
2018 డిసెంబర్ 13న తెలంగాణ ముఖ్యమంత్రిగా కెసిఆర్ గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఈ రోజుకి కచ్చితంగా సంవత్సరం అయింది. ఆ ఎలక్షన్లకు ముందు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో 24 అంశాలపై హామీలు ఇచ్చారు. అప్పటికే అమల్లో ఉన్న పథకాల్లో ప్రయోజనాల పెంపు కొన్నికాగా, కొత్తగా మరిన్ని ప్రకటించారు. ఆ వివరాలు ఇవే..
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రూ. రూ.3,016 భృతి ఇస్తామని ఎలక్షన్ల ముందు కేసీఆర్ ప్రకటించారు. దానిపై ఇప్పటికీ ముందడుగు పడలేదు.
లక్ష రూపాయల వరకు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని ఎలక్షన్ల ముందు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. గెలిచి అధికారం చేపట్టి ఏడాది అయినా ఇప్పటివరకు దానిపై స్పష్టత ఇవ్వలేదు.
వేతన సవరణ కోసం రాష్ట్రంలోని ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులకు వీలైనంత త్వరగా వేతన సవరణ చేస్తామని ఎలక్షన్ల సమయంలో సీఎం కేసీఆర్ చెప్పారు.వేతన సవరణ చేయాల్సిన గడువు దాటి ఏడాదిన్నర అవుతున్నా ఈ విషయం ముందుకు పడటం లేదు. పీఆర్సీ కమిటీ ఇప్పటివరకు నివేదికను సర్కారుకు అందచేయలేదు. కనీసం మధ్యంతర భృతి (ఐఆర్) అయినా ప్రకటించలేదు.
ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతుబంధు కోసం బడ్జెట్లో సర్కారు రూ.6,900 కోట్లు కేటాయించింది. అందులో రూ.5,500 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో 45 లక్షల మంది రైతులకే సాయం అందింది. తమకు సొమ్ము అందకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుబంధుపై టీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో నెరవేరలేదు.
రాష్ట్రంలో సొంత స్థలం ఉన్న పేదలు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామని ఎలక్షన్ల ముందు సీఎం కేసీఆర్ ప్రకటించారు. డబుల్బెడ్రూం పథకాన్ని కొనసాగిస్తూనే.. ఆర్థిక సాయాన్నీ అమలు చేస్తామని చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు జరగలేదు.
డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని నాలుగేండ్ల కింద ప్రారంభించారు. 2020 మార్చి నాటికి రెండు లక్షల ఇండ్లను పూర్తిచేసి, పేదలకు అందిస్తామన్నరు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 82 వేల ఇండ్లను మంజూరు చేశారు. కానీ ఇప్పటివరకు 40 వేల ఇండ్లు కూడా పూర్తి కాలేదు. చాలా చోట్ల పనులు పిల్లర్ల దశలోనే ఆగిపోయాయి.
రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. వయో పరిమితి తగ్గింపుతో కొత్తగా 7 లక్షల మంది వరకు లబ్ధిదారులు పెరుగుతారని అంచనా వేశారు. ఈ ఏడాది ఆగస్టు నుంచే వాళ్లకు పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. కానీ అమల్లోకి రాలేదు.
‘‘ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుంది’’.. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ఈ హామీ కూడా ఉంది కానీ అమలుపై ప్రయత్నాలు జరగలేదు.
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ మెంట్ ఏజ్ ను 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచుతామన్న హామీ అమలు కాలేదు.
“కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ, డిండి వంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన సాగిస్తం’ అని కేసీఆర్ ప్రకటించారు. ఈ నాలుగు ప్రాజెక్టుల్లో కాళేశ్వరం నిర్మాణం పాక్షికంగా పూర్తయింది. మిగిలిన ప్రాజెక్టుల పనిలో జాప్యం.
రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ క్యాంపులు పెట్టి ప్రతి వ్యక్తికి ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఆ టెస్టుల ఆధారంగా ప్రతి వ్యక్తి హెల్త్ వివరాలు రికార్డు చేసి, ఆ వివరాలతో రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని ప్రకటించారు. అమలు కాలేదు.
కంటి వెలుగును అద్దాల పంపిణీకే పరిమితం చేశారు. పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1,54,72,849 మందికి టెస్టులు చేసి.. 9,30,968 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. కానీ ఆపరేషన్లు జరగలేదు.
ముస్లింలు, ఎస్టీలకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ నేటికీ నెరవేరలేదు.
కల్తీ లేని ఆహార పదార్థాలను ప్రజలకు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతామని టీఆర్ఎస్ ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీగా ప్రకటించారు. కానీ యూనిట్లను ఏర్పాటు చేయలేదు.
‘రెడ్డి, వైశ్య కార్పొరేషన్లతోపాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తం.’అని మేనిఫెస్టోలో చేర్చారు.
అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడతామని మేనిఫెస్టోలో చెప్పారు. కానీ ఆ దిశగా ఒక్క ప్రయత్నమూ చేయలేదు.
ఎస్సీ వర్గీకరణ, చట్టసభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని 2014 ఎన్నికల్లోనే టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక దానిపై అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామని సీఎం కేసీఆర్ పలుమార్లు చెప్పారు. కానీ ఇవేవీ ఇప్పటికీ అమల్లోకి రాలేదు.