
జగన్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఇ డి అప్పలేట్ ట్రిబ్యునల్ పెన్నా సిమెంట్ కేసులో ఇ డి అధికారుల్ని తప్పుపట్టింది. ముందుగా పెన్నా సిమెంట్ కంపెనీ 1.1 కోట్ల రూపాయల లబ్ది కోసం సాక్షి పేపర్లో 45 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టటం ఏవిధంగానూ తర్కానికి నిలబడటంలేదని, హాస్యాస్పదంగా ఉందని చెప్పింది. సాక్షి పత్రిక రెండో అత్యధిక సర్క్యూలేషన్ గల పత్రికా ఉండటం ఈ పెట్టుబడులు వ్యాపార దక్షతకు సాక్ష్యంగా ఉన్నాయని తీర్పు చెప్పింది. సిబిఐ ఛార్జ్ షీట్ ఏమీ దైవదత్తం కాదని, ఆరోపణలు నిరూపణ కాకముందే దానిని అధికారులు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించింది. అసలు ఇందులో అక్రమ నగదు చలామణి కి సంబంధించి ఏముందని అడిగింది. సిబిఐ ఛార్జ్ షీట్ ని మక్కి కి మక్కి కాపీ కొట్టటం తప్పిస్తే ఈడీ కి సంబంధించి ఇందులో ఏమీ కనిపించలేదని చెప్పింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి కి పెద్ద ఉపశమనమే. ఇది రాబోయే పరిణామాలకు సంకేతమా?
జగన్ మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యినతర్వాత దర్యాప్తు సంస్థల్లో వచ్చిన మార్పుకి ఇది సంకేతంగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇది రాబోయే తీర్పులకు ముందు సూచికగా అని అనుకుంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి మీద ఇప్పటికే చాలా కేసులు పెండింగు లో వున్నాయి. ముఖ్యమంత్రి అయ్యిన తర్వాత ప్రత్యక్షంగా కోర్టు హాజరునుంచి మినహాయింపు కోరుతున్నాడు. అందుకు కోర్టులు ఆమోదం తెలుపుతున్నాయి. అయితే తన మీదున్న కొన్ని కేసుల్లో సాక్ష్యాలు బలంగా వున్నాయి. అదీగాక ఇందులో కొన్ని ఇప్పటికే చివరిదశకు చేరాయి. ఈ సమయంలో ఆరోపణలు నిరూపణ అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని అనుకుంటున్నారు. వచ్చే రోజుల్లో ఈ పరిణామాలు ప్రధానం కాబోతున్నాయి. ఓ విధంగా జగన్ మోహన రెడ్డి కి ఇది పెద్ద అగ్నిపరీక్షే.