Kohinoor Diamond : ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ మోసిన బోయిలెవరూ.. తాజ్ మహాల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరు? అని శ్రీశ్రీ ప్రశ్నించాడు. ఇప్పుడు బతికి ఉంటే ఆ స్థానంలో బ్రిటన్ రాణి ధరించిన వజ్రం, పెట్టుకున్న కిరీటం మనవేనోయ్ అని రాశేవాడేమో! ఎందుకంటే ఆ బ్రిటన్ రాణి ఎలిజబెత్ గతించింది. ఆమె ధరించిన వజ్రాలు వైఢూర్యాలు ఆమె తర్వాతి తరానికి చెందాయి. ఇప్పటికే అవి వారి చెంతకువెళ్లాయి. మరీ ఆ ఆభరణాలు ఎక్కడివి? ఆ వజ్రాలు ఎవరి ద్వారా వారికి చెందాయి? ఇవి కొన్ని దశాబ్దాలుగా ఆసక్తికర ప్రశ్నలుగా మిగిలిపోయాయి.
వీటిపై ‘ది గార్డియన్’ పత్రిక సంచలన విషయాలు వెల్లడించింది. ఈ పత్రిక బ్రిటన్ రాజ సంపదపై పరిశోధనలు చేసింది. ‘కాస్ట్ ఆఫ్ ది క్రౌన్’ పేరిట పరిశోధనాత్మక కథనాలు ముద్రించింది. బ్రిటన్ రాజసంపద భారత దేశానిదేనని తేల్చింది. భారత పురావస్తు శాఖ కార్యాలయాల్లో గుర్తించిన 46 పేజీల ఫైల్‌లోనూ కొన్ని విషయాలు దీనిని బలం చేకూర్చుతున్నాయని తెలిపింది. అసలు బ్రిటన్ రాజప్రాసాదానికి ఈ అమూల్య ఆభరణాలు ఎక్కడ నుంచి వచ్చాయి? వీటి పుట్టుక ఏమిటి? అనే విషయాలు తెలుసుకునేందుకు క్వీన్ ఎలిజబెత్-2 నాయనమ్మ క్వీన్ మేరీ విచారణ కూడా చేయించినట్టు తెలుస్తోంది.
1912 నుంచి జరిగిన పరిణామాలను ఒక్కొక్కటిగా గార్డియన్ వెల్లడించింది. ‘అత్యంత అమూల్య వజ్రా భరణాలు బ్రిటన్ రాజ కుటుంబానికి చేరడం పట్ల భారత్‌ను అప్పట్లో పాలించిన బ్రిటిష్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని’ పేర్కొన్నది. కింగ్ చార్లెస్-3 వచ్చే నెలలో పట్టాభిషిక్తుడు అవుతున్న నేపథ్యంలో గార్డియన్ కథనాలు సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుతం కింగ్ చార్లెస్ రాయల్ కలెక్షన్‌లో భాగంగా ఉన్న ‘పచ్చలు పొదిగిన బంగారు నడికట్టు’.. ఒకప్పుడు పంజాబ్ రాజు మహారాజా రంజిత్ సింగ్ తన గుర్రాలకు అలంకరించేవారు. భారత్ నుంచి దోచుకున్న సంపదకు ఇది నిలువెత్తు తార్కాణం.
ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల దోపిడీ కారణంగానే ప్రతిష్టాత్మక ‘కోహినూర్’ వజ్రం క్వీన్ విక్టోరియా ఆభరణాల్లో చేరింది. మే 6వ తేదీన జరగనున్న పట్టాభిషేకంలో క్వీన్ కెమిల్లా కోహినూర్ పొదిగిన కిరీటాన్ని ధరించే సంప్రదాయాన్ని పక్కన పెట్టారు. ఇది ఒకరకంగా దౌత్యపరమైన వివాదానికి దూరంగా ఉండడమే.. ఇక, 224 పెద్ద పెద్ద ముత్యాలతో రూపొందించిన నెక్లెస్ కూడా రంజిత్ సింగ్ ఖజానాకు చెందినదని తెలుస్తోంది. గార్డియన్ కథనాల నేపథ్యంలో బ్రిటన్‌లో స్థిరపడిన భారతీయ నాయకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఎట్టకేలకు.. వాస్తవాలను గుర్తించే నాగరిక యుగంలోకి వచ్చాం. దోపిడీ చేసిన సంపదను తిరిగి ఇవ్వడం మంచిదే. అయితే.. ఈ పనిచేసేందుకు అభివృద్ధి చెందిన నాగరిక దేశాలకు ఇంత సమయం ఎందుకు పట్టిందనేది తెలుసుకుని భవిష్యత్ తరాలు ఆశ్చర్యపోతాయి’ అని వ్యాఖ్యానిస్తున్నారు.