్మకంగా , తెలివిగా నిర్ణయం తీసుకుంది. రాజకీయంగా ఇది వైస్సార్సీపీ కి లాభించే చర్య గా భావిస్తున్నారు. బాలయోగి తర్వాత వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవటం సరయిన నిర్ణయమా కదా అనేది చరిత్ర చెప్పాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం దీని వలన ప్రత్యర్థుల విమర్శలకు అవకాశంలేకుండా పోయింది.