YS Sharmila: అప్పుడెప్పుడో హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించిన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని ఉపయోగించుకొని ఇప్పటికీ రాజకీయం కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు.. నాన్న వైఎస్ఆర్ మరణంతోనే కదా.. ఏపీకి జగన్ ఇప్పుడు సీఎం అయ్యింది.. అన్నతో విభేదించి తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ఒంటరిగా పోరాడుతోంది. వీరిద్దరి రాజకీయ అభిలాష వెనుక కేవలం వైఎస్ఆర్ మరణం ఉంది.

అయితే వైఎస్ఆర్ మరణం అనేది అందరికీ విషాదమే.. ఇప్పటికీ ఈ ప్రమాదాన్ని ఎవరూ జీర్ణించుకోరు. ఆయన బతికుంటే అసలు తెలంగాణ వచ్చేది కాదు. కేసీఆర్ సీఎం అయ్యిండేవారు. వైఎస్ఆర్ నాడు అంతటి బలమైన నేత.
రాజకీయం కోసం ఇప్పుడు వైఎస్ కూతురు షర్మిల తండ్రి మరణాన్ని అనుమానాస్పదం చేస్తున్నారు. వైఎస్ఆర్ ను చంపారు… నన్ను చంపుతారంటూ తెలంగాణలోని వనపర్తిలో సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు బేడీలు చేతబట్టి దమ్ముంటే తన వ్యాఖ్యలకు అరెస్ట్ చేసుకోవచ్చని సవాల్ చేశారు.
జగన్, షర్మిల ఇలా వైఎస్ మరణాన్ని రాజకీయంగా వాడుకోవడం ఇదే తొలిసారి కాదు.. గతంలో విజయమ్మ, జగన్, షర్మిలలు ఏపీలో ప్రచార సమయంలో రిలయన్స్ పై ఇవే ఆరోపణలు చేశాడు. నాడు రిలయన్స్ షోరూలంపై దాడులు కూడా జరిగాయి.
ఇప్పుడు మళ్లీ షర్మిల అదే పాట పాడారు. తెలంగాణలో 2 వేల కి.మీలు పాదయాత్ర చేసినా ఫాఫం అసలు షర్మిలను పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. అందుకే అధికార టీఆర్ఎస్ నేతలను తిడితే.. వారు ప్రతిస్పందిస్తే ఫేమస్ అవ్వచ్చని వైఎస్ షర్మిల ప్లాన్ చేసినట్టు ఉంది. ఇటీవల షర్మిల బూతులు తిడుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఇదేదో వర్కవుట్ అయ్యేలా ఉందని భావించిన షర్మిల తాజాగా కొత్తగా ట్రై చేశారు.ఏకంగా మీడియా ముందుకు సంకెళ్లు పట్టుకొని వచ్చి హల్ చల్ చేశారు. వైఎస్ఆర్ ను చంపారని.. తనను చంపడానికి కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తనను దమ్ముంటే ఇలా అన్నందుకు అరెస్ట్ చేసుకోండని సవాల్ చేశారు. ఇలా కేసీఆర్ ను, టీఆర్ఎస్ సర్కార్ ను మరోసారి టార్గెట్ చేశారు.
ఇలా అధికార టీఆర్ఎస్ తో పెట్టుకొని వారి ప్రతిస్పందనతో పాపులర్ కావాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రజల ఫోకస్ తనవైపు రావాలనే వైఎస్ఆర్ హత్యఅని.. తనను చంపేస్తారంటూ మళ్లీ రాజకీయం మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.
షర్మిల ‘హత్య’ వ్యాఖ్యల వెనుక అంతరంగం ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. జగన్ కు అడ్డుగా ఉన్న వారందరూ హత్యకు గురికావడం వెనుక ఒక అదృశ్య శక్తి ఉందని.. ఈ మేరకు అది తెలిసే షర్మిల ఇలా వ్యాఖ్యానిస్తున్నారని.. జగన్ కు దూరంగా జరగడం వెనుక అదే కారణమన్నదన్న వాదన వినిపిస్తోంది. వైఎస్ వివేకా సహా కొంత మంది హత్యల వెనుక ఉన్నవారు షర్మిలకు తెలుసా? అందుకే ఇలా మాట్లాడారా? అన్న ప్రచారం కూడా సాగుతోంది. మరి ఈ వ్యాఖ్యల వెనుక కారణం ఏంటన్నది.. వారి అంతరంగ రాజకీయంలో ఎవరు ఉన్నారన్న దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.