TVK Vijay Congress Alliance: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా, ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీతో సినీ నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు ఇప్పుడు రాష్ట్రమంతటా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
కరూర్ ఘటన తర్వాత కీలక మలుపు తిరిగాయి. వాస్తవానికి, టీవీకే పార్టీ ప్రారంభమైన తొలినాళ్లలో విజయ్, అన్నాడీఎంకే , లేదా బీజేపీతో కలిసి పనిచేయవచ్చనే పుకార్లు బలంగా వినిపించాయి. ముఖ్యంగా, కరూర్ సభలో జరిగిన దుర్ఘటన (తొక్కిసలాట) తర్వాత ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా మార్చివేసిందని చెప్పవచ్చు, విజయ్ దూకుడుకు కొంత బ్రేక్ వేసింది. ఈ సమయంలోనే, ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి పళనిసామి ఏకంగా విజయ్‌ను సంప్రదించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
అయితే ఈ రాజకీయ అనిశ్చితి మధ్య విజయ్ వైఖరిపై విశ్లేషణలు భిన్నంగా ఉన్నాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే, విజయ్ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని లేదా వారి రాజకీయాలను విమర్శించలేదు, లేదా తూలనాడలేదు. ఇది ఆయన కాంగ్రెస్ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారనే సంకేతాలను పంపుతోంది.
మరోవైపు కాంగ్రెస్‌లో ఒక వర్గం తమిళనాడులో కొత్త స్నేహం కోసం ప్రయత్నిస్తోందని, టీవీకే అధ్యక్షుడు విజయ్‌ను కేంద్రంగా చేసుకుని రాజకీయాలు నడుపుతోందని కూడా సమాచారం. ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్… భవిష్యత్తులో డీఎంకేతో తెగతెంపులు చేసుకుని, టీవీకేతో కలిసి పోటీ చేసే అవకాశం ఉందా అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది.
టీవీకే అధినేత విజయ్ తీసుకునే తుది నిర్ణయం తమిళనాడు రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేయనుంది. ఆయన బీజేపీ-అన్నాడీఎంకే కూటమి వైపు మొగ్గు చూపుతారా, లేదా కాంగ్రెస్ నేతృత్వంలో కొత్త కూటమిని ఏర్పాటు చేస్తారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం తమిళ ప్రజల మనసులో ఏముంది, వారు మార్పుకు ఓటేస్తారా అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను పెంచుతోంది.
కాంగ్రెస్, డీఎంకే తో తెగతెంపులు, విజయ్ పార్టీతో కలిసి పోటీ? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
