Ramji Gond: భారతదేశం 75వ స్వాతంత్ర్య సంబురాలు జరుపుకుంటున్నది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్నది. ఈ సువిశాల భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి నాంది పలికింది 1857 తిరుగుబాటు. దీనినే సిపాయిల తిరుగుబాటు అంటారు. ఆ పోరులో తెలంగాణ కూడా ఒక భాగమైంది. అది కూడా ఓ గిరిజన నాయకుడి ధీరోదాత్తమైన పోరాటంతో బ్రిటిష్ సేనలను మట్టికరిపించింది. కాలం మర్చిపోయిన, చరిత్ర గుర్తించని ఆ నాయకుడి పేరే రాంజీ గోండు. చిరుత చూపు, సింహం పంజా, పులి దాడి.. ఇవన్నీ అతడి పోరాటం తాలూకు ఉపమానాలు.
అతడి నాయకత్వంలో వెయ్యి మంది రోహిల్లాలు, గోండులు కలిసి పాలకులను ముప్పు తిప్పలు పెట్టి నీళ్లు తాగించారు. బ్రిటిష్ సైన్యాలను దీటుగా ఎదుర్కొని తొలి గిరిజన పోరాట యోధుడిగా రాంజీ గోండు చరిత్రలో నిలిచిపోయారు. ప్రస్తుతం దేశం 75వ స్వాతంత్ర్య సంబురాలను జరుపుకుంటున్న వేళ ఆ యోధుడిని స్మరించుకోవడం, అతడి పోరాట పటిమను మననం చేసుకోవడం ఇప్పుడు అత్యావశ్యం.
Also Read: Modi-Chandrababu Meeting: ఏపీ చూపు హస్తినా వైపు.. ప్రధానితో చంద్రబాబు భేటీ పై విభిన్న కథనాలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి శ్రీకారం
దేశం మొత్తం బ్రిటిష్ పరిపాలనలో ఉంటే… తెలంగాణ ప్రాంతం మొత్తం అప్పట్లో నిజాం నవాబుల పాలనలో ఉండేది. నానాటికి వారి అరాచకాలు పెరుగుతుండడంతో జనాల్లో తిరగబడే స్వభావం మొదలైంది. దీనిని వారికి ఒంట పట్టించిన వాడు రాంజీ గోండు. భారతదేశంలో 1836 నుంచి 1860 కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గోండ్వానా ప్రాంతంలో భాగంగా ఉండేది. ఇక 1860 ప్రాంతంలో నాటి జునగావ్ ఇప్పటి ఆసిఫాబాద్ ను కేంద్రంగా చేసుకొని రాంజీ గోండు అలియాస్ మర్సికోళ్ల రాంజీ గోండు బ్రిటిష్ సైన్యాలను దీటుగా ఎదుర్కొన్నాడు. అదే సమయంలో ఉత్తర భారత దేశంలో ప్రథమ స్వాతంత్ర్య పోరాటం ఉవ్వెత్తున ఎగసింది. బ్రిటిష్ సైన్యంతో ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహెబ్, తాంతీయా తోపే, రావు సాహెబ్ పోరాడారు. ఆంగ్లేయుల బలగాల ముందు వారు నిలువలేక తమ అనుచరులతో తల దిక్కు విడిపోయారు. తాంతియాతోపే అనుచరులైన రోహిల్లాలు పెద్ద సంఖ్యలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీదర్, పర్భని తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించారు. మహారాష్ట్రలోని అజంతా, బస్మత్, లాతూర్, మక్తల్, తెలంగాణలోని నిర్మల్ తాలూకాలను పోరాట కేంద్రాలుగా చేసుకొని ఆంగ్లేయులపై పోరాటం మొదలుపెట్టారు. ఇదే సమయంలో నిర్మల్ తాలూకాలో ఉంటున్న ఆంగ్లేయ కలెక్టర్, ఇక్కడి తహసిల్దార్ ప్రజలకు నరకం చూపించేవారు. పన్నులు కట్టని వారిపై తూటాల వర్షం కురిపించేవారు. యుక్త వయసును అమ్మాయిలను చేరిచేవారు.
రాంజీ గోండు దృష్టి
ఆంగ్లేయుల ఆగడాలు పెరిగిపోవడంతో రాంజీ గోండు ఈ ప్రాంతంపై దృష్టి పెట్టాడు. ఒక సైన్యం లాగా ఏర్పడ్డాడు. వారికి విలువిద్యలో కఠోరమైన శిక్షణను ఇచ్చాడు. అతడి గిరిజన సైన్యానికి రోహిల్లా దండు తోడైంది. వారంతా కూడా రాంజీ సారథ్యంలో ఆంగ్లేయులపై తిరుగుబాటుకు తెరలేపారు. రాంజీ నాయకత్వంలో 1000 మంది రోహిల్లాలు, గోండులు కలిసి ఇప్పటి నిర్మల్ సమీపంలోని అడవులు కొండలు, చెరువులను పోరాట కేంద్రాలుగా ఎంచుకున్నారు. బ్రిటిష్ పాలకులను తుత్తునియలు చేశారు. ఈ క్రమంలో పరిస్థితి నానాటికి చెయ్యి దాటి పోతుండటంతో నిర్మల్ కలెక్టర్ అప్పటి హైదరాబాద్లోని రెసిడెంట్ కు సమాచారం ఇచ్చారు.
దీంతో కర్ణాటక ప్రాంతంలోని బళ్లారిలో స్వదేశీ దళం కర్నల్ రాబర్ట్ ఆధ్వర్యంలో నిర్మల్ ప్రాంతానికి చేరుకుంది. అదే సమయంలో రాంజీ గోండు సైన్యంపై విరుచుకుపడింది. వారంతా కూడా ఆధునిక ఆయుధాలతో వచ్చి రాంజీ గోండు సైన్యంపై దాడి చేసినా ఇక్కడి భౌగోళిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని రెండుసార్లు ఆదివాసి వీరులు వారిని ఓడించారు. దీంతో ఈ ప్రాంతంలో వారిని ఓడించడం కష్టమని ఆనాటి పాలకులు భావించి అనంతరం వారిని దొంగ దెబ్బ తీశారు. గోదావరి నది సమీపంలోని సోన్ ప్రాంతంలో రాంజీ గోండు తో సహా 1000 మందిని సజీవంగా పట్టుకున్నారు. వారందరినీ కూడా ఈడ్చుకుంటూ తీసుకువచ్చి నిర్మల్ శివారులో ఉన్న ఊడలు దిగిన మహామరిచెట్టుకు అందరూ చూస్తుండగా ఉరితీశారు. అయితే ఈ సంఘటన 1860 ఏప్రిల్ 9న జరిగినట్టు చరిత్రకారులు చెబుతారు. మాతృభూమి కోసం చిరునవ్వులతో ఊరుకొయ్యలను ముద్దాడిన గోండు వీరుల స్ఫూర్తి ఆ తర్వాతి తరం స్వాతంత్ర్య సమర యోధులకు ప్రేరణగా నిలిచింది. ఇంతటి పోరాటపటిమని చూపిన రాంజీగోండును ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరం. ప్రస్తుతం దేశం 75వ స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటున్న వేళ ఆ మహనీయుడిని స్మరించుకోవడం భారతీయులుగా మన కనీస కర్తవ్యం.
Also Read:Nandamuri Balakrishna Fires On Dil Raju: నిర్మాత దిల్ రాజు పై నిప్పులు చెరుగుతున్న నందమూరి బాలకృష్ణ
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ramji gondu a gond warrior who fought against the british
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com