R Krishnaiah: 2019లో ఏకపక్ష విజయం సొంతం చేసుకున్న జగన్ కు ఓటమి భయం పట్టుకుందా? ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా, అప్పులు చేసి మరీ ప్రజలకు పంపిణీ చేస్తున్నా వారిలో సంత్రుప్తి లేదా? తన సభలకు అరకొర జనం వస్తుండడం వైసీపీ అధినేతకు కలవరపాటుకు గురిచేస్తుందా? అందుకే వచ్చే ఎన్నికల్లో గెలుపునకు దోహదపడే ఏ అవకాశాన్ని ఆయన వదులుకోవట్లేదా? అందులో భాగంగానే బీసీ నేత ఆర్.క్రిష్ణయ్యకు రాజ్యసభకు ఎంపిక చేశారా?.. అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఏపీలో రాజ్యసభ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది.
ఖాళీ కానున్న స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి అధికార పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. అయితే.. అనూహ్యంగా వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బీసీ నేత ఆర్.కృష్ణయ్యను ఖరారు చేసింది. జగన్ ప్రభుత్వం రాజకీయ వ్యూహంలో భాగంగానే కృష్ణయ్యకు ఈ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. సామాజిక సమీకరణాల్లో భాగంగానే ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపించాలని వైసీపీ నిర్ణయించింది.
Also Read: YCP Rajyasabha: తెలంగాణ వారికి రాజ్యసభ పదవులు.. వైసీపీలో ఆక్రోశం.. జగన్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?
ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ టికెట్ ఇచ్చి పార్లమెంట్‌కు పంపడం ద్వారా బీసీల్లో వైసీపీ పట్ల మైలేజ్ వస్తుందని, వచ్చే ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకుపై ఈ పరిణామం ప్రభావం చూపుతుందని వైసీపీ లెక్కలు కడుతోంది. సడన్‌గా బీసీల వైపు వైసీపీ చూపు పడటానికి మరో ప్రధాన కారణం కూడా ఉంది. ఏపీలో బీసీలు ఇంత కాలం టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. గత ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకులో కొంత వైసీపీకి కలిసొచ్చిందే తప్ప ఆ పార్టీ వెంటే బీసీలు ఉన్నారని జగన్ కూడా భావించడం లేదు. మంత్రివర్గంలో బీసీలకు పెద్ద పీట వేశామని చెప్పుకుంటున్న వైసీపీకి …. బీసీ వర్గాల్లో మాత్రం చెప్పుకోదగ్గ ఆదరణ అయితే లేదు. అందుకే.. ఆర్.కృష్ణయ్యను రాజ్యసభ ఎంపీగా ఖరారు చేయడం ద్వారా బీసీల్లో వైసీపీ పట్ల సానుకూలత వస్తుందని జగన్ భావిస్తున్నారు.
బీసీ ఓట్ల కోసమే..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. రాష్ట్ర జనాభాలో 49.55 శాతం బీసీలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు బీసీల ఓట్లు అన్ని పార్టీలకు కీలకం. ఆది నుంచి టీడీపీ వైపు ఉన్న బీసీలు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో తెలుగుదేశం పార్టీకి గుంపగుత్తిగా ఓటేస్తారన్న భయం జగన్ ను వెంటాడుతోంది. అందుకే ఇటీవల ఆయన బీసీ మంత్రం పఠిస్తున్నారు. మంత్రివర్గంలో బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించడం, తాజాగా ఆర్.కృష్ణయ్యకు పిలిచి మరీ రాజ్యసభ సీటివ్వాలని జగన్ భావించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. జగన్ అంచనాలు తప్పే అవకాశమూ లేకపోలేదు. ఎందుకంటే.. 2014లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇదే ఆర్.కృష్ణయ్యను చంద్రబాబు ప్రకటించారు. ఆదిలాబాద్‌లో జరిగిన టీడీపీ ఎన్నికల బహిరంగ సభ సాక్షిగా కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా బాబు ప్రకటించారు. టీడీపీకి ఎంతో మద్దతుగా నిలిచే బీసీలు కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఏకపక్షంగా టీడీపీకి ఓట్లు వేస్తారనే వ్యూహంలో భాగంగా తెలుగుదేశం ఈ ప్రయత్నం చేసింది. కానీ.. ఆ ఎన్నికల్లో టీడీపీకి కేవలం 12 సీట్లు మాత్రమే దక్కాయి. చంద్రబాబు బీసీ వ్యూహం లెక్క తప్పింది.
చేతులు కాల్చుకున్న టీడీపీ..
అయితే తెలుగుదేశం పార్టీ చేసిన ప్రయోగం.. మరోసారి వైసీపీ చేస్తోంది. అయితే పెద్దగా కలిసిరాకపోవచ్చనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గంలో బీసీలను తీసుకున్నామని, బీసీ కార్పొరేషన్ పదవులను పెద్ద ఎత్తున ఇచ్చామని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీల్లో అట్టడుగున ఉన్నవారికి చేసిందేమీ లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కీలకమైన పోర్టుపోలియోలు తన సొంత సామాజికవర్గానికి కట్టబెట్టి.. ప్రాధాన్యత లేని శాఖలు కేటాయించారని ఒక అపవాదు నడుస్తోంది. బొత్సలాంటి బీసీ నాయకుడికి ఇష్టం లేని శాఖకు పంపించారన్న ప్రచారమూ ఉంది. బీసీ కులాలకు సంబంధించి కార్పొరేషన్లు ఏర్పాటుచేసినా.. వాటికి ఏమంత నిధులు, విధులు లేవు. ఒక విధంగా చెప్పాలంటే బీసీలు వైసీపీపై గుర్రుగా ఉన్నారు. ఈ సమయంలో
బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య ఒక్కరికి రాజ్యసభలో ప్రాతినిధ్యం కల్పించినంత మాత్రాన ఏపీలో ఉన్న బీసీలంతా తమకే ఓటేస్తారని వైసీపీ భావిస్తే మాత్రం అతిశయోక్తే అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటివ్వాలని జగన్ భావించడాన్ని బీసీ సామాజిక వర్గం మనసు గెలుచుకోవడానికి వైసీపీ చేస్తున్న ఒక ప్రయత్నంగా మాత్రమే భావించాలని అభిప్రాయపడుతున్నారు.
Also Read:Janasena: జగన్ ప్రసంగం పది నిమిషాలు కూడా జనాలు వినడం లేదు
Recommended Videos
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: R krishnaiah among four rajya sabha nominees from andhra pradesh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com