Pawan Kalyan – AAP Kejriwal : యుద్ధంలోకి దిగాక విజయమో.. వీర స్వర్గమో అన్నట్టుగా ముందుకెళ్లాలి. ఈ విషయంలో ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదర్శంగా నిలుస్తున్నారు. అన్నా హాజరే బ్యాచ్ లో నీతిమంతమైన రాజకీయాల కోసం గళమెత్తిన ఆయన 2012లో ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా పాలనతోనే మెరుగైన సమాజం సాధ్యమని ఢిల్లీలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అన్నా హాజరేను ఎదురించారు. ఆయన సిద్ధాంతాలను పక్కనపెట్టారు. కేజ్రీవాల్ నేరుగా ప్రజల్లోకి వెళ్లారు. వారితోనే ఉన్నారు. తన వాణి వినిపించారు. మొదటిసారే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి 28 సీట్లు వచ్చినా కుంగిపోలేదు. అనంతరం ప్రజల మెప్పు పొంది వరుసగా ఢిల్లీకి సీఎం అయ్యారు. బీజేపీని చిత్తుగా ఓడించి గెలుపుబావుటా ఎగురవేశారు.
దేశ రాజధానిపైనే కాదు.. పక్కనున్న పంజాబీల మనసు గెలిచారు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఇప్పుడు దేశంలో నరేంద్రమోడీకి ప్రత్యామ్మాయంగా అనుకుంటున్న మమతా బెనర్జీ, కేసీఆర్ లను తోసిరాజని కేజ్రీవాల్ జాతీయ నేతగా అవతరించారు. పంజాబ్ లో ఆప్ విజయం తర్వాత భారతవని చూపునంతా కేజ్రీవాల్ వైపు తిప్పుకున్నారు. బీజేపీకి ప్రత్యామ్మాయ రాజకీయ శక్తిగా అవతరించారు.
దేశ రాజకీయాలంటేనే రొచ్చు. కోట్లు కుమ్మరించి గెలుస్తున్న రోజులవీ. డబ్బు, మతం, కులం ప్రాతిపదికన ఓట్లు చీలి పార్టీలు గెలుస్తున్నాయి. అందుకు భిన్నంగా డబ్బులు పంచకుండా.. కేవలం అభివృద్ధి, నీతి నిజాయితీలతో సంక్షేమం ప్రాంతిపదికగా ఓటర్ల మనసులు గెలుచుకొని నిజమైన హీరోగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ నిలిచారు. గుజరాత్ లోనూ పోటీచేసి సత్తా చాటారు.
ఆమ్ ఆద్మీ.. పదేళ్ల క్రితం స్థాపించి ఎవరి మద్దతు లేకుండా సొంతంగా ఎదిగి ఇప్పుడు జాతీయ హోదా సాధించింది. ఒక్క బీజేపీపైనే ఆప్ పోరాడింది. కాంగ్రెస్ తో అంటకాగలేదు. ఒంటరిగా పోరాడింది. దానికి ఫలితం వచ్చింది. నాలుగు రాష్ట్రాలు ఆప్ పార్టీని ఆదరించాయి. ఓట్లు కురిపించాయి. ఆప్ పదేళ్లలోనే సాధించేసింది.
ఇప్పుడు అచ్చం అలాంటి లక్షణాలే తెలుగునాట పవన్ కళ్యాణ్ కు ఉన్నాయి. పార్టీని నడిపేందుకు డబ్బులు లేకపోతే అవినీతి చేయకుండా.. విరాళాలు సేకరించకుండా మళ్లీ సినిమాలు తీసి కష్టపడి సంపాదించి ఆ డబ్బులతో పవన్ రాజకీయాలు చేస్తున్నారు. అంతే తప్ప ఇతర పార్టీలలాగా అవినీతి రాజకీయాలను అస్సలు ప్రోత్సహించరు.
అయితే ఆప్ లాగా సొంతంగా తన కాళ్లపై ఎదగకపోవడం పవన్ చేస్తున్న తప్పు. ఎంతసేపు పొత్తులంటూ రాజకీయం చేయడమే పవన్ చేస్తున్న అతిపెద్ద తప్పుగా చెప్పొచ్చు.. ‘పవన్ కళ్యాణ్ రాజకీయాల తీరుపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.