రేవంత్ రెడ్డి ప్రవర్తన మారదా ? ఇది ప్రజల మనస్సులో తొలుస్తున్న ప్రశ్న. తనకి రాష్ట్రంలో అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండొచ్చు. కానీ తను ఓ మోనార్క్ లాగా ప్రవర్తించటం ప్రజలకు, ముఖ్యంగా పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్న నాయకులకు నచ్చటం లేదు. తాను చెప్పిందే జరగాలని కోరుకోవటం, లేకపోతే మీడియా కి ఎక్కటం ఏ విధంగా చూసినా సమర్ధనీయం కాదు. పార్టీ లో తనో పెద్ద నాయకుడినని తనకు తాను ఊహించుకోవటం వలనే ఇదంతా జరుగుతుంది. అందువల్ల తను ఎక్కువమంది శత్రువులను కొని తెచ్చుకుంటున్నాడని గ్రహించలేకపోతే తన గొయ్యి తానే తవ్వుకున్నట్లవుతుంది.
రేవంతరెడ్డి తో సమస్యల్లా ఒక్కసారి పెద్ద నాయకుడు కావాలని అనుకోవటం. తన మాటే చెల్లుబాటు కావాలని కోరుకోవటం. లేకపోతే తిరుగుబాటు చేయటం. రేవంత రెడ్డి రాజకీయ ప్రస్థానం తెరాస తో మొదలయ్యింది. ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్నాడు. ఇక్కడా ఎన్నిరోజులు ఉంటాడో తెలియదు. ఎందుకంటే ఈ ధోరణితో ఉంటే కాంగ్రెస్ నాయకులు తనని బయటకు పంపించమని అధిష్టానం పై ఒత్తిడి తేవటం ఖాయం. అసలు సమస్యల్లా తను ఎక్కడున్నా అందరూ తన నాయకత్వాన్ని ఆమోదించాలని భావించటం. ఇటీవలే సోనియా గాంధీ ని కుటుంబ సభ్యులందరితో కలిసాడు. తనను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయమని ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. అసలు కాంగ్రెస్ లో ప్రతి వాడూ నాయకుడే. కొత్తగా చేరిన రేవంత్ రెడ్డి కింద పనిచేయటానికి ఏ సీనియర్ నాయకుడూ ఒప్పుకోడు. అటువంటప్పుడు రేవంతరెడ్డి కోరిక ఎలా తీరుతుంది. తన స్వంత జిల్లా మహబూబ్ నగర్ లోనే ఎవ్వరూ రేవంతరెడ్డిని ఒప్పుకోలేదు. రేవంతరెడ్డి ముందు ముందు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారయ్యే అవకాశముంది. నల్గొండ జిల్లాలో వున్నంతమంది నాయకులు కాంగ్రెస్ లో ఏ జిల్లా లో లేరు. అటువంటిచోట రేవంత్ రెడ్డి వేలుపెడితే ఎవరు ఒప్పుకుంటారు. అందుకే ఉత్తమ్ రెడ్డి కన్నా ముందుగా కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి రియాక్ట్ అయ్యాడు.
ఇది చదవండి: ‘హౌడీ మోడీ’ పై పాకిస్తాన్ కుట్ర!
రేవంతరెడ్డి ముందుగా బీజేపీ లో చేరటానికి సంసిద్దమయ్యాడని, అయితే తనని అధ్యక్షుడిని చేయమని షరతు పెట్టాడని , అందుకు బీజేపీ సిద్ధంగా లేకపోవటం తో కాంగ్రెస్ లో చేరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడని అందరూ అనుకుంటున్నారు. రేవంత రెడ్డి కి పార్టీ కన్నా తన పదవే ముఖ్యమని ఇప్పటికే ప్రజలకు అర్ధమయింది. దానితోపాటు బహిరంగంగా కులరాజకీయాలు చేయటం కూడా నెగటివ్ పాయింట్ అయ్యిందని అనుకుంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే రేవంత రెడ్డి ఎక్కడా ఇమిడే అవకాశాలు లేవు. తనకి ఒక్కటే ప్రత్యామ్నాయం కనబడుతుంది. తానే ఒక ప్రాంతీయపార్టీ పెట్టుకొని దానికి జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం. చివరకు అదే జరిగే అవకాశాలు సమీప భవిష్యత్తులో కనబడుతున్నాయి అని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.