
ఆంధ్ర రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కితున్నాయి. ఇందులో ఇరుపక్షాలు పాత్రధారులే. పరిశీలకుల అంచనా ప్రకారం తెలుగుదేశం సానుభూతి రాజకీయాలు చేస్తుందని అనుకుంటున్నారు. అసెంబ్లీ లో సస్పెండ్ అయితే అది ప్రజల్లో వైస్సార్సీపీ ఫై కోపంగా తెలుగుదేశం పై సానుభూతిగా మారుతుందని చంద్రబాబునాయుడు భావిస్తున్నట్లు వున్నాడు. అసెంబ్లీ బిల్లులపై చర్చ కన్నా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోవటంతోనే సమయమంతా వృధా అవుతుంది. అసెంబ్లీ చూసేవాళ్లకు ఇది చేపలమార్కెట్ లాగా వుంది కానీ అసెంబ్లీ లాగా లేదు.
ఈ సెషన్ లో ఎన్నో కీలకమైన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టటం, ఆమోదించటం కూడా జరిగింది. ఓ విధంగా చెప్పాలంటే ఈ బిల్లులన్నీ చరిత్రాత్మకమైనవే. అయితే అందరుమనసుల్లో తొలుస్తున్న ప్రశ్న ఇవి అమలుచేయటానికి కావాల్సిన నిధులు ఎక్కడినుంచి వస్తాయనేదే . చూడబోతే మొత్తం ఎన్నికల వాగ్ధానాలు ఈ బడ్జెట్ సెషన్ లోనే అమలుచేసేటట్లు వుంది. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ తొందర కు కొన్ని బలీయమైన కారణాలే ఉన్నాయని అనిపిస్తుంది.
జగన్ మీదున్న కొన్ని కేసులు అడ్వాన్స్ దశలో వున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు. అందుకే ఎంత తొందరగా వాగ్దానాలన్నీ చట్టం చేసి అమలు చేస్తే అంత తొందరగా ప్రజల్లోకి తనపై అనుకూల వాతావరణం పెరుగుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ కోర్టులో శిక్షపడినా ప్రజల్లో అభిమానం చెక్కుచెదరకుండా ఉండేటట్లు చేయటమే ఈ తొందరకు కారణమని తెలుస్తుంది. ఏది ఏమైనా ఇవన్నీ తన వాగ్ధానాలను అమలుచేయటంపై చిత్తశుద్దిగా వైస్సార్సీపీ ప్రచారం చేస్తుంది.
ఇక చంద్రబాబునాయుడు వ్యూహాలు ఫలించే అవకాశాలు తక్కువేనని చెప్పొచ్చు. వున్న ఎమ్మల్యేలను కాపాడుకోగలగటం కష్టమే. బీజేపీ ఇప్పుడున్న పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవటానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుంది. త్వరలో గంపగుత్తగా ఎమ్మెల్యే లను తమవైపు తిప్పుకుంటుందనే ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. ఇటీవలే బొల్లినేని శ్రీనివాస గాంధీపై కేసులు పెట్టటం భవిష్యత్తులో జరిగే పరిణామాలకు సంకేతం. పోలవరం పై వేసిన కమిటీ ఈరోజే నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే వేడెక్కిన రాజకీయాలు ముందు ముందు మరింత ఉద్రిక్తంగా తయారవబోతున్నాయి. వేచిచూద్దాం.