Pawan vs YCP : జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఫల్యాలను రియాక్ట్ అయిన ప్రతీసారి ఒక సీన్ రిపీట్ అవుతుంది. కొందరు మంత్రులు తెరపైకి వస్తారు. పవన్ ను అనరాని మాటలు అంటారు. ఒకరిద్దరైతే బూతులు కూడా మాట్లాడతారు. ఇప్పటం బాధితులకు సాయం చేసిన నేపథ్యంలో పవన్ వైసీపీ పాలకులకు హెచ్చరించి మాట్లాడారు. ముఖ్యంగా ఈ ఘటన వెనుక పాత్రదారిగా అనుమానిస్తున్న సజ్జల రామక్రిష్ణారెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తానని హెచ్చరించారు. జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే బదులు తీర్చుకుంటానని కూడా వార్నింగ్ ఇచ్చారు. అయితే దీనిపై కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ హైకమాండ్ మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆర్ కే రోజాలకు పర్మిషన్ ఇచ్చినట్టుంది. అందుకే మీడియా ముందుకొచ్చిన వారు పవన్ పై ఏడుపులు ప్రారంభించారు. పాత చింతకాయల వాసనల మాదిరిగా పవన్ పై అవే ఆరోపణలు చేస్తూ మాట్లాడారు. పవన్ ను ఒక నాయకుడిగా కూడా అంగీకరించలేమన్నట్టు అర్ధం వచ్చేలా కామెంట్స్ చేశారు.

పేర్ని నాని మాట్లాడుతూ జనసేన ఒక పార్టీయేనా అన్నట్టు మాట్లాడారు. వైసీపీపై యుద్ధానికి బీజేపీకి రూటు మ్యాప్ అడగడమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ చరిత్రలో ఇటువంటి పార్టీ ఉంటుందా? అని కూడా ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో ఎందుకు పోటీచేయలేదని ప్రస్తావించారు. నాయకుడంటే జగన్మోహన్ రెడ్డి అని.. నీకంటే చిన్నవాడైనా ఎన్నికల్లో గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడని తెలుసుకోవాలని మరీ పవన్ కు సూచించారు. 2014 ఎన్నికల్లో 67సీట్లు, 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించినప్పుడు నోట్టో వేలు పెట్టుకొని చూసిన విషయం మరిచిపోయావా అంటూ పవన్ ను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుపొందితే అప్పడు కూడా నోట్లో వేలు పెట్టుకొని చూడాల్సి ఉంటుందని షటైర్ వేశారు. ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు కాళ్లు పట్టుకున్నది నీవు కాదా? అంటూ తీవ్ర వ్యాఖ్యానాలు చేశారు. నువ్వు ప్రధానితో ఏం మాట్లాడావో తమకు అవసరం లేదని..చంద్రబాబు టెన్షన్ తో ఉన్నారని.. ఆయనకు చెప్పాలని సూచించారు. అయితే పేర్ని నాని అటు తిప్పి.. ఇటు తిప్పి మాట్లాడారే తప్ప.. ఎక్కడా పవన్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. ఇప్పటం విధ్వంసం వెనుక సజ్జల లేరని నివృత్తి చేయలేకపోయారు.
మంత్రి బొత్స సత్యనారాయణ సైతం నాటి పీఆర్పీ నుంచి నేటి జనసేన వైఫల్యాల వరకూ మాట్లాడారు. పవన్ వి మాటలు తప్పించి చేతల్లో చూపించలేరని కూడా చెప్పుకొచ్చారు. 2009లో మీ అన్నయ్య చిరంజీవి, 2014, 2019 ఎన్నికల్లో పవన్ పార్టీ వైఫల్యం గురించి మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్ చేశారు. ఇప్పటంలో ప్రభుత్వం చేస్తున్నది అభివృద్ధి మాత్రమేనని విధ్వంసం కాదని అన్నారు. అది అనవసరం అనుకుంటే బహిరంగంగా చెప్పాలని పవన్ కు సవాల్ విసిరారు. లేనిపోని హడావుడి ఎందుకంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే బొత్స సైతం పవన్ లేవనెత్తిన అంశాలను కాకుండా సరికొత్త వక్రభాష్యంతో మాట్టాడారు. ఇప్పటంలో ప్రభుత్వం తప్పు చేయలేదని మాత్రం చెప్పలేకపోయారు.
మంత్రి ఆర్కే రోజా అయితే పవన్ సినిమాల్లో మాత్రమే హీరో అని.. రాజకీయాల్లో జీరోగా అభివర్ణించారు. పవన్ కు దమ్ముంటే రాష్ట్రంలో 175 స్థానాల నుంచి అభ్యర్థులను నిలబెట్టాలని తన పాత సవాల్ నే బయటకు తీశారు. ఇప్పటం గ్రామం మంగళగిరి నియోజకవర్గంలో ఉందని.. అక్కడ గత ఎన్నికల్లో నారా లోకేష్ పోటీచేసి ఓడిపోయారని.. గ్రామస్థులకు అన్యాయం జరిగి ఉంటే లోకేష్ పరామర్శిస్తే సరిపోయేదని పొంతన లేని కామెంట్స్ చేశారు. చంద్రబాబే పవన్ ను ఇప్పటం గ్రామానికి పంపించి వివాదం సృష్టించారని కూడా పసలేని ఆరోపణలు చేశారు. పవన్ ఓవరాక్షన్ తగ్గించుకోవాలని కూడా సూచించారు. అయితే దీనిపై జనసైనికులు మండిపడుతున్నారు. అసలు పవన్ లేవనెత్తిన అంశాలేమిటి? మంత్రులు, వైసీపీ నేతలు చెబుతున్నదేమిటని ప్రశ్నిస్తున్నారు. అనవసరంగా పవన్ పై ఏడుస్తున్నారని. వీరికి మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు.