Homeఆంధ్రప్రదేశ్‌అత్యుత్తమ నివాసయోగ్య నగరం మన హైదరాబాదు

అత్యుత్తమ నివాసయోగ్య నగరం మన హైదరాబాదు

మన హైదరాబాద్ నగరం అగ్ర స్థానాన నిలవటం మనందరికీ ఎంతో గర్వంగా వుంటుంది. అటువంటి సంఘటన ఇప్పుడు మరలా చోటుచేసుకుంది. ప్రఖ్యాత ఆంగ్ల పత్రిక మింట్ మనదేశంలోని 6 ప్రధాన మెట్రో నగరాలను తీసుకొని వివిధ అంశాల ఆధారంగా అన్నింటిలోకి హైదరాబాద్ అత్యంత నివాస యోగ్య నగరంగా ప్రకటించింది. ఇది మనందరికీ గర్వకారణం. మరి తక్షణం మన మదిలో మెదిలే సమస్య మన హైద్రాబాదులో సమస్యలు లేవా అనేది. ఎన్నో సమస్యలున్నాయి ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, ప్రజా రవాణా అందుబాటు లాంటి అనేక సమస్యలు వెంటాడుతుంటే హైద్రాబాదు ని ఎలా ప్రకటించారనేది మనందరి మదిలో తొలుస్తోంది కదూ . ఒక్కసారి ఏ ప్రాతిపదికన నిర్ణయించారో పరిశీలిస్తే మనకే అర్ధమవుతుంది. రెండోది, మిగతా నగరాలు ఇంతకన్నా అధ్వానంగా ఉన్నాయని అనుకోవాలి. వివరాల్లోకి వెళితే ,

మొత్తం పది అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. పనిదినాల్లో రోడ్ల పై ప్రయాణానికి పట్టే సమయం, ప్రజా రవాణా సదుపాయం, కొత్తగా వచ్చే వలసలు, అన్ని కులాలు, మతాలు కలిసి నివసించే వైవిధ్యం , అందుబాటులో ఇళ్ళు , ఆహార సదుపాయాలు, స్కూళ్ళు ఆసుపత్రులు లాంటి మౌలిక సదుపాయాలు, పచ్చదనం, పరిశుభ్రమైన గాలి, మునిసిపాలిటీ ఆర్ధిక స్తోమత అంశాలు తీసుకున్నారు. ఇందులో రోడ్ల పై ప్రయాణానికి పట్టే సమయం, కొత్తగా వచ్చే వలసలు, అందుబాటులో ఇళ్ళు , మౌలిక సదుపాయాలు అంశాల్లో హైదరాబాదు మిగతా అయిదు నగరాల కన్నా ముందంజలో వుంది. అలాగే మునిపాలిటీ ఆర్ధిక స్తోమతలో అన్ని నగరాలకన్నా వెనకబడివుంది. ప్రజా రవాణా , ఆహార సదుపాయాల్లో చివరినుంచి రెండో స్థానం లో వుంది. మొత్తం మీద చూస్తే హైదరాబాద్ ముందంజ లో వుంది.

కానీ ముఖ్యమైన రోడ్ల పరిస్థితి, మురుగునీటి పారుదల సౌకర్యం , వర్షపు నీటి కాల్వలు లాంటి ముఖ్యమైన అంశాలను ఈ సంస్థ పరిగణనలోకి తీసుకోకపోవటం శోచనీయం. వర్షమొస్తే చాలు భయపడే పరిస్థితి హైదరాబాదు ప్రజలు అనుభవిస్తున్నారు. రోడ్ల మీద ప్రయాణం ఒళ్ళు హూనమవుతుంది. మురుగునీరు అనేకచోట్ల ఇప్పటికీ రోడ్లమీద ప్రవహిస్తూంది. వీటికి ఇప్పట్లో మోక్షం వుండే సూచనలు కన్పించటం లేదు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన దశాబ్దాలనుండి కొనసాగుతూనే వుంది. ప్రభుత్వాలు మారినా, కోట్ల రూపాయల ప్రజా ధనం వరదలై పారినా ఆ మురుగు కంపు మాత్రం వదల్లేదు. హైదరాబాదులోని వందల చెరువులు మాయమయ్యాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కబ్జాదారులకు భయంలేదు. యథేచ్ఛగా చెరువులు మాయమవుతూనే వున్నాయి. ఒకవైపు నంబర్ వన్ ర్యాంకు వచ్చినందుకు సంబరపడాలో , వాస్తవ పరిస్థితులు భిన్నంగా వున్నందుకు బాధపడాలో అర్ధంకాని పరిస్థితి ప్రజలది. ఏడుపుని దిగమింగుకొని హైదరాబాదు ఒకటో ర్యాంకు లో నిలిచినందుకు చప్పట్లు కొడదాం , ఎంతయినా మన హైదరాబాదు ప్రజలుగా గర్వపడాలి కదా

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular