Loan APP :ఏపీలో లోన్ యాప్ ల ఆగడాలకు ఇటీవల ఓ ఆడకూతురు చనిపోవడం అందరినీ కంటతడిపెట్టించింది. ఆమె తల్లితో మాట్లాడిన చివరి మాటలు విని టీవీ9 యాంకర్ కూడా కంటతడి పెట్టిందంటే ఆ యాప్ ల ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు..

50 వేలు అప్పుతీసుకున్న పాపానికి ఆ 50 వేలు కట్టినా ఇంకా వడ్డీకి వడ్డీ వేసి కట్టాలంటూ వేధించడం.. కట్టకపోతే ఆమె మార్ఫింగ్ నగ్న ఫొటోలు, వీడియోలను బంధువులకు పంపి పరువు తీస్తామని బెదిరించడంతో చేసేదేం లేక ఆ మహిళ ఉసురుతీసుకుంది. ఇలాంటి ఆగడాలు ఏపీలో కొకొల్లలుగా సాగుతున్నా ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదు.
తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లకు సంబంధం లేకున్నా.. ఎవరో ఏదో బంధువులు అని ఫోన్ నంబర్లు ఇస్తే ఫోన్లు బెదిరింపులకు పాల్పడిన ఆడియోలు వైరల్ అయ్యాయి.
రూ.8 లక్షలు ఎవడో తీసుకొని మాజీ మంత్రి అనిల్ కుమార్ తన బావ అని ఆయన ఫొన్ నంబర్ ను ఈ లోన్ యాప్ సంస్థకు ఇచ్చాడట.. ఆ లోన్ యాప్ వాళ్లు ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదన్న దాదాపు 20 సార్లు కాల్ చేసి విసిగించారు. కడతావా? చస్తావా? అన్నట్టుగా మాజీ మంత్రి అనిల్ ను వేధించారు. చివరకు తిట్టినా..మొత్తుకున్నా వదల్లేదు. మీరిద్దరూ కలిసి డబ్బులు వాడుకొని ఇప్పుటు కట్టనంటే కుదరదని.. ఏకంగా ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ పైనే రెచ్పిపోయారు.
ఇంతలా లోన్ యాప్ ల ఆగడాలు పెచ్చుమీరుతున్నా ఏపీ ప్రభుత్వం కానీ.. పోలీసులు కానీ ఇప్పటివరకూ పట్టించుకున్న పాపాన పోలేదు.స్వయంగా ఈ విషయంలో తాజాగా వైసీపీ మంత్రి, మాజీ మంత్రిని బెదిరించాక.. వారి వాయిస్ లు బయటకు వచ్చాక వైసీపీ ప్రభుత్వం పరువు పోయినట్టైంది.ఇప్పటికైనా ఈ విశృంఖలంగా ప్రజలపై ఎగబడుతూ వారి ప్రాణాలు పోయేలా చేస్తున్న లోన్ యాప్ లు, వారి నిర్వాహకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. బాధితులైన అధికార వైసీపీ నేతలే దీనిపై ఉక్కుపాదం మోపాలి. అప్పుడే ప్రజలకు , నేతలకు వీరి పీడ విరగడవుతుంది..
