Homeఆంధ్రప్రదేశ్‌రాజ్యాంగంలో లేని రాజధానిపై ఇంత రాద్ధాంతమా..!

రాజ్యాంగంలో లేని రాజధానిపై ఇంత రాద్ధాంతమా..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాలలో చివరిరోజు ప్రసంగం అనేక ప్రశ్నలకు తెరలేపింది. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై శాసనమండలిలో జరిగిన పరిణామాలు దుర దృష్టకరమన్నారు. తప్పు అని తెలిసినా విచక్షణాధికారాలతో నిబంధనలు అతిక్రమించి ఇష్టారాజ్యంగా వ్యవహరించే ఇలాంటి వ్యవస్థ మనకు అవసరమా అనేది ప్రజలు, మేధావులు ఆలోచించాలన్నారు. శాసనసభలో గురువారం శాసనమండలి, విచక్షణాధికారాలు, చట్ట ఉల్లంఘన నిబంధనల అతిక్రమణ ప్రజా ప్రయోజనాలపై ముఖ్యమంత్రి సుదీర్ఘ ప్రసంగం చేశారు.

భారత రాజ్యాంగంలో రాజధాని అనే పదమేలేదని స్పష్టం చేశారు. గత 8 నెలలుగా అనేక ప్రజోపయోగమైన చట్టాలను, సవరణ బిల్లులను ప్రవేశపెట్టామని తెలిపారు. ఆర్టీసీ విలీనం మొదలుకుని ఆంగ్ల మాధ్యమం వరకు దేశంలోనే మరెక్కడాలేని సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు. సమాజంలో అణగారిన వర్గాలపై మనసుపెట్టి పనిచేస్తున్నామని, తాము పాలకులం కాదు సేవకులమనే భావనతోనే ఉన్నామన్నారు. చట్టాలను కాపాడుకునేందుకు చెక్స్ అండ్ బ్యాలెనె్సస్ అవసరమని, అయితే శాసన మండలిలో జరిగిన పరిణామాలు మాత్రం దురదృష్టకరమన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేస్తూ చట్టసభలను అపహాస్యం చేశారని విమర్శించారు. చైర్మన్ నిష్పాక్షికంగా సభను నిర్వహించే పరిస్థితి లేదన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు తనకు సంబంధంలేని మండలి గ్యాలరీలోకి రావటం, ఆయన కనుసన్నల్లోనే చైర్మన్ నిబంధనలను ఉల్లంఘించి అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపటం దారుణమన్నారు. ఏదైనా బిల్లు మండలికి వస్తే చర్చించాలి, ఆమోదించాలి లేదా తిరస్కరించాలని, సభ్యుల అభిప్రాయాలను సూచిస్తూ సవరణలు పంపాల్సి ఉందన్నారు. ఇవేమీ లెక్కచేయకుండా విచక్షణాధికారం పేరుతో ప్రజలకు న్యాయం చేయకుండా ఉండేందుకు శాసనమండలిని వాడుకున్నారని ధ్వజమెత్తారు. దీన్ని మనం ఆమోదిస్తే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదన్నారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులకు సంబంధించి రూల్స్ సక్రమంగా ఉన్నాయని, దీనిపై చర్చించ వచ్చని అన్ని పార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ చివరిక్షణంలో ఒత్తిళ్లకు తలొగ్గి తన తప్పును తాను అంగీకరిస్తూనే రాజ్యాంగ విరుద్ధంగా చైర్మన్ వ్యవహరించారని ఆరోపించారు. తప్పును ఒప్పుకుని తెలిసి కూడా విచక్షణాధికారంతో చేస్తామనటం సమంజసం కాదన్నారు. ఏ బిల్లుకైనా సవరణలు విధానపరంగా అది ప్రవేశపెట్టిన 12 గంటల లోపే ఇవ్వాలన్నారు. సెలక్ట్ కమిటీకి ఇవ్వాలనే ఆలోచన ముందుగా చేయాలన్నారు. శాసనమండలిలో ప్రభుత్వపరంగా వచ్చే బిల్లులకు తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రైవేట్ బిల్లులను తరువాత మాత్రమే ప్రవేశపెట్టాలనే నిబంధన ఉందన్నారు. సెలక్ట్ కమిటీ వేయాలనే ప్రతిపాదన రూల్ పరంగా లేదని చెప్పారు. ఈ విషయంలో నిబంధనలు లేవని తెలిసినా తన విచక్షణాధికారంతో తప్పు చేస్తున్నట్లు చైర్మన్ స్వయంగా ప్రకటించారని వివరించారు. ప్రజా స్వామ్యంలో ఇది ఎంత వరకు సమ్మతమో ప్రజలే తేల్చాలన్నారు. శాసనమండలి చట్ట ప్రకారం నడుస్తోందా? పార్టీ, వ్యక్తుల కనుసన్నల్లో నిర్వహిస్తున్నారా అనే విషయాలు ఈ సందర్భంగా దీన్ని బట్టి ఆలోచించాలన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ ఇష్టా ఇష్టాలను తుంగలో తొక్కారన్నారు. ప్రాంతీయ అసమానతలు చోటు చేసుకోకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధికి, పాలనా వికేంద్రీకరణకు నిర్దేశించిన బిల్లులను చట్టం కాకుండా నిరోధించే సభగా మండలి మారిందన్నారు.

