Kapus Janasena YSP : తెలుగు రాష్ట్రాల్లో కుల రాజకీయాలు ఎక్కువ. ఎన్నికల్లో ప్రభావితం చూసేది కులాలే. కులాలకు అతీతంగా రాజకీయాలు నెరపాల్సిన నేతలు కూడా కులాలుగా విభజించే పనే చేస్తున్నారు. అన్ని కులాలను తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువయ్యాయి. తెలంగాణలో కులాల ప్రాతిపదిక కేసీఆర్ పథకాలు పెడుతుంటే.. ఆంధ్రాలో సీఎం జగన్ రిజర్వేషన్ల మంత్రం జపిస్తున్నారు. గత ఎన్నికల్లో కాపు రిజర్వేషన్లే ఆయనను గట్టెకించాయి. తాజాగా మళ్లీ కాపు రిజర్వేషన్లు..వచ్చే ఎన్నికల్లో కాపు ఓటింగ్ పైన చర్చ జరుగుతోంది. ఈ సమయంలో తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాజకీయగా పని చేసిన పి.రామ్మోహన్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాపులు బీసీ రిజర్వేషన్ కోసం పోరాడవద్దని సూచించారు. ఈ పోరాటం కారణంగా బీసీలకు దూరమయ్యామని చెప్పుకొచ్చారు. తుని ఘటనతో కాపు యువతపై అల్లరి మూకలనే ముద్ర పడిపోయిందన్నారు. సమష్టి నాయకత్వం కాపుల్లో అవసరమని చెప్పుకొచ్చారు.
సినిమావాళ్లను నమ్ముకొని రాజకీయాలు తగదు..
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పాపిశెట్టి రామ్మోహన్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రభుత్వంలో సుదీర్ఘ కాలంలో ఆయన అధికారిగా పనిచేశారు. 2019లో జనసేనలో చేరారు. ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాజకీయ సలహాదారుగా నియమించారు. మంగళగిరిలో జరిగిన రాయల్ ఆంధ్రప్రదేశ్ కాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం వార్షిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన కాపు సంబంధిత అంశాలపైన స్పందించారు. సినిమా వాళ్లనో, ఓ పరిశ్రమనో నమ్ముకొని రాజకీయం చేయటం కాపులకు అసాధ్యమని అభిప్రాయపడ్డారు. కులంలో నుంచి సమష్టి నాయకత్వం వచ్చినప్పుడే ఈ సామాజిక వర్గం ముందుకు వెళ్తుందని వ్యాఖ్యానించారు.
రిజర్వేషన్ కోసం పోరాటం వృథా ప్రయాసే..
కాపులు బీసీ రిజర్వేషన్ కోసం పోరాడద్దని రామ్మోహన్‌రావు సూచించారు. గతంలో ముద్రగడ పద్మనాభానికీ ఈ విషయం తాను చెప్పానన్నారు. ఈ పోరాటం కారణంగా బీసీలకు దూరమయ్యామని వివరించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కాపులుగా ఎదిగారని, 38 మంది కాపు నేతలు ఎమ్మెల్యేలు అయ్యారని, పలువురు ఎంపీలు అయ్యారని చెప్పుకొచ్చారు. వారికేమీ రిజర్వేషన్లు లేవన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాపులకు బీసీ రిజర్వేషన్∙అమలు సాధ్యం కాదన్నారు. అలా ఇస్తామని హామీ ఇచ్చినా అది ఒట్టిమాటేనని చెప్పారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చినా దాని వల్ల ప్రయోజనం ఉండదన్నారు. బీసీలు, ఇతర కులాలను కలుపుకుని వెళ్తేనే రాజ్యాధికారం సాధ్యపడుతుందని చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రులు అవ్వాలి కదా..
ఇదే సమయంలో మరిన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు రామ్మోహన్‌రావు. రాష్ట్రంలో కొన్ని వర్గాలు 75 ఏళ్ల కాలంగా 20 శాతం రిజర్వేషన్లు పొందుతున్నారని వివరించారు. వారు ఈ పాటికే ముఖ్యమంత్రులు అవ్వాలి కదా, ఎందుకు కాలేదని ప్రశ్నించారు. బీసీలతో పాటుగా ఇతర కులాలను కలుపుకొని పోవాలని సూచించారు. 4–5 శాతం ఉన్న జనాభా ఉన్న కులాలు రాజ్యమేలుతున్నారనే తప్పుడు ఆలోచనల్లోకి కాపులు వెళ్లిపోయారని, అది సరికాదని విశ్లేషించారు. ఇప్పుడు ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో రామ్మోహన్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణమవుతున్నాయి.
జనసేనకు దూరం చేసేందుకేనా..
2019 ఎన్నికల్లో వైసీపీకి కాపులు అండగా నిలిచారు. అప్పటి వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వం కాపు వ్యతిరేకి అని చూపి జగన్ కాపు ఓట్లను తమవైపు తిప్పుకోవడంలో విజయం సాధించారు. రిజర్వేషన్ల ఎర వేశారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావొస్తున్నా.. రిజర్వేషన్లు మాత్రం అమలు చేయడం లేదు. దీంతో కాపులు క్రమంగా వైసీపీకి దూరమవుతున్నారు. జనసేనకు దగ్గరవుతున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎస్ రామ్మోహన్‌రావు కాపుల అంశాన్ని తెరపైకి తేవడం ఆంధ్రా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జనసేన నుంచి కాపులను దూరం చేయడంలో ఇది భాగమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.