
గత ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి చంద్రబాబుతో అంగీకారం కుదుర్చుకున్న కంపెనీలు ఒక్కొక్కటిగా జారుకుంటున్నాయి. విశాఖలో రూ. 70వేల కోట్లతో పెట్టాలనుకున్న డేటా సెంటర్ పెట్టుబడుల నుంచి అదానీ గ్రూప్ వెనక్కి తగ్గిన .. రెండు, మూడు రోజుల్లోనే… ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
తిరుపతిలో రిలయన్స్ పెట్టాలనుకున్న ఎలక్ట్రానిక్ సెజ్ నుంచి ఆ సంస్థ వైదొలిగింది. తాము పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా లేమని నేరుగా ప్రభుత్వం ముఖం మీదే చెప్పేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడులకు అంగీకారం కుదుర్చుకున్న తర్వాత… చర్చల కోసం ముఖేష్ అంబానీ నేరుగా అమరావతి వచ్చారు. చంద్రబాబుతో మాట్లాడారు. ఆ తర్వాత ఒప్పందం చేసుకున్నారు. తిరుపతి విమానాశ్రయం సమీపంలో 150 ఎకరాల్లో ఈ సెజ్ ఏర్పాటుకు భూమిపూజ జరిగింది. ఇందులో రిలయన్స్ సంస్థ సుమారు రూ.15వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. ఈ సెజ్‌లో ఏటా కోటి జియో సెల్‌ఫోన్లు తయారు చేస్తాం. జియో ఫోన్లు, చిప్ డిజైన్, బ్యాటరీలు, సెట్‌టాప్ బాక్స్‌ల వంటివన్నీ ఈ ఎలక్ట్రాట్రనిక్స్ పార్కులో తయారు చేస్తాం” అని అప్పట్లో ముఖేష్ అంబానీ స్వయంగా ప్రకటించారు.
అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం 150 ఎకరాలు కేటాయించినట్టే చేసి కేవలం 75ఎకరాలకు మాత్రమే అంగీకారం తెలిపింది. అవికూడా వివాదాల్లో ఉన్న భూములు కావడంతో రిలయన్స్ తన పనులను ఎలక్షన్ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం వస్తే మొదలుపెడదామని అనుకుంది.
కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రిలయన్స్ .. ప్రాజెక్టును వదులుకోవడానికి సిద్ధపడింది. ఈ ప్రాజెక్ట్ కోసం.. గత ప్రభుత్వం ఇచ్చిన 75 ఎకరాల భూములన్నీ వివాదాల్లో ఉన్నవే. కోర్టు కేసుల్లో పడ్డవే… అందుకే మేము (రిలయన్స్ వర్గాలు ) తీవ్ర అసంతృప్తితో ఉన్నామని చెప్తూ … పెట్టుబడులపై పునరాలోచన నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించారు.
అయితే జనాలు మాత్రం జగన్ కి భయపడే రిలయన్స్ తన ఒప్పందాన్ని రద్దు చేసుకుందని, వైస్సార్ మరణించినప్పుడు పరోక్షంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ పై వచ్చిన అభియోగాలు ఇంకా జగన్ మర్చిపోయిఉండడని , జగన్ ప్రభుత్వంతో పనిచెయ్యడం ఎప్పటికైనా కష్టమేనని భావించి ఈ ఒప్పందాన్ని ముకేశ్ అంబానీ రద్దు చేసుకొని ఉంటాడని వినికిడి. దీనిని బట్టి చూస్తే రిలయన్స్ ఒకరకంగా జగన్ కి బయపడినట్లే అని తెలుస్తుంది.