
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పట్టుకోల్పోయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే పార్టీ అధిష్టానం మాత్రం పట్టువదలకుండా హుజూర్‌నగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో ఇప్పటికీ బలమైన రాజకీయ పార్టీగా నిలవగలమని చాటి చెప్పడమే లక్ష్యంగా తెలుగుదేశం వ్యూహరచన చేస్తోంది.
ఇందులో భాగంగా నందమూరి కుటుంబాన్ని టీడీపీ అభ్యర్థి కిరణ్మయికి మద్దతుగా రంగంలోకి దింపాలని పార్టీ నిర్ణయించింది. అక్టోబర్ 16 నుంచి హరికృష్ణ కుమార్తె సుహాసిని మూడు రోజుల పాటు కిరణ్మయికి మద్దతుగా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. అభ్యర్థి మహిళ కావడం వలన సుహాసినితో ప్రచారం చేయిస్తే అక్కడున్న మహిళల ఓటు బ్యాంకు తమకు అనుకూలంగా మారుతుందని టీడీపీ భావిస్తోంది. ఇదిలా ఉంటే.. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ కూడా హుజూర్‌నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశమున్నట్లు తెలిసింది. అక్టోబర్ 17 లేదా 19 తేదీలలో బాలకృష్ణ ప్రచారంలో పాల్గొంటారన్న ప్రచారం జరుగుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సుహాసిని కూకట్‌పల్లి స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో నందమూరి బాలకృష్ణ స్వయంగా సుహాసిని తరుపున ప్రచారం నిర్వహించినా గాని ఫలితం దక్కలేదు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం వేసిన ఎత్తులు ఏవీకూడా పనిచేయలేదు. మరి ఈసారి ఏవిధమైన నమ్మకంతో హరికృష్ణ కుమార్తెను మళ్ళి తెరపైకి తీసుకొస్తున్నారో పార్టీ అధిష్టానికే తెలియాలి!