
డాక్టర్ లక్ష్మణ్ ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా పనిచేస్తున్నాడు. మంచి విద్యావేత్త. ఏ విషయంపై నయినా సమగ్రంగా అధ్యయనం చేసి మాట్లాడతాడు. మరి ఏమయిందో ఏమోగానీ ఈ రోజు తాను మాట్లాడిన ధోరణి చూస్తే ఫక్తు ఓట్లకోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ఓ ప్రాంతీయపార్టీ నాయకుడుగా మాట్లాడాడు. అధ్యక్షుడుగా పనిచేసేదేమో ఒక జాతీయపార్టీ అందునా దేశీయ భావాలు మెండుగా ఉన్నాయని చెప్పుకునే పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. ఎందుకిలా మాట్లాడని ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఇంతకీ అసలు విషయమేంటి?
రేపు కెసిఆర్ ప్రధాని మోడీని ఉదయం 11గంటలకు కలవబోతున్నాడు. ప్రధానితో మాట్లాడే చర్చనీయాంశాల్లో నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి నుంచి కృష్ణా నదికి నీళ్లు తరలించటానికి అయ్యే ఖర్చు కేంద్రం భరించమని కోరవచ్చని వార్తలు వెలువడ్డాయి. ఇటీవలే కెసిఆర్-జగన్ భేటీలో గోదావరి నుంచి శ్రీశైలంకు నీళ్లు తరలించే విషయంలో స్థూలమైన అంగీకారానికి వచ్చిన నేపథ్యంలో ప్రధానిని కలిసి సహాయం చేయమని అడగబోతున్నట్లు తెలుస్తుంది. దానిపై స్పందిస్తూ తెలంగాణ నుంచి నీళ్లను ఆంధ్రకు తరలించటంపై అభ్యంతరం వ్యక్తంచేశాడు. ఇద్దరు ముఖ్యమంత్రులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి కమీషన్ల కోసం ఒక లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పాడు. ఆంధ్రాలో ఇప్పటికే ఎక్కువ ప్రాజెక్టులు కట్టారని అంతకుముందు కెసిఆర్ చెప్పాడని ఇప్పుడు ఎందుకు నీళ్లు తరలిస్తున్నాడని తెలంగాణ సెంటిమెంటుని రెచ్చగొడుతూ మాట్లాడాడు. డాక్టర్ లక్ష్మణ్ లాంటి వ్యక్తి ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం ఆశ్చర్యంగా వుంది. కెసిఆర్ ని వ్యతిరేకించే క్రమంలో ఏ ఆయుధం దొరికినా యుద్ధం చేయాలని అనుకోవటంతోనే ఇటువంటి ప్రాంతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టటంగా చూడాల్సివుంది. ప్రాంతీయ అభిమానం ఉండటం వేరు, దురభిమానంగా మారటం వేరు. ఆంధ్ర-తెలంగాణ విద్వేషాలు ఇప్పుడిప్పుడే తగ్గి సామరస్యం నెలకుంటున్న తరుణంలో ఒక జాతీయపార్టీకి చెందిన నాయకుడు ఇలా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం ఆశ్చర్యంగా వుంది. ఇంతకీ అసలు తన మాట్లాడినదాంట్లో నిజమెంతో పరిశీలిద్దాం.
గోదావరి నుంచి అధికభాగం నీళ్లు సముద్రం పాలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణాలో ఇప్పుడు మొదలైన అన్ని ప్రాజెక్టులు పూర్తయినా ఇంకా ఎంతో నీరు సముద్రంలో వృధాగా కలిసిపోతుందనేది వాస్తవం. రెడీగా లెక్కలు లేకపోవటంతో ఇక్కడ ఇవ్వటంలేదుగానీ దీనిపై వివాదమేదీ లేదు. మిగులు నీళ్లు సమృద్ధిగా గోదావరిలో ఉన్నాయనేది అందరూ ఒప్పుకుంటున్న నిజం. అటువంటప్పుడు తెలంగాణ ప్రయోజనం ఎక్కడ దెబ్బతింటుందో డాక్టర్ లక్ష్మణ్ సోదాహరణంగా వివరించివుంటే బాగుండేది. వాస్తవాలతో సంబంధంలేని వాదన చేయటం కేవలం సెంటిమెంటు ని రెచ్చగొట్టి సొమ్ముచేసుకోవాలనే తాపత్రయంగా కనిపిస్తుంది తప్పితే వేరే మరేది లేదు. మరి బీజేపీ దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం జరగాలని కోరుకుంటుంటే ఇటువంటి వాదనలు ముందుకు తెస్తే వాళ్ళ జాతీయ విధానానికి వ్యతిరేకం కాదా? బీజేపీ నాయకులు దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతయినా వుంది.
చివరగా ఇంకో విషయం చర్చించాల్సి వుంది. కేవలం ఎగువ రాష్ట్రాలు నీళ్లపై ఇటువంటి వాదనలు లేవనెత్తితే కరువుప్రాంతాలైన తమిళనాడు లాంటి రాష్ట్రాలకు నీళ్లు ఎలా దక్కుతాయి. దేశభక్తి అంటే ఉపన్యాసాల్లో చూపించటంకాదు ఆచరణలో విశాల దృక్పధంతో ఆలోచించినప్పుడే అది నిజమైన దేశభక్తికి కొలమానంగా ఉంటుంది. మరి బీజేపీ నాయకులు ఇలా రెచ్చిగొట్టే ప్రకటనలు చేయటం ఏవిధమైన దేశభక్తో ప్రజలకు వివరించాల్సిన అవసరం వుంది. ఇదేదో తెరాసనో, జగన్ పార్టీనో సమర్ధించటానికి లేవనెత్తినట్లు ఎవరైనా భావిస్తే పొరపాటు. కేవలం బీజేపీ నాయకుని ప్రెస్ మీట్ చూసి స్పందిస్తునట్లుగానే భావించాలి. ఇప్పటికైనా డాక్టర్ లక్ష్మణ్ తన వాదనలోని పొరపాటుధోరణిని సరిదిద్దుకుంటాడని ఆశిద్దాం.