AP panchayat elections : వైసీపీకి 22 పంచాయతీలే.. ఆ సర్వేలన్నీ ఫేక్ యేనా?

మొత్తం 34 సర్పంచ్ స్థానాలకు శనివారం పోలింగ్ నిర్వహించారు. అందులో 22 చోట్ల వైసీపీ మద్దతుదారులు, రెబల్ అభ్యర్థి మరోచోట గెలిచారు.

Written By: NARESH, Updated On : August 20, 2023 10:38 am
Follow us on

AP panchayat elections : వైసీపీకి డేంజర్స్ బెల్స్ మోగాయి. పల్లెల్లో మార్పు స్పష్టంగా కనిపించింది. పంచాయతీలు, వార్డు ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ పార్టీకి కంచుకోట లాంటి పంచాయతీలు కొట్టుకుపోయాయి. వైసీపీ స్వల్ప ఆధిక్యతనే కనబరిచింది. తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. అటు జనసేన సైతం ఉనికి చాటుకుంది.

ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగిన స్థానాలన్నీ వైసీపీవే. వాలంటీర్లు ఉన్నారు. పథకాలు ఆపేస్తామన్న బెదిరింపులు ఉన్నాయి. ఆపై పవర్ ఉంది. అయినా ఈ ఉప ఎన్నికల్లో వైసీపీకి ఎదురుగాలి వీచింది. అన్ని రకాల ఆస్త్రాలు పెట్టుకుని ఓటర్లపై దండెత్తినా ఫలితం లేకపోయింది. వాస్తవానికి అవి గ్రామస్థాయి ఎన్నికలు. స్థానిక అంశాలను ఓటర్లు పరిగణలోకి తీసుకుంటారు. తాము ఓటు వేయకపోతే వేధిస్తారేమోనన్న భయం వారికి వెంటాడుతుంది. అందునా అధికార వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలంటే సాహసంతో కూడుకున్న పని. ఓ సైన్యం మాదిరిగానే వాలంటీర్లు ఉన్నారు. ఓటర్ల పై వారి ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సరే ఒత్తిళ్లకు ఎదురొడ్డి మరి ఓటర్లు విపక్షాలను గెలిపించారు. అధికార పక్షానికి చుక్కలు చూపించారు.

మొత్తం 34 సర్పంచ్ స్థానాలకు శనివారం పోలింగ్ నిర్వహించారు. అందులో 22 చోట్ల వైసీపీ మద్దతుదారులు, రెబల్ అభ్యర్థి మరోచోట గెలిచారు. తెలుగుదేశం మద్దతుదారులు తొమ్మిదిచోట్ల, టిడిపి, జనసేన కలిపి రెండు చోట్ల విజయం సాధించారు. మొత్తం 243 వార్డులకు ఎన్నికలు జరగగా.. వైసీపీ మద్దతుదారులు 141 వార్డులు, తిరుగుబాటు అభ్యర్థులు రెండు చోట్ల, టిడిపి మద్దతుదారులు 90 చోట్ల, జనసేన మద్దతుదారులు ఐదుచోట్ల,టిడిపి, జనసేన కలిపి ఒకచోట, సిపిఎం ఒకచోట, ఇతరులు మూడు వార్డులను గెలుచుకున్నారు.

మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 64 సర్పంచ్, వెయ్యి ఒకటి వార్డు సభ్యుల స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 6న నోటిఫికేషన్ జారీచేసింది. అయితే ఇందులో 30 సర్పంచ్, 756 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే చాలాచోట్ల ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి ఏకగ్రీవం చేసుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి. నిన్న జరిగిన పోలింగ్లో సైతం అధికార వైసీపీ నేతలు ఓటర్లకు ప్రలోభాలకు గురి చేసినట్లు విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయినా సరే అధికార పక్షానికి ధీటుగా.. విపక్షాలు సత్తా చాటడం విశేషం. దీంతో పల్లెల్లో సైతం అధికార వైసిపికి ప్రమాద ఘంటికలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులు కిందటే వైసిపికి ఏకపక్ష విజయం దక్కుతుందని ఓ సర్వే వెల్లడయింది. దీనిని ఫేక్ సర్వేగా విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. ఇప్పుడు పంచాయతీ ఉప ఎన్నికల్లో అదే నిజమైంది.