
రివర్స్ టెండరింగ్ తో చంద్రబాబు నాయుడు కి కష్టాలు మొదలయ్యాయా? అవుననే అనిపిస్తుంది. ఇప్పటికి జరిగిన రెండు రివర్స్ టెండర్లలో మొత్తం 841 కోట్లు ప్రభుత్వ ఖజానా కు లాభమొచ్చింది. అంటే ఈ డబ్బు అనవసరంగా ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుండేదే కదా. ఇది చంద్రబాబు నాయుడు కి చెంపపెట్టే. నిన్నటిదాకా దీనివలన ప్రభుత్వ పరిపాలన అస్తవ్యస్తం అయ్యిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల మీడియా ఈ చర్యతో మూగపోయింది. దీన్ని ఎలా ట్విస్ట్ చేయాలో తెలియక సతమతమవుతున్నారు.
అసలు ఈ రివర్స్ టెండరింగ్ కొత్తేమీకాదనీ , దీనివలన క్వాలిటీ దెబ్బతింటుందని తెగ ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు జరిగిన రెండు టెండర్ల ప్రక్రియలో నాసిరకం కాంట్రాక్టర్లని చెప్పే అవకాశమే లేదు. మొదటిదాంట్లో తక్కువకి టెండరు వేసింది అంతకుముందు టెండరు దక్కించుకున్న కంపెనీయే కాబట్టి ఆ మాట అనలేరు. ఇప్పుడు రెండో టెండరు దక్కింది ప్రఖ్యాత మేఘ ఇంజనీరింగ్ సంస్థకి. ఇది నాసిరకమని చెప్పలేరు. అందుకే గొంతులు మూగపోయినాయి. దీన్ని అవినీతికాక మరేమనాలి? ఇప్పటిదాకా అభ్యంతరాలు తెలిపిన కేంద్ర జలవనరుల శాఖకూడా అభినందనలు తెలిపే అవకాశముంది. అప్పుడు చంద్రబాబు నాయుడు , ఆయన మిత్ర బృందం ఏమంటారో చూడాలి.
ఏమైనా చంద్రబాబు నాయుడు కి ముందు ముందు కష్టాలే అని అనిపిస్తుంది. అసలే జగన్ కి తనన్ని జైలుకి పంపించాడని లోలోపల ఉడికి పోతుంది. చంద్రబాబు నాయుడు ఏమైనా మోడీ లాగా నికార్సయిన మనిషా ? తనకన్నీ మచ్చలే అయినప్పుడు తనేదో నీతిమంతుడులాగా మాట్లాడటం ప్రజలకి వెగటు పుట్టిస్తుంది. దీన్నే జగన్ తనకనుకూలంగా మలుచుకున్నాడు. మోడీ అవినీతికి వ్యతిరేకంగా చిదంబరాన్ని జైలుకి పంపిస్తే ప్రజలు హర్షించారు. ఎందుకంటే పంపించిన వ్యక్తి నిజాయితీ పై ఎవరికీ అనుమానం లేదు. మీడియా కక్షసాధింపు చర్యని గొంతుచించుకున్నా ప్రజలు పట్టించుకోలేదు. కారణం మోడీ మీదున్న నమ్మకం. అదే చంద్రబాబు నాయుడు పై ఆ నమ్మకం ప్రజలకు లేదు. అదీ ప్రత్యక్షంగా ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాత. అప్పుడు కక్షసాధింపు చంద్రబాబు నాయుడు వంతయితే ఇప్పుడు జగన్ కి అవకాశం వచ్చింది.
జరగబోయే పరిణామం తెలుసుకాబట్టే ఎందుకైనా మంచిదని తన నమ్మకస్తుల్ని బీజేపీ లోకి చేర్పించాడు. అయినా మోడీ వదిలిపెడతాడని జనం అనుకోవటం లేదు. త్వరలో రాబర్ట్ వాద్రా కి చిదంబరం గతే పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండో విడతలో చంద్రబాబు నాయుడు ఉండొచ్చని అనుకుంటున్నారు. ఆ విషయమూ చంద్రబాబు నాయుడు అంచనాకి వచ్చినట్లుగా కనిపిస్తుంది. అయితే సాక్ష్యాలు బయటపడటానికి ఇంకా సమయముంది. ఈ లోపల మోడీకి ఇంకొంచెం దగ్గర కావాలని ప్రయత్నం చేయొచ్చు. అది దింపుడు కళ్లెం ఆశ లాగే కనబడుతుంది. చిదంబరం, రాబర్ట్ వాద్రా తో పోలిస్తే చంద్రబాబుని లోపలికి పంపించటం మోడీకి పెద్ద పనికాక పోవచ్చు. అదే చంద్రబాబు భయమంతా. చివరకు చంద్రబాబు ఆశ అంతా న్యాయస్థానాల మీదే. అక్కడ తనకు అనుకూల వ్యక్తులు వున్నారని ఎలాగైనా తనను కాపాడతారని ఆశతో ఉన్నట్లు తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.