
తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి వున్న ఇమేజ్ గురించి మనఅందరికి తెలిసిందే. ఇప్పటికి చాలామంది మన తెలుగు సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుకుంటే ముందుగా వారి నోటి వెంట ఠక్కున వచ్చే కధానాయకుల పేర్లు NTR, ANR. వీరి పేర్లు పలుకుతూనే వెంటనే మెగాస్టార్ చిరంజీవి అంటారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ తర్వాత చాలమంది టాప్ హీరోలు ఉన్నప్పటికీని ఆ ఇద్దరి హీరోల పేర్లు తర్వాత చిరంజీవి పేరు స్మరిస్తారు. అంతలాగ చిరంజీవి తన ముద్రను అటు తెలుగు సినిమా పరిశ్రమపై ఇటు అభిమానుల హృదయాలపై ముద్రించారు అనడంలో సందేహం లేదు.
విషయానికి వస్తే… అంత ఇమేజ్ ఉన్న చిరంజీవి ప్రజాసేవకై రాజకీయాల్లోకి వెళ్ళి తిరిగి మళ్ళి సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి తన సత్తా ఏమిటో మరో సారి తెలుగు సినిమా ప్రేక్షకులకు చూపిస్తున్నారు. అయితే రాజకీయాలను వదిలి మళ్ళి సినిమాలకు వచ్చిన చిరంజీవి కొన్ని ఆలోచనలతో ఇబ్బంది పడిన విషయాన్ని అయన మీడియా లో కూడా వివరించారు. అలాంటి చిరంజీవికి తనయుడు వెన్నంటే వుండి, చిరంజీవిని తన తండ్రిలా కాకుండా ఒక హీరోలాగానే చూసాడనిపిస్తుంది.
ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే… చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చిన 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ఆ తర్వాత వచ్చిన 151వ హిస్టారికల్ మూవీ ‘సైరా’ కి నిర్మాత చిరు తనయుడు రాంచరణ్. తన తండ్రి నటించబోయే ప్రతి సినిమాలను తానే భుజాలపై వేసుకొని దగ్గరుండి పర్యవేక్షిస్తూ కావలిసిన జాగ్రత్తలు తీసుకుంటూ రెండు సినిమాలను హిట్ చేసాడు అనడంలో సందేహంలేదు.
సినిమాకి డైరెక్టర్ ఎంత ముఖ్యమైనవాడో, అదేరీతిగా ప్రొడ్యూసర్ కూడా అంతే సమానంగా ముఖ్యమైనవాడు. ఒక సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందాలంటే మంచి డైరెక్టర్ మంచి కథతో స్క్రీన్-ప్లే తో సినిమాను చిత్రీకరించాలి, జనాన్ని మెప్పించాలి. మరి ఆ డైరెక్టర్ అలా సినిమాని తీయాలంటే మంచి నిర్మాత చాలా అవసరం, అప్పుడే ఆ చిత్రం సక్సెస్ అవుతుంది.
డైరెక్టర్ , నిర్మాతలకు వున్న విలువల గురించి తెలుసుకోవాలంటే పాత తరం సినిమాల హీరోలు , ఆర్టిస్టుల ఇంటర్వూస్ చూస్తే వాళ్ళే చెపుతారు… దర్శక-నిర్మాతలు ఒక సినిమా కోసం ఎంత కష్టపడేవాళ్ళని.
రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించిన గత రెండు సినిమాలను పరిశీలిస్తే తాను దర్శకులకి ఎంత సహకరించాడో , సినిమా నిర్మాణ విలువలను ఎప్పటికప్పుడు ఎలా కేర్ తీసుకొనివుంటాడో అనే విషయాలు మనకి ఆ సినిమాలు సాధించిన విజయాలే చెపుతున్నాయి. ఎన్నో సినిమాల్లో నటించిన చిరులో కనిపించని ఒక మంచి నిర్మాత మనకు రామ్ చరణ్ లో కనిపిస్తున్నాడు. కొన్ని ఆడియో ఫంక్షన్స్ లో చిరంజీవి అంటూ ఉండేవారు.. రామ్ చరణ్ ఎప్పటికైనా నన్ను మించిపోతాడు అని.
తండ్రి (చిరు) పట్ల రామ్ చరణ్ కి ఉన్న ప్రేమ ఒక ఎత్తైతే , తనకి తానుగా సినిమా నిర్మాణ సామర్ధ్యాన్ని బాగా పెంచుకున్నాడనే చెప్పాలి. అందుకే చిరంజీవి ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో నటించే 152వ సినిమాకు కూడా రామ్ చరణ్ నిర్మాతగా ఉన్నాడు. ఎటూ.. కొరటాల శివ మంచి దర్శకుడని ఇప్పటికే నిరూపించుకున్నాడు. కాబట్టి ఒక మంచి దర్శకుడుకి ఒక మంచి నిర్మాత తోడైనాడు, హీరో ఏమో మెగాస్టార్. ఇంకేముంది మంచి సబ్జెక్టుని తెరకెక్కిస్తే సినిమా హిట్టే…..