
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడవక ముందే.. రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వాతావరణానికి జనసేన-బీజేపీ కూటమి కారణమని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుంటూ.. గత కొంతకాలంగా వైసీపీ నేతలు తీవ్రమైన దూకుడునే ప్రదర్శించారు. ఆయనను వ్యక్తిగతంగా విమర్శించడమే కాకుండా ఆ పార్టీ శ్రేణులపై అక్కడక్కడా దాడులకు పాల్పడుతున్న ఉదంతాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. దాంతో ఒక బలమైన రాజకీయ అండ తీసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కు ఏర్పడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చేతులు కలిపితే.. అధికార వైసీపీని దీటుగా ఎదుర్కోగలమనే అంచనాకు పవన్ వచ్చారు. కాబట్టి ఒక రాజకీయ అనివార్యతే బీజేపీతో వెళ్లేందుకు జనసేనకు మార్గం వేసిందని చెప్పొచ్చు.
పరస్పర ప్రయోజనాల కోసమే ఈ రెండు పార్టీలు కలిశాయి. బీజేపీతో కలవడం పవన్ కు ఎంత అవసరమో.. బీజేపీకి కూడా అంతే అవసరం. ఎందుకంటే గత కొంతకాలంగా దక్షిణ భారతంలోకి ప్రవేశించాలని కమల నాథులు చేయని ప్రయత్నం లేదు. ప్రస్తుతం బీజేపీకి అవకాశం వచ్చింది. పవన్ కలయికతో బీజేపీకి ఒక ప్రచారసారథి, జనాన్ని ఆకర్షించి, పార్టీ విస్తరణకు దోహదపడగల వ్యక్తి లభించినట్లయింది. అలాగే బీజేపీ అండతో జనసేనకు నైతిక స్థైర్యం లభించినట్లయింది.
ఈ కూటమికి మొదటి టార్గెట్ అధికార వైసీపీనే. అయినప్పటికీ పవన్ కల్యాణ్ పైనే ఇప్పటికీ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ పై దూకుడు ప్రదర్శించలేకపోతోంది. ఇక్కడే వైసీపీ రాజకీయ వ్యూహం తేటతెల్లమవుతోంది. ఇప్పుడు కొత్త కూటమి రూపంలో కార్యాచరణకు దిగి కేంద్రం సహకారంతో జగన్ దూకుడుకు ముకుతాడు వేయగలిగితే ఆ క్రెడిట్ కచ్చితంగా జనసేన,బీజేపీలకు దక్కుతుంది. ఈ కూటమి జగన్ సర్కార్ ని నిలువరించి బలోపేతమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందో.. లేదో..? తీయాలంటే.. కొంతకాలం వేచి చూడాలి.