కొత్త టీటీడీ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రత్యేక దర్శనాల పేరుతో ఇన్నాళ్లు సామాన్య భక్తుల్ని ఇబ్బందిపెట్టిన వైనం అందరికీ తెలిసిందే. దానిపై కొంత మంది కోర్టులో ప్రజా వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై విచారణ రేపు అంటే 18వ తేదీన జరగనుంది. ఇందులోభాగంగానే నిన్న కొత్త చైర్మన్ ఇప్పుడున్న మూడు క్యాటగిరీలతో కూడిన విఐపి దర్శనానికి బ్రేకులు వేశాడు. ఈ మూడు కేటగిరీల వలన సామాన్య భక్తులకు విపరీతమైన జాప్యం జరుగుతుందని ప్రకటించాడు. ఈ రోజు సాయంత్రం ఈ పద్దతి స్థానంలో కొత్త పద్దతి తీసుకొస్తానని ప్రకటించటం అందరూ హర్షిస్తున్నారు. దైవ దర్శనానికి ఇన్ని క్యాటగిరీలేంటని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ ప్రకటనను ప్రజలు స్వాగతిస్తున్నారు.
వైవి సుబ్బారెడ్డి ని నియమించినప్పుడు ఆయన హిందూ కాదని విమర్శించారు. నిజానికి అవునో కాదో తెలియదు కానీ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం హిందూ సామాన్య భక్తులకు మాత్రం పెద్ద ఊరటనే ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే దేవుణ్ణి దర్శించుకోవటానికి రాజకీయ పలుకుబడి వున్న వాళ్లకు లేని వాళ్లకు మధ్య వ్యత్యాసం చూపటం సరైనది కాదు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి లాంటి కొంతమంది ప్రముఖులకు తప్పితే మిగతా వాళ్ళందరూ సామాన్య జనంతోపాటు దర్శనానికి రావటానికి ఇబ్బందేమిటో అర్ధంకాదు. మనదేశంలో ప్రతిదీ డబ్బులు, అధికారం, హోదా తో ముడిపడి వుంది. చివరకు దేవుడి దర్శనం కూడా. ఈ వ్యవస్థ మారాలి. పనిలో పనిగా కొత్త చైర్మన్ ఇంకో మాట చెప్పాడు. విఐపి దర్శనాలను సంవత్సరానికి ఒకసారి మాత్రమే అనుమతిస్తే బాగుంటుందని తన అభిప్రాయంగా చెప్పాడు. ఇది హర్షింతదగ్గది . కానీ దానిమీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఇందులో తప్పేముంది. దర్శనాన్ని నిషేదించలేదు సుమా . కేవలం విఐపి దర్శనాన్నే పరిమితం చేయాలనీ చెప్పాడు. నిజంగా దాన్ని అమలుచేస్తే సామాన్య ప్రజలు జేజేలు పలుకుతారు. సుబ్బారెడ్డి గారు, గో ఎహెడ్ . విఐపి సంస్కృతిని పక్కనపెట్టండి. సామాన్య భక్తులకు అండగా నిలవండి. ఇలాంటి మరెన్నో నిర్ణయాలు తిరుమలలో మీ హయం లో రావాలని కోరుకుంటున్నాం. ధైర్యంగా ముందుకెళ్ళండి.