హత్య చేయటం నేరమని తెలిసి కూడా చేస్తాననటం నేరం కాదా అని ప్రశ్నించారు. అందరి అభిప్రాయంతో దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలనే భావనతో ఉన్నట్లు చెప్పారు. 2019 ఏప్రిల్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 సీట్లు గెలుచుకుని శాసనసభలో 86 శాతం మెజారిటీ సాధించామని, ప్రజామోదంతో అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు.

శాసనసమండళ్లు దేశంలోని 22 రాష్ట్రాల్లో ఎక్కడాలేవని, కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయన్నారు. పేద రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మండలి నిర్వహణకు రోజుకు కోటి రూపాయల ఖర్చవుతుందని, ఏడాదిలో 60 రోజులు అంటే రూ. 60 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. మేధావులకు నేరుగా అవకాశం కల్పించి ప్రభుత్వానికి సూచనలిచ్చేందుకు మాత్రమే ఈ సభలు ఏర్పాటయ్యాయని, అయితే శాసన సభలోనే ఉన్నత చదువులు చదివిన వైద్యులు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, పోస్టుగ్రాడ్యుయేట్లు ఉన్నారన్నారు. చివరకు యాక్టర్లు, జర్నలిస్టులు కూడా సభల్లో ప్రవేశిస్తున్నారని అలాంటప్పుడు మండలి అవసరమా అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేసే ఆలోచన లేకపోగా ఎలా ఆపాలి, ఎలా జాప్యం చేయాలనే దురుద్దేశంతో హాని కలుగజేసే ఇలాంటి సభలు ఎంత వరకు అవసరమో ఆలోచించాలన్నారు. ప్రజాభిప్రాయం, చట్టసభల నిబంధనలకు వ్యతిరేకంగా, చట్టం, రూల్స్‌తో సంబంధం లేకుండా పనిచేస్తున్న మండలిని కొనసాగించటం అవివేకమవుతుందని స్పష్టం చేశారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదని చెప్తూ సీటు గవర్నెన్స్ ఉంటుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, చట్టాలు చేసే అధికారాన్ని ప్రజలు తమకు అప్పగించారని స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం కల్పించారన్నారు. పాలనా వికేంద్రీకరణ ఇందులో భాగమన్నారు.

తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఊటీ నుంచి పాలించారని గుర్తు చేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబు హుదూద్ తుపాను సమయంలో పది రోజులు విశాఖలోనే ఉన్నారని అక్కడి నుంచే అన్ని వ్యవహారాలు నడిపారన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పాలన నిర్వహించే అధికారం ఉందన్నారు. ఇందుకు ఏ చట్టం, బిల్లు అవసరం లేదని చెప్తూ ఓ తీర్మానం చేస్తే సరిపోతుందని వివరించారు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కడైనా నిర్వహించ వచ్చని, ఆర్టికల్ 174 ప్రకారం ఎక్కడైనా చట్టాలు చేసుకునే వీలుందన్నారు. ప్రజలకు మంచిచేసే పనులను అడుగడుగునా అడ్డుకుంటూ రాజకీయ దురుద్దేశాలకు వేదికగా మారి రాజకీయ అజెండాతో నడుస్తున్న ఇలాంటి సభలకు ఇక ముగింపు పలకక పోతే నష్టపోతామని, దీనిపై ఆలోచన చేయాలని ప్రజలు, ప్రజాప్రతినిధులను కోరారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version