Karnataka Caste Census : కర్ణాటక కాంగ్రెస్‌లో కుల గణన చిచ్చు.. సిద్దరామయ్య సర్కార్‌కు సవాళ్ల సమయం!
కుల గణనను కాంగ్రెస్ పార్టీ తన నినాదంగా మార్చుకుంది. బీసీలను మచ్చిక చేసుకునేందుకు రాహుల్‌గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కుల గణనకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కల గణన చేస్తామని ప్రకటించారు. అయితే అధికారంలోకి రాలేదు. దీంతో అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణలో కుల గణనకు ఆదేశించారు. తెలంగాణ ఇప్పటికే కుల గణన పూర్తి చేసి అమలుకు చర్యలు చేపట్టింది. దీంతో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రాహుల్‌గాంధీ ప్రకటించారు. తెలంగాణ నేతలు కూడా రాహుల్ ఆదేశాలతోనే కులగణన చేశామని చెప్పుకుంటోంది.
తెలంగాణ కుల గణనలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాహుల్‌గాంధీ ఇటీవల నిర్వహించిన ఏఐసీసీ కార్యరవ్గ సమావేశంలో ప్రకటించారు. దీంతో పెద్ద రాష్ట్రమైన తాము కుల గణనలో వెనుకబడడం ఏంటన్న ఆలోచన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి తట్టింది. దీంతో 2015లో సిద్దరామయ్య మొదటి పర్యాయ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.169 కోట్ల వ్యయంతో నిర్వహించిన సామాజిక–ఆర్థిక మరియు విద్యా సర్వే, లేదా కుల గణన చేపట్టారు. ఈ నివేదికను బయటకు తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను వివాదానికి కారణమైంది. ఈ నివేదికను 2024 ఫిబ్రవరిలో కర్ణాటక రాష్ట్ర వెనుకబాటు తరగతుల కమిషన్ సమర్పించినప్పటికీ, దానిని అమలు చేయడంపై లింగాయత్, వొక్కలిగ సమాజాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ నివేదిక రాష్ట్రంలోని కుల జనాభా నిష్పత్తులను సవాల్ చేస్తూ, లింగాయత్‌లు (66.35 లక్షలు), వొక్కలిగల (61.58 లక్షలు) సంఖ్య సంప్రదాయ అంచనాల కంటే తక్కువగా ఉందని సూచిస్తోంది, ఇది రాజకీయంగా సున్నితమైన సమస్యగా మారింది.
లింగాయత్, వొక్కలిగల ఆధిపత్యం..
రాష్ట్రంలో రాజకీయంగా, సామాజికంగా ఆధిపత్యం కలిగిన లింగాయత్, వొక్కలిగ సమాజాలు ఈ నివేదికను ‘అవైజ్ఞానికమైనది‘ అని తిరస్కరిస్తూ, కొత్త సర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. అఖిల భారత వీరశైవ మహాసభ అధ్యక్షుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే షమనూరు శివశంకరప్ప, నివేదికలో అనేక వైరుధ్యాలు, లోపాలు ఉన్నాయని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారై, సర్వే పద్ధతి సరిగా లేదని పేర్కొన్నారు. ఈ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత విభేదాలను తెరపైకి తెచ్చింది, ఎందుకంటే ఈ రెండు సమాజాలు పార్టీలో కీలక పాత్ర పోషిస్తాయి.
నివేదిక అమలుకు ఓబీసీల ఒత్తిడి
మరోవైపు, వెనుకబాటు తరగతులు (ఓబీసీ), దళిత సమాజాల నాయకులు నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని, దాని ఆధారంగా రిజర్వేషన్ విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బిల్లవ సమాజానికి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు బీకే.హరిప్రసాద్, ‘ప్రభుత్వం పడిపోయినా సరే, నివేదిక బహిర్గతం కావాలి‘ అని గట్టిగా పేర్కొన్నారు. ఈ నివేదిక షెడ్యూల్డ్ కులాలలో అంతర్గత రిజర్వేషన్ కోటాలను అమలు చేయడానికి ఉపయోగపడుతుందని, సామాజిక న్యాయం కోసం ఇది కీలకమని హోం మంత్రి జి.పరమేశ్వర్ అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 7, 2024న ఓబీసీ శాసనసభ్యుల బృందం సిద్దరామయ్యను కలిసి, నివేదికను అమలు చేయాలని కోరింది.
కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభం
కుల గణన నివేదికపై నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. లింగాయత్, వొక్కలిగ నాయకులు నివేదికను తిరస్కరించాలని ఒత్తిడి చేస్తుండగా, వెనుకబాటు తరగతులు, దళిత నాయకులు దానిని అమలు చేయాలని గట్టిగా కోరుతున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానం కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఈ వివాదం పార్టీ ఐక్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. ఏప్రిల్ 17, 2025న జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చ జరిగినప్పటికీ, నిర్ణయం తీసుకోకుండా మే 2, 2025కు వాయిదా వేయబడింది, ఇది ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఒత్తిడిని సూచిస్తుంది.
సామాజిక న్యాయం లేక రాజకీయ ఆట?
నివేదికలో ఓబీసీ రిజర్వేషన్‌ను 32% నుంచి 51%కి, ముస్లింల కోటాను 4% నుంచి 8%కి పెంచాలని సిఫార్సు చేయబడింది. ఇది మొత్తం రిజర్వేషన్‌ను 73.5%కి తీసుకెళుతుంది. ఇది సుప్రీం కోర్టు నిర్దేశించిన 50% పరిమితిని అధిగమిస్తుంది. ఈ సిఫార్సులు రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని పెంపొందించే లక్ష్యంతో ఉన్నప్పటికీ, బీజేపీ ఈ నివేదికను ‘విభజన రాజకీయాల‘ ఉపాయంగా విమర్శించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై. విజయేంద్ర, సిద్దరామయ్య హిందువులను, ముస్లింలను విభజించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదం కాంగ్రెస్‌ను రాజకీయంగా ఇరుకున పరిస్థితిలో నెట్టివేసింది.
ఐక్యత లేక విభజన?
ముఖ్యమంత్రి సిద్దరామయ్య, వెనుకబాటు తరగతుల ఛాంపియన్‌గా పేరుగాంచినవారు. ఈ నివేదికను అమలు చేయడం ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించాలని భావిస్తున్నారు. అయితే, పార్టీలోని లింగాయత్, వొక్కలిగ నాయకుల వ్యతిరేకత, రాష్ట్రంలో వారి ఆధిపత్య ఓటు బ్యాంక్‌ను కోల్పోయే భయం, ఆయనను దిలమాలో నిలిపాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో వొక్కలిగల మద్దతు కీలకంగా ఉంది. ఈ నివేదిక బహిర్గతం వారిని అలిగించడం ద్వారా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగించవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్‌కు కత్తిమీద సాము..
కుల గణన నివేదిక కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక కత్తిమీద సాముగా మారింది. ఒకవైపు సామాజిక న్యాయం కోసం వెనుకబాటు తరగతుల డిమాండ్‌లను నెరవేర్చాల్సిన బాధ్యత, మరోవైపు రాజకీయంగా శక్తివంతమైన లింగాయత్, వొక్కలిగ సమాజాల మద్దతును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వివాదం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఐక్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. సిద్దరామయ్య నాయకత్వం ఈ సంక్షోభాన్ని ఎలా నిర్వహిస్తుందనేది రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
కుల గణన నే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కొంపముంచింది.. దీనిపై రామ్ గారి సునీషిత విశ్లేషణను కింది వీడియోలో చూద్దాం
