ఒకనాడు ప్రజాప్రతినిధులంటే ఆదర్శంగా ఉండేవారు. ఒక సుందరయ్య, ఒక వావిలాల గోపాలకృష్ణ, ఒక తెన్నేటి లాంటి ఉద్ధండులు అసెంబ్లీలో ఉంటే ప్రజలకు ఉత్తేజాన్నిచ్చేది. రాజకీయ భేదాభిప్రాయాలు ఎన్నివున్నా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు రాజకీయాలను ప్రభావితం చేసేవి. తల్లిదండ్రులు తమ పిల్లలికి నాయకుల పేర్లు పెట్టుకునే వారు. మరి ఇప్పుడో? పిల్లలకు రాజకీయనాయకుల గురించి చెప్పటానికి భయపడుతున్నారు, పిల్లలు ఎక్కడ చెడిపోతారోనని. పత్రికల్లో చూస్తుంటాము, అప్పుడు ఎమ్యెల్యే గా చేసిన వ్యక్తి ఇప్పుడు పొలం పని చేసుకుంటున్నాడని, పేదరికంలో మగ్గుతున్నాడని . మరి ఈరోజో ? ఇలా చెప్పుకుంటూపోతే ప్రజా ప్రతినిధుల స్వరూపం ఎంతమారింది? మార్పు సహజం. కాకపొతే ఆ మార్పు ఏ మార్గంలో ఉందనేదే .
ఇటీవల వెలుగులోకి వచ్చిన రెండు,మూడు ఘటనలు చూద్దాం. ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అసెంబ్లీ ని హైద్రాబాదు నుంచి అమరావతి కి మార్చినప్పుడు అసెంబ్లీ ఫర్నిచర్ లో కొంతభాగాన్ని తన ఇంటికి తరలించాడట. వినటానికే సిగ్గుగా వుంది. రాజ్యాంగ పదవిలో వున్న వ్యక్తి చివరకి ఇంత గా చిలక్కొట్టుడు కి పాల్పడాలా? అసలు అటువంటి చెత్త ఆలోచన ఎలా వచ్చింది. అందుకనే అన్నారు, కనకపు సింహాసమున …….. కూర్చుండబెట్టి అని పెద్దలు. దానిపై దర్యాప్తు మొదలయినతర్వాత భుజాలు తడుముకుంటున్నారు. ఇక రెండోది అన్ని పత్రికల్లో, ఛానళ్లలో తాటికాయంత అక్షరాలలో వస్తున్న చిదంబరం అరెస్టు. ఎవరో సాదా సీదా మంత్రి కాదు. సాక్షాత్తు ఆర్ధికమంత్రి, యూపీఏ , యూఎఫ్ లల్లో కీలక నేత , న్యాయం , చట్టం వడపోసిన వ్యక్తి చివరకి నిబంధనల్ని ఉల్లఘించి ఎలా కొడుక్కి మేలు చేసాడో చూసాము. అంతెందుకు మొన్ననే వచ్చిన వార్త. కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు ఉండటానికి వసతి లేక తాత్కాలిక వసతి లో ఉంటున్నారట. కారణం ? పోయిన పార్లమెంటు కి ఎన్నికయి ఈ పార్లమెంటుకి ఎన్నికకాని సభ్యుల్లో 200 మందికి పైగా క్వార్టర్స్ ని ఖాళీ చేయకుండా తిష్టవేసుకొని కుర్చున్నారంట. చివరకి క్వార్టర్స్ కి కరెంటు, నీళ్లు ఆపేస్తామంటే ఆ సంఖ్య 100 కి పడిపోయింది. అంటే ఇంకా వంద మంది అలానే అంటిపెట్టుకొని వున్నారు. వీళ్ళు ప్రజాప్రతినిధులు. కొన్నేళ్ళక్రితం ఓ వార్త వచ్చింది. అది రుజువుకూడా అయ్యింది. ప్రజాసమస్యలపై పార్లమెంటులో ప్రశ్న వేసినందుకు లంచం తీసుకున్నారని. ఇలా చెప్పుకుంటూపోతే చిట్టా చాలా పెద్దది. స్థలం సరిపోదు.
ఇటువంటి ప్రజాప్రతినిధులు వున్నచోట నిజాయితీగలవాళ్ళు బతికిబట్ట కట్టలేరు. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున గెలిచినా రెండోసారి గెలిచే ఛాన్సే లేదు. లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ ఈ రాజకీయ వ్యవస్థని మార్చాలంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రజల్లో రాజకీయాలమీద అభిప్రాయాన్ని మారుద్దాం అని వచ్చి ఒకసారి గెలిచాడు. కానీ తర్వాత ఏమైంది? అంటే నిరాశావాదం తో మాట్లాడటం లేదు వాస్తవానికి దగ్గరలో మాట్లాడుతున్నాను. మేధావులు స్వతంత్రంగా వుండి వేగుచుక్కలాగా పనిచేయాలి తప్పితే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ వ్యక్తిత్వానికి మసక అంటుతోంది. అదేసమయంలో ఇంకో సెక్షన్ వుంది. సిద్ధాంతం పేరుతో ఎప్పుడూ ప్రభుత్వాలను విమర్చించటమే పనిగా పెట్టుకొని పనిచేస్తుంటారు. వాళ్లకు సమస్య మెరిట్ తో సంబంధం లేదు. విమర్శించాలి కాబట్టి కేవలం లోపాలనే ఎత్తిచూపుతారు, వాళ్లకు అందులో మంచివున్నా కనబడదు, కనబడినా అది మంచి అని చెప్పటానికి సిద్ధాంతం అడ్డువస్తుంది. అంతేకానీ, నిజాన్ని నిర్భయంగా చెప్పే అలవాటు ఉండదు. సిద్ధాంతం బోనులో బందీలు. అందువలనే వాళ్ళు కొంతకాలానికి ప్రజల నమ్మకాన్ని కోల్పోతారు. అలాకాకుండా ఓపెన్ మైండ్ తో అలోచించి అభిప్రాయాలు చెప్తే ప్రజలు వీరి అభిప్రాయాలను శాశ్వతంగా గౌరవిస్తారు. దానివలన ప్రజా చైతన్యానికి దోహదం చేసిన వారు అవుతారు. కాబట్టి రాజకీయనాయకులను మనం మార్చలేకపోయినా పార్టీలకు , సిద్ధాంతాలకు అతీతంగా మేధావులు వేగుచుక్కలుగా పనిచేస్తే సమాజానికి ఎంతైనా మేలుజరుగుతుంది